Babar Azam: ఓటముల బాధలో ఉన్న బాబర్‌కు మరో షాక్ - పాక్ సారథిపై కేసు నమోదు చేయనున్న హైదరాబాదీ నటి
భారీ టోర్నీలలో విఫలమవుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు మరో భారీ షాక్. హైదరాబాదీ నటి అతడిపై కేసు వేసేందుకు సిద్ధమవుతున్నది.
Babar Azam: ఆసియా కప్ - 2023లో సూపర్ - 4 లోనే నిష్క్రమించి డ్రెస్సింగ్ రూమ్ గొడవలు, జట్టు నిండా గాయాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్‌కు మరో భారీ షాక్ తప్పేలా లేదు. అతడిపై హైదరాబాద్ (తెలంగాణ రాజధాని కాదు.. పాకిస్తాన్‌లో కూడా హైదరాబాద్ ఉంది) కు చెందిన నటి సెహర్ షిన్వారి కేసు వేసేందుకు సిద్ధమైంది. తమ దేశ ప్రజల ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నదందుకు గాను ఆమె బాబర్‌పై ఎఫ్ఐఆర్ నమోదుచేస్తానని ట్విటర్ వేదికగా ప్రకటించడం సంచలనం రేపింది.
పాక్ ఓటమితో ఆగ్రహం..
ఆసియా కప్ ప్రారంభానికి ముందు వరల్డ్ నెంబర్ వన్ టీమ్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్.. గ్రూప్ స్టేజ్‌లో బాగానే ఆడింది. నేపాల్‌పై భారీ విజయం సాధించిన పాక్.. భారత్‌తో మ్యాచ్ (వర్షం కారణంగా ఫలితం తేలలేదు) ఆధిక్యం సాధించింది. కానీ సూపర్ - 4 దశలో ఆ జట్టు దారుణమైన ప్రదర్శనలతో విమర్శల పాలైంది. రెండ్రోజుల పాటు భారత్‌తో ఆడిన మ్యాచ్ (వర్షం వల్ల రిజర్వ్ డే రోజు కూడా ఆడారు)లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. లంకతో కూడా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే భారత్‌తో కీలక మ్యాచ్‌లో ఓడిన తర్వాత సెహర్ షిన్వారి ట్విటర్ వేదికగా స్పందించింది.
షిన్వారి స్పందిస్తూ.. ‘నేను బాబర్ ఆజమ్, అతడి టీమ్ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదుచేయబోతున్నా. ఎందుకంటే వీళ్లు క్రికెట్ ఆడటానికి బదులు మా దేశ ప్రజల ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నారు..’ అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. వాస్తవానికి భారత్ - పాక్ మ్యాచ్ తర్వాత ఆమె ఈ ట్వీట్ చేసినా లంక చేతిలో పాక్ ఓడిన తర్వాత ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
I am going file FIR against Babar Azam and his team because these guys have always played with our national feelings instead of playing cricket 🥹
— Sehar Shinwari (@SeharShinwari) September 11, 2023
షిన్వారి చేసిన ఈ ట్వీట్ పై పాక్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆటలో ఇవన్నీ కామన్ అని.. గెలిచినా ఓడినా జట్టుకు మద్దతుగా నిలవాలని కొంతమంది అంటుంటే మరికొందరు ఆమెను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఎవరి షిన్వారి..?
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న హైదరాబాద్‌కు షిన్వారి సొంత ఊరు. అక్కడ షిన్వారి తెగకు చెందిన సెహర్.. నటిగా రాణిస్తోంది. తాను యాక్టర్ అవుతానంటే ముందు తన ఇంటివారితో పాటు కమ్యూనిటీ కూడా చాలా అభ్యంతరాలు తెలిపినా షిన్వారి పట్టు విడవలేదు. 2014లో ఆమె కామెడీ సీరియల్ ‘సైర్ సవా సైర్’ ద్వారా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె నటిగా తనను తాను నిరూపించుకుంటున్నది. భారత్ - పాక్ సంబంధాలపై ఆమె చేసిన ట్వీట్లు గతంలో వివాదాస్పదమయ్యాయి.
Why India is so scared from Pakistan ?
— Sehar Shinwari (@SeharShinwari) September 15, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial