IPL 2023: అంతమాట అన్నావేంటి పాంటింగ్! ఢిల్లీ హెడ్‌కోచ్‌గా ఉండి ఆ టీమ్‌లే ఫైనల్‌కు వెళ్తాయంటావా?
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 లో ఢిల్లీ క్యాపిటల్స్ కు హెడ్ కోచ్ గా ఉన్న రికీ పాంటింగ్.. ఈసారి ఫైనల్స్ చేరే జట్లేవో చెప్పాడు.
Ricky Ponting: మనం పనిచేసే సంస్థకు ఎంతో విధేయంగా ఉండాలి. ఒకరి దగ్గరి పనిచేస్తూ వారి ప్రత్యర్థులను పొగిడితే అది మొదటికే మోసం.. క్రికెట్ లో అయితే ఇది దారుణమే. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ గా ఉన్న రికీ పాంటింగ్ ఇటువంటి దారుణ వ్యాఖ్యలే చేశాడు. ఢిల్లీకి హెడ్ కోచ్ గా ఉన్న పాంటింగ్.. ఈసారి ఐపీఎల్ లో ఫైనల్ చేరే జట్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పాంటింగ్ చెప్పిన పేర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ లేకపోవడమే ఇందుకు కారణం.
ఐపీఎల్ లో కేకేఆర్, ముంబై తరఫున ఆడిన ఈ మాజీ ఆసీస్ సారథి తాజాగా స్పందిస్తూ.. ‘ఈసారి ఫైనల్స్ కు వెళ్లే టీమ్స్ లో గుజరాత్ టైటాన్స్ తప్పకుండా ఉంటుంది. మరో టీమ్ గతేడాది ఫైనల్ చేరిన రాజస్తాన్ రాయల్స్. నా అభిప్రాయం ప్రకారం, రాజస్తాన్ కు బలమైన జట్టు ఉంది. గత కొన్నాళ్లుగా వాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రాజస్తాన్ బాగా ఆడుతుంది..’ అని చెప్పాడు.
మాట మాత్రానికైనా ఢిల్లీ పేరెత్తని పాంటింగ్..
గుజరాత్, రాజస్తాన్ లు ఈ ఏడాది టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్నాయి. చెన్నై, ముంబైల మాదిరిగానే ఆ రెండు జట్లకూ మెరుగైన ఆటగాళ్లు ఉన్నారు. ఇక వీరితో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (గత మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్ చేరింది), సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పటిష్టంగానే కనిపిస్తున్నాయి. వీరే గాక ఢిల్లీ క్యాపిటల్స్ లో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు.
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ఆన్రిచ్ నోర్త్జ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిలీ రూసో, ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. అదీగాక గడిచిన నాలుగు సీజన్లలో ఢిల్లీ మూడు సార్లు ప్లేఆఫ్స్ కూడా చేరింది. కొత్త సీజన్ లో డేవిడ్ వార్నర్ తమకు తొలి ట్రోఫీని అందిస్తాడనే పట్టుదలతో ఢిల్లీ మేనేజ్మెంట్ ఉంది. కానీ పాంటింగ్ మాత్రం మాట మాత్రానికైనా టోర్నీ ఫేవరేట్ల జాబితాలో తాను హెడ్ కోచ్ గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఉందని చెప్పకపోవడం ఆ జట్టు అభిమానులకు కోపం తెప్పిస్తున్నది.
కాగా రిషభ్ పంత్ గాయంతో ఈ సీజన్ లో వార్నర్ సారథ్యంలో ఆడనున్న ఢిల్లీ.. తమ తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది. ఏప్రిల్ నాలుగున తమ స్వంత గ్రౌండ్ (అరుణ్ జైట్లీ స్టేడియం) లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. పంత్ లేని లోటు తెలియకుండా ఢిల్లీలో జరిగే మ్యాచ్ లకు అతడు అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చేలా ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. పంత్ రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటూనే అతడిని ఢిల్లీ డగౌట్ లో ఉండేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నది.