Mushfiqur Rahim: అలా జరిగిపోయిందంతే , కావాలని చేతితో బంతిని ఆపలేదు
Mushfiqur Rahim: మీర్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫీకర్ రహీమ్ విచిత్రంగా అవుటయ్యాడు.
మీర్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫీకర్ రహీమ్ విచిత్రంగా అవుటయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ముష్ఫికర్ డిఫెన్స్ ఆడిన బంతి.. వికెట్ల మీదకు రావటంతో చేతితో ముష్ఫికర్ రహీమ్ వెంటనే చేతితో అడ్డుకున్నాడు. బౌలర్ జేమీసన్ వేసిన బంతిని చేత్తో అడ్డుకోవడంతో థర్డ్ అంపైర్ హ్యాడ్లింగ్ ది బాల్‌గా అవుట్ ఇచ్చాడు. వాస్తవానికి బంతి వికెట్లకు దూరంగానే వెళ్లినా నిబంధనల ప్రకారం బాల్‌ను చేత్తో అడ్డుకోకూడదు. ముష్ఫీకర్ చేతితో బాల్‌ను ఆపడంతో అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ ప్రకారం ఔట్‌గా ప్రకటించారు. దీంతో రహీమ్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ అవుట్‌తో టెస్టుల్లో తొలిసారిగా హ్యాడ్లింగ్ ది బాల్ రూల్‌తో అవుటైన ఆటగాడిగా ముష్ఫీకర్ రహీమ్ తన పేరిట చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.
అయితే ముష్ఫీకర్ రహీమ్ అవుట్‌పై బంగ్లా స్పిన్నర్ మెహిదీ హసన్ స్పందించాడు. ముందుగా అనుకొని ముష్పీకర్ రహీమ్ బంతిని చేతితో అడ్డుకోలేదని తెలిపాడు. ముష్ఫికర్ కావాలని బంతిని అడ్డుకోలేదని.. బ్యాటింగ్ చేసే క్రమంలో అనుకోకుండా చేతితో బంతిని ఆపాడని మెహిదీ అసన్ తెలిపాడు. ఉద్దేశపూర్వకంగా ఇలా ఔట్ కావాలని ఎవరూ అనుకోరని... మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పలు అంశాలను దృష్టిలోపెట్టుకోవాల్సి ఉంటుందని వివరించాడు. బంతిని ఎదుర్కొన్న తర్వాత అది స్టంప్స్ మీదకు వస్తుందేమోనని ముష్ఫీకర్ భయపడ్డాడని.. అలాంటి సమయంలో అనుకోకుండా చేతితో బంతిని నెట్టాడని వివరించాడు. అప్పటికప్పుడు అలా జరిగిపోయిందన్నాడు. వరల్డ్ కప్‌లో శ్రీలంక బ్యాటర్ ‘టైమ్‌డ్ ఔట్’ విషయంలో మాకు అనుకూలంగా నిర్ణయం వచ్చిందని... కానీ, ఈసారి అలా జరగలేదని మెహిదీ వ్యాఖ్యానించాడు.
బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజే పది వికెట్లు నేలకూలాయి. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తున్న వేళ స్పిన్నర్లు చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 172 పరుగులకే కుప్పకూలగా తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 55 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అనూహ్యంగా తిరుగుతూ బౌన్స్ అవుతున్న బంతిని ఆడడం బ్యాటర్ల వల్ల కాలేదు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్ల మాయాజాలంతో ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 66.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్ల ధాటికి ఆది నుంచే బంగ్లా బ్యాటర్లు విలవిలలాడారు. 29 పరుగులకే ఓపెనర్లు మహ్మదుల్ హసన్ (14), జకీర్ హుస్సేన్ (8) వెనుదిరిగారు. కాసేపటికే మోమినల్ (5), కెప్టెన్ షాంటో (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన ముష్ఫికర్ (35), హోస్సేన్ (31) వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. అయితే ముష్పికర్ హ్యాండ్లింగ్ ది బాల్'రూల్ తో అవుటయ్యాడు. ముష్ఫికర్ రహీం ఒక్కడే 35 పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆలౌటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, ఫిలిప్స్ చెరో మూడు వికెట్లు, అజజ్ పటేల్ రెండు, సౌథి ఒక వికెట్ తీశారు.