Ducks in Cricket: ‘డక్’ అవుట్‌లలో ఇన్ని రకాలున్నాయా - గోల్డెన్ డకౌట్ అంటే ఏంటో తెలుసా?
ఓ బ్యాటర్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు కోరుకోనిదే డకౌట్. అంటే క్రీజులోకి వచ్చి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరడం. అది ఏ రూపంలో అయినా కావొచ్చు..!
Ducks in Cricket: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో టెస్టులలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయిన మార్నస్ లబూషేన్ ఎదుర్కున్న తొలి బంతికే ఔట్ అయ్యాడు. టెస్టులలో అతడికి ఇదే తొలి గోల్డెన్ డకౌట్ అని ఈ సందర్భంగా కామెంటేటర్స్ వ్యాఖ్యానించారు. అసలు గోల్డెన్ డకౌట్ అంటే ఏంటి..? డకౌట్స్‌లో ఎన్ని రకాలున్నాయి..?
ఓ బ్యాటర్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు కోరుకోనిదే డకౌట్. అంటే క్రీజులోకి వచ్చి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరడం. అది ఏ రూపంలో అయినా కావొచ్చు.. తన తరఫున టీమ్‌కు ఎన్నో కొన్ని పరుగులు చేయాలని కోరుకునే ఆటగాళ్లు, సున్నాకే వెనుదిరుగుతుంటారు. అది రోహిత్ శర్మ అయినా మహ్మద్ సిరాజ్ అయినా కోరుకోనిది అదొక్కటే.. క్రికెట్‌లో మొత్తం 9 రకాల డకౌట్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
డకౌట్‌లలో రకాలు..
1. గోల్డెన్ డకౌట్ : క్రికెట్‌లో ఒక బ్యాటర్ తాను ఎదుర్కున్న తొలి బంతికే పరుగులేమీ చేయకుండానే ఔట్ అయితే (ఏ రూపంలో అయినా) దానిని గోల్డెన్ డకౌట్ అంటారు. (మొన్న లబూషేన్‌తో పాటు చాలా మంది ఇలా ఔట్ అయినవారే..)
2. సిల్వర్ డక్ : ఓ ఇన్నింగ్స్‌లో బ్యాటర్ ఎదుర్కున్న రెండో బాల్‌కు పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగిగే దానిని సిల్వర్ డకౌట్ అంటారు.
3. బ్రౌన్ డకౌట్ : ఒక బ్యాటర్ ఒక్క రన్ కూడా చేయకుండానే మూడో బాల్‌కు నిష్క్రమిస్తే దానిని బ్రౌన్ డకౌట్‌గా వ్యవహరిస్తారు.
BROAD STRIKES! 🔥
— England Cricket (@englandcricket) June 19, 2023
Marnus Labuschagne is back in the hutch! #EnglandCricket | #Ashes pic.twitter.com/6uM161QtcH
4. డైమండ్ డకౌట్ : ఇది చాలా విచిత్రమైన ఔట్. క్రీజులోకి వచ్చిన బ్యాటర్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే (అంటే బౌలర్ వేసిన ఒక్క బంతిని కూడా ఆడకుండానే) ఔట్ అయితే దానిని డైమండ్ డకౌట్ అంటారు. ఉదాహరణకు ఒక బ్యాటర్ క్రీజులోకి వచ్చి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉండి రనౌట్ అయితే దానిని డైమండ్ డకౌట్‌గా అభివర్ణిస్తారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-16 లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ అయ్యాడు. దీనిని డైమండ్ డకౌట్ గా పిలుస్తారు.
5. రాయల్ డకౌట్ : దీనిని సాధారణంగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్‌లో వాడతారు. దీని ప్రకారం ఒక టెస్టులో ఓపెనర్లు టెస్టులో తొలి బంతికే ఔట్ అయితే దానిని రాయల్ డకౌట్ అంటారు. 2013లో యాషెస్ సిరీస్ లో భాగంగా పెర్త్ (ఆస్ట్రేలియా) లో ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్.. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఔట్ అయ్యాడు. దీనిని రాయల్ డకౌట్ అని అభివర్ణించారు.
6. లాఫింగ్ డకౌట్ : ఒక ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతికి బ్యాటర్ ఒక్క పరుగు కూడా చేయకుండా నిష్క్రమించి.. ఆ బాల్‌తోనే ఇన్నింగ్స్ ముగిస్తే దానిని లాఫింగ్ డకౌట్ అని వ్యవహరిస్తారు.
7. పెయిర్ : ఇది ఎక్కువగా టెస్టు క్రికెట్‌లో ఉపయోగిస్తారు. ఒక బ్యాటర్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలోనూ పరుగులేమీ చేయకుండా నిష్క్రమిస్తే దానిని పెయిర్ గా పిలుస్తారు.
8. కింగ్ పెయిర్ : ఇది కూడా పెయిర్ వంటిదే. ఒక టెస్టులో బ్యాటర్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ తాను ఆడిన తొలిబంతికే పరుగులేమీ చేయకుండా ఔటైతే దానిని కింగ్ పెయిర్ అని అంటారు.
9. బ్యాటింగ్ హ్యాట్రిక్ : ఇది చాలా అరుదుగా జరిగేది. ఒక బ్యాటర్ వరుసగా 3 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఎదుర్కున్న తొలి బంతికే ఔట్ అయితే బ్యాటింగ్ హ్యాట్రిక్ డకౌట్‌గా చెప్పబడుతున్నది.