IPL 2025: వచ్చే సీజన్లో వేలంలోకి కేఎల్ రాహుల్! లక్నో కొత్త కెప్టెన్‌గా విధ్వంసకర బ్యాటర్
IPL 2025 News | టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అతడ్ని వేలంలోకి వదిలేయాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తోంది.
KL Rahul To Leave LSG in IPL 2025 | న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కోసం ఫ్రాంచైజీలు రిటెన్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే అందరి దృష్టి రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లపైనే ఉంది. రోహిత్ శర్మ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కేఎల్ రాహుల్ కు లక్నో మొండిచేయి చూపనుందని దాదాపుగా కన్ఫాయి అయింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వచ్చే సీజన్ లో కేఎల్ రాహుల్ ను రిటెన్షన్ చేసుకోకుండా షాకివ్వనుంది. ముగ్గురు కీలక ఆటగాళ్లను మాత్రం లక్నో ఫ్రాంచైజీ తమ వద్దే అట్టి పెట్టుకోనుందని సమాచారం.
నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్ లతో పాటు స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను లక్నో ఫ్రాంచైజీ అట్టిపెట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు కానీ నికోలస్ పూరణ్ ఐపీఎల్ 2025లో లక్నో సారథిగా వ్యవహరించనున్నాడని ఐఏఎన్ఎస్ కు వచ్చిన సమాచారం ఆధారంగా పలు విషయాలు రిపోర్ట్ చేసింది. వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్ గా చేసిన నికోలస్ పూరన్ మంచి హిట్టర్. విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడే సత్తా ఉంది. అసలే రాహుల్ తమ ఫ్రాంచైజీకి ఐపీఎల్ టైటిల్ అందించలేదని లక్నో మేనేజ్ మెంట్ అతడిపై గుర్రుగా ఉంది. కెప్టెన్సీ రేసులో నికోలస్ పూరన్ ముందు వరుసలో ఉన్నాడు. అతడితో పాటు మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ లను లక్నో ఫ్రాంచైజీ రీటెయిన్ చేసుకోనుందని ఐఏఎన్ఎస్ కు లక్నో మేనేజ్ మెంట్ వర్గాల నుంచి సమాచారం.
నికోలస్ పూరన్ కు రూ.16 కోట్లు
నికోలస్ పూరన్ డాషింగ్ బ్యాటర్. గత ఏడాది రూ.16 కోట్లతో లక్నో పూరన్ ను వేలంలో దక్కించుకుంది. లీగ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. రాహుల్ అందుబాటులో లేని సమయంలో కెప్టెన్ గా వ్యవహరించాడు. ఐపీఎల్ లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇంప్రూవ్ అవుతున్న ప్లేయర్ పూరన్. 2017లో ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షలకు తీసుకోగా.. ఆపై లక్నో ఏకంగా రూ. 16 కోట్లకు పూరన్ ను దక్కించుకునే స్థాయికి చేరాడు.
యువ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ ను లక్నో రిటెయిన్ చేసుకోనుంది. తన అరంగేట్రంలోనే 150 km/h డెలివరీలతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి అద్భుత ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. IPL 2024లో గాయం కారణంగా కేవలం 4 మ్యాచ్ లే ఆడాడు. కానీ సీమ్ బౌలింగ్ కారణంగా బీసీసీఐ అతడికి జాతీయ జట్టులో అవకాశం ఇచ్చింది. లక్నో కేవలం రూ. 20 లక్షలకు మయాంక్ యాదవ్ ను తీసుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న యువ పేసర్ లక్నోతో పాటు జాతీయ జట్టులోనూ కీలకంగా మారనున్నాడు.
లక్నో రిటెయిన్ చేసుకునే మరో ఆటగాడు లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్. 2022 మెగా వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వచ్చిన రవి బిష్ణోయ్‌తో LSG ప్రధాన బౌలింగ్ వనరుగా మారాడు. మ్యాచ్ విన్నర్ గా మారిన బిష్ణోయ్ జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యాడు. కీలక సమయాల్లో వికెట్ తీసే రవి బిష్ణోయ్ టాలెంట్ లక్నో జట్టును 2022, 2023లో ప్లేఆఫ్‌లకు చేరుకునేందుకు హెల్ప్ చేసింది.
నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ లతో పాటు లెఫ్టార్మ్ పేసర్ మోసిన్ ఖాన్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆయుష్ బదోనీలను సైతం లక్నో రీటెయిన్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ను మాత్రం వేలంలోకి వదిలేస్తున్నారు. అతడు ఏ జట్టుకు వెళతాడో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.