IND vs NZ 3rd T20I: సిరీస్ పట్టేస్తారా! నేడు భారత్- న్యూజిలాండ్ ఆఖరి టీ20
IND vs NZ 3rd T20I: భారత్- న్యూజిలాండ్ ల మధ్య టీ20 సిరీస్ లో భాగంగా నేడు ఆఖరిదైన మూడో టీ20 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. సిరీస్ ను నిర్ణయించే మ్యాచ్ కాబట్టి రసవత్తర పోరు ఖాయం.
IND vs NZ 3rd T20I: భారత్- న్యూజిలాండ్ ల మధ్య టీ20 సిరీస్ లో భాగంగా నేడు ఆఖరిదైన మూడో టీ20 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ లో కివీస్, రెండో మ్యాచ్ లో భారత్ గెలవటంతో ఇది సిరీస్ డిసైడర్ గా మారింది. సిరీస్ ను నిర్ణయించే మ్యాచ్ కాబట్టి రసవత్తర పోరు ఖాయం.
బ్యాటింగ్ మెరుగుపడాలి
ఈ టీ20 సిరీస్ లో భారత టాపార్డర్ బ్యాటర్లు ఇప్పటివరకు రాణించలేదు. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి లు ఆకట్టుకోలేకపోయారు. గిల్ వన్డే సిరీస్ ఫాంను కొనసాగించలేకపోతున్నాడు. ఇషాన్ కిషన్ అస్సలు టచ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. ఇక కోహ్లీ స్థానంలో బరిలోకి దిగుతున్న రాహుల్ త్రిపాఠి అంచనాలకు అందుకోలేదు. ఈ మ్యాచ్ లో వీరు ముగ్గురూ రాణించాల్సిందే. స్పిన్ కు విపరీతంగా సహకరించిన రెండో మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యలు నిదానంగానే ఆడినప్పటికీ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్ లోనూ వారు అదే ప్రదర్శనను పునరావృతం చేయాల్సి ఉంది.
బౌలింగ్ గాడిన పడ్డట్లే
భారత బౌలింగ్ గాడిన పడ్డట్లే కనిపిస్తోంది. మొదటి టీ20లో మొదట బాగా బౌలింగ్ చేసి మధ్యలో పట్టు వదిలిన బౌలర్లు.. రెండో టీ20లో మాత్రం కివీస్ ను చుట్టేశారు. స్పిన్నర్లే కాదు ఫాస్ట్ బౌలర్లు బాగానే బంతులేశారు. తొలి మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చి విమర్శల పాలైన అర్హదీప్ రెండో మ్యాచ్ లో రాణించాడు. ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ లు బౌలింగ్ లో అదరగొడుతున్నారు. ఈ మ్యాచ్ లో చాహల్ కు బదులు ఉమ్రాన్ మాలిక్ ను తీసుకునే అవకాశం ఉంది.
మెరుగ్గా న్యూజిలాండ్
వన్డే సిరీస్ లో వైట్ వాష్ కు గురైన న్యూజిలాండ్ జట్టు టీ20 సిరీస్ లో భిన్నంగా ఆడుతోంది. మొదటి మ్యాచ్ లో గెలిచిన కివీస్ రెండో టీ20లోనూ విజయం కోసం చాలా కష్టపడింది. 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత్ ను చివరి వరకు తీసుకొచ్చింది. ఇదే పట్టుదలతో ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలనుకుంటోంది. ఫిన్ అలెన్, మిచెల్, డెవాన్ కాన్వే ఊపు మీద ఉన్నారు. అయితే ఆ జట్టు స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఇంతవరకు తన సత్తా మేరకు ఆడలేదు. బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. కాబట్టి భారత్ కు గట్టి పోటీ తప్పదు.
గత రికార్డులు
2012 లో న్యూజిలాండ్ భారత్ లో ఒక టీ20 మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు భారత్ లో ఆ జట్టు ఏ ఫార్మాట్ లోనూ ఒక్క సిరీస్ నెగ్గలేదు.
పిచ్ ఎలా ఉందంటే..
ప్రపంచంలోనే అహ్మదాబాద్ పిచ్ అతి పెద్దది. పెద్ద బౌండరీలు ఉన్నా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. వికెట్ మొదట బ్యాటింగ్ కు సహకరిస్తుంది. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు లబ్ధి పొందవచ్చు.
భారత జట్టు అంచనా
శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ జట్టు అంచనా
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఇష్ సోధి, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.
— BCCI (@BCCI) January 31, 2023