IND VS NZ T20: నేడు భారత్- న్యూజిలాండ్ రెండో టీ20 - వరుణుడు జరగనిస్తాడా!
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేడు కివీస్ తో రెండో టీ20 కి సిద్ధమైంది. అయితే మొదటి టీ20 కి అడ్డుపడిన వరుణుడు రెండో మ్యాచును వదిలేలా లేడు. మరి వర్షం కరుణించి మ్యాచ్ జరుగుతుందేమో చూడాలి.
IND VS NZ T20: ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిష్క్రమణ తర్వాత టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం ఈ సిరీసుకు పూర్తిగా కుర్రాళ్లనే పంపించింది. దాంతో వారెలా ఆడతారో చూడాలని అభిమానులు ఆసక్తితో ఉన్నారు. అయితే వారి నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా భారత్- కివీస్ తొలి టీ20 జరగాలి. అయితే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే ఆ మ్యాచ్ రద్దయింది. నేడు రెండో టీ20 కు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ జరిగే మౌంట్ మాంగనుయ్ లోనూ వర్షం పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం. ఈ క్రమంలో ఈ మ్యాచ్ జరిగేది కూడా అనుమానంగానే ఉంది. రెండో టీ20 కోసం ఇప్పటికే భారత జట్టు మౌంట్ మాంగనూయ్ లో అడుగు పెట్టింది. వారికి అక్కడి ఆచారం ప్రకారం స్వాగతం లభించింది.
సీనియర్లు లేకుండా
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, దినేశ్ కార్తీక్ లాంటి సీనియర్ల గైర్హాజరీలో కుర్ర జట్టుతో టీమిండియా బరిలోకి దిగుతోంది. కుర్రాళ్లతో నిండిన జట్టయినప్పటికీ హార్దిక్ పాండ్య నేతృత్వంలోని భారత జట్టు బలంగానే ఉంది. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్, దీపక్ హుడా, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లతో మెరుగ్గా కనిపిస్తోంది. అయితే వీరిలో తుది జట్టులో ఎవరుంటారో తెలియదు. సూర్య టీ20 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించి సూపర్ ఫాంలో ఉన్నాడు. మిగిలిన యువ ఆటగాళ్లు కూడా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు.
ఓపెనర్లుగా ఇషాన్, గిల్!
టీమ్‌ఇండియా యువ సంచలనం ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే అవకాశముంది. ఇషాన్ గత కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ యువ బ్యాటర్ భారత్ తరఫున ఇప్పటివరకు 19 టీ20లు ఆడి 131.15 స్ట్రైక్‌రేట్‌తో 543 పరుగులు చేశాడు. శుభమన్ గిల్ ఈ సిరీస్‌తో టీ20ల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇషాన్‌కు తోడుగా గిల్ ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది. మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగొచ్చు. వికెట్ కీపర్‌గా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఆరో స్థానంలో సంజూ శాంసన్, ఏడో స్థానంలో ఆల్‌రౌండర్, కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ చేయొచ్చు. బౌలింగ్ విషయానికొస్తే.. సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్‌కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్‌కు తోడుగా యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లను తీసుకునే అవకాశముంది.
భారత్ తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, యుజేంద్ర చాహల్,భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
ప్రపంచకప్ జట్టుతోనే కివీస్!
భారత్ లానే వెస్టిండీస్ కూడా టీ20 ప్రపంచకప్ సెమీస్ లోనే వెనుదిరిగింది. అయితే పొట్టి కప్పులో బరిలోకి దిగిన జట్టులో ఒకరిద్దరు మినహా మిగిలినవారిని టీమిండియాతో జరిగే టీ20 సిరీస్ కు ఎంపిక చేశారు. ట్రెంట్ బౌల్ట్‌కు విశ్రాంతినిచ్చిన కివీస్ మేనేజ్‌మెంట్ కీలకమైన బ్యాటర్లు ఫిన్ అలెన్, బ్రాస్‌వెల్, డేవన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, జీమ్మీ నీషమ్‌లను ఎంపికచేసింది. ప్రపంచకప్‌లో పెద్దగా రాణించని ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్‌కు రెస్ట్ ఇస్తారని అంతా భావించారు. అయితే కేన్‌కే నాయకత్వ పగ్గాలను అప్పజెప్పారు. టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఐష్ సోధి, లాకీ ఫెర్గూసన్‌తో కూడిన బౌలింగ్ దళం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే మ్యాచ్‌లు జరిగేది న్యూజిలాండ్‌లోనే కాబట్టి వారికి వారి పిచ్‌లపై పూర్తి అవగాహన ఉంటుంది.
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.
📸 📸 Snapshots from #TeamIndia's traditional welcome at Mt. Maunganui
— BCCI (@BCCI) November 19, 2022
Image Courtesy: Jamie Troughton/Dscribe Media#NZvIND pic.twitter.com/K4yUiScPO7
BEACH CRICKET CANCELLED
— BLACKCAPS (@BLACKCAPS) November 18, 2022
Unfortunately due to flight cancellations - today’s BLACKCAPS Beach Cricket event at the Mount at 2pm has been cancelled.#NZvIND pic.twitter.com/kvLtnhq2SF