Chiranjeevi Rajyasabha: రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Chiranjeevi to Rajya Sabha: చిరంజీవి మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఈ సారి గట్టిగానే కనిపిస్తున్నాయి. అయితే ఏ పార్టీలో చేరకూడదన్న ఆయన నియమానికి అనుగుణంగానే ఈ పదవి దక్కబోతోందని చెబుతున్నారు.
BJP is planning to send Chiranjeevi to Rajya Sabha under President quota: మెగా ఫ్యామిలీలో అగ్రజుడు చిరంజీవి పెద్దల సభకు మరోసారి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చిరంజీవి మరి ఏ పార్టీలోనూ చేరాలనుకోవడం లేదు. ఇప్పుడు కూడా ఆయన ఏ పార్టీలోనూ చేరరు. అయినా రాజ్యసభకు పంపే ప్లాన్ ను బీజేపీ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కల్యామ్ ఈ అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించాలని అంతా ఓకే అయిపోయిందని అంటున్నారు. అందుకే నాగబాబును రాజ్యసభకు పంపే విషయంలో ఆలోచించారని.. రాష్ట్ర కేబినెట్‌లోకి పంపుతున్నారని చెబుతున్నారు.
అన్నయ్యను గౌరవించుకోవాలని పవన్ పట్టుదల
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత పవన్ సైలెంటయ్యారు. చిరంజీవికి కూడా రాజకీయాలు విరక్తి పుట్టడంతో వైదొలిగారు. వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని తేల్చేశారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం చిరంజీవిని మరో సారి పెద్దల సభలో చూడాలని అనుకుంటున్నారు. కానీ చిరంజీవి మాత్రం తాను జనసేనలో అయినా..మరో పార్టీలో అయినా సభ్యత్వం తీసుకునే విషయంలో సుముఖంగా లేరు. అందుకే పవన్ కల్యాణ్ మధ్యేమార్గంగా మరో ప్లాన్ ఆలోచించారు. దాన్ని బీజేపీతో చర్చించారు. అదే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయడం.
Also Read: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
ఏ పార్టీతో సంబంధం లేని తటస్థులకు రాష్ట్రపతి కోటాలో సభ్యత్వం
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభలో పన్నెండు మంది సభ్యులు ఉంటారు. దేశంలోని వివిధ రంగాల్లో సుప్రసిద్దులైన వారిని ఎంపిక చేసి రాజ్యసభ సభ్యత్వం ఇస్తూంటారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ కోటాలో టాలీవుడ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రంజన్ గొగోయ్, సుధామూర్తి వంటి వారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కోటాలో రాజ్యసభ సభ్యుడు అవ్వాలంటే ఆయా రంగంలో దిగ్గజం అయితే సరిపోతుంది. సినీ రంగంలో చిరంజీవి ఎప్పుడో దిగ్గజంగా మారారు. నామినేట్ కావడానికి బీజేపీ సభ్యత్వం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Also Read: ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన 2024 - కొత్త స్టార్ పవన్ కల్యాణ్ - జగన్ బిగ్గెస్ట్ లూజర్ !
ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ !
రాష్ట్రపతి నామినేట్ చేయాల్సిన రాజ్యసభ స్థానాలు ప్రస్తుతం నాలుగు ఖాళీ ఉన్నాయి. వాటిలో ఎవరెవర్ని నియమించాలన్నదానిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ నాలుగింటిలో ఒకటి చిరంజీవికి ఖరారు చేశారన్న సమాచారం రాష్ట్ర రాజకీయవర్గాలకు చేరుతోంది. నాగబాబు రాజ్యసభ రేసులో ముందున్నా.. ఇద్దరినీ రాజ్యసభకు పంపడం సముచితం కాదన్న ఉద్దేశంతో నాగబాబును రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంచారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఇప్పటికే ఈ అంశంపై చర్చించారని మొత్తం ఫైనల్ అయిందని అధికారిక ప్రకటనే మిగిలి ఉందని భావిస్తున్నారు.
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు మెగాస్టార్ నామినేట్ అయితే.. జనసైనికుల ఆనందానికి అవధులు ఉండకపోవచ్చు.