1983 World Cup Win: అండర్ డాగ్స్ అద్భుతాన్ని చేసిన వేళ - 83 వరల్డ్ కప్ విజయానికి 40 ఏళ్లు
భారత క్రికెట్ జట్టు గతిని, స్థితిని మార్చిన విజయానికి నేటితో 40 ఏళ్లు పూర్తయ్యాయి. 1983లో కపిల్ డెవిల్స్ ప్రమాదకర విండీస్‌ను మట్టికరిపించి ప్రపంచకప్‌ను ముద్దాడింది ఇదే రోజు.

1983 World Cup Win: భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంగా భావిస్తారు. ఒకరకంగా ఆ మతానికి నాంది పడి క్రికెటర్లను ఆరాధ్య దైవంగా, క్రికెట్‌ను తమ జీవితంలో ఓ భాగంగా భావించడానికి పునాది వేసింది 1983 వన్డే వరల్డ్ కప్ విజయం. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ‘కపిల్ డెవిల్స్’.. అప్పటికీ వరల్డ్ క్రికెట్‌లో మోస్ట్ డేంజరస్ టీమ్‌గా ఉన్న వెస్టిండీస్‌ను చిత్తు చేసి దేశానికి తొలి వన్డే వరల్డ్ కప్‌ను అందించింది. ఆ అద్భుతం జరిగి నేటికి సరిగ్గా 40 ఏళ్లు. అసలు ఈ టోర్నీలో ఆశలే లేని స్థితి నుంచి భారత జట్టు అద్భుతాన్ని చేసిన ప్రయాణాన్ని ఓసారి పరిశీలిస్తే..
కొత్త కెప్టెన్..
అప్పటికీ భారత జట్టు సారథిగా సునీల్ గవాస్కర్‌కు మంచి రికార్డే ఉన్నా వరల్డ్ కప్‌కు ముందు వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ.. అతడిని తప్పించి హర్యానా హరికేన్ కపిల్ దేవ్‌కు సారథ్య పగ్గాలు అప్పగించింది. ఆడేది ఇంగ్లాండ్‌లో. మనోడికేమో పొట్ట కోస్తే ఇంగ్లీషు అక్షరం ముక్క రాదు. టీమ్‌లో చాలామందికి ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవమూ అంతంతమాత్రమే.. ‘అసలు వీళ్లు ఏం నెగ్గుతార్లే.. ప్రయాణ ఖర్చులు దండుగ’ అన్న విమర్శలతోనే ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టింది టీమిండియా. ఇప్పటిలాగా టీమిండియా ఎక్కడికెళ్తే అక్కడ సకల సౌకర్యాలు లేవు. బీసీసీఐ అప్పటికీ ధనవంతమైన బోర్డుగా కాదు కదా.. ఆటగాళ్లకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి..
కలిసికట్టుగా..
సౌకర్యాలు లేకున్నా ఇంగ్లీషు రాకున్నా కపిల్ డెవిల్స్ ఆత్మవిశ్వాసాన్నే నమ్ముకుంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించింది. గ్రూప్-ఎ లో వెస్టిండీస్ ఐదు విజయాలతో, ఇండియా నాలుగు విజయాలతో సెమీస్‌కు వెళ్లాయి. గ్రూప్ దశలో భారత్.. ఓసారి వెస్టిండీస్‌ను ఓడించడం విశేషం. ఫస్ట్ మ్యాచే భారత్ విండీస్ తో ఆడింది. 60 ఓవర్లలో భారత్.. 8 వికెట్లకు 262 పరుగులు చేసింది. యశ్‌పాల్ శర్మ (89) టాప్ స్కోరర్. కానీ విండీస్.. 54.1 ఓవర్లలో 228 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రస్తుత బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయం టీమిండియాకు కొండంత బలాన్నిచ్చింది.
రెండో మ్యాచ్ జింబాబ్వేతో ఆడింది కపిల్ డెవిల్స్.. ఈ మ్యాచ్ మదన్ లాల్ 3 వికెట్లు తీయగా బిన్నీ 2 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే 155 పరుగులకే పరిమితం కాగా భారత్.. 37.3 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సందీప్ పాటిల్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. కానీ మూడో మ్యాచ్‌లో విండీస్‌తో మరోసారి తలపడిన భారత్ ఈసారి ఓడింది. ఈ మ్యాచ్‌లో వివ్ రిచర్డ్స్.. (119) సెంచరీ చేశాడు. విండీస్ నిర్దేశించిన 289 పరుగులు లక్ష్య ఛేదనలో భారత్.. 216 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇక జింబాబ్వేతో జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. 17 పరుగులకు 5 వికెట్లు. ఈ సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన కపిల్ దేవ్.. 138 బంతుల్లో 16 బౌండరీలు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత జింబాబ్వేను 235 రన్స్‌కే కట్డడి చేసింది భారత్. లీగ్ దశలో ఆస్ట్రేలియాతో ఆడిన ఆఖరు మ్యాచ్‌లో భారత్ 118 పరుగుల తేడాతో ఓడినా నాలుగు విజయాలతో సెమీస్‌కు అర్హత సాధించింది.
1983 World Cup Final highlights.
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023
Kapil Dev's running catch to dismiss Viv Richards was the turning point! pic.twitter.com/7vs9kZj6HU
సెమీస్‌లో..
సెమీఫైనల్‌లో భారత ప్రత్యర్థి ఇంగ్లాండ్. మనకు క్రికెట్ ఓనమాలు నేర్పిన జట్టు. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 213 పరుగులకే ఆలౌట్ అయింది. కపిల్ దేవ్ 3 వికెట్లు తీయగా బిన్నీ, మోహిందర్ అమర్‌నాథ్ లు తలా రెండు వికెట్లు తీశారు. లక్ష్యాన్ని భారత్.. 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. యశ్‌పాల్ శర్మ (61), సందీప్ పాటిల్ (51)తో పాటు మోహిందర్ అమర్‌నాథ్ (46) ఆల్ రౌండ్ ఆట భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది.
ఫైనల్‌లో అసలు ఆట..
టీమిండియా ఫైనల్ చేరింది. పాకిస్తాన్‌ను ఓడించి మూడో వరల్డ్ కప్ అందుకోవడానికి వెస్టిండీస్‌కు కూడా తుదిపోరుకు వచ్చింది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఫైనల్. కలలో కూడా భయపెట్టే విండీస్ బౌలర్లు ఆండీ రాబర్ట్స్, గార్నర్, మాల్కమ్ మార్షల్, మైఖేల్ హోల్డింగ్‌ల దెబ్బకు టీమిండియా బ్యాటింగ్ కకావికలమైంది. 54.4 ఓవర్లలో భారత్ 183 రన్స్‌కు ఆలౌట్. కృష్ణమచారి శ్రీకాంత్ (38) టాప్ స్కోరర్. అమర్‌నాథ్ (26) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే భారత బౌలర్లకు ఆదిలోనే గుండెల్లో వణుకుపుట్టింది. ప్రపంచంలో ఎంతటి బౌలర్ ను అయినా చితకబాదే గ్రీనిడ్జ్, వివ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్ వంటి దిగ్గజాలు ఆ జట్టు సొంతం. కానీ బ్యాటింగ్ లో విఫలమైన భారత్.. బౌలింగ్‌లో అద్భుతం చేసింది. మదన్ లాల్, మోహిందర్ అమర్‌నాథ్ లు విండీస్ బ్యాటింగ్ వెన్ను విరిచారు. ఈ ఇద్దరూ తలా మూడు వికెట్లతో చెలరేగారు. బల్విందర్ సింగ్ సాధుకు రెండు వికెట్లు దక్కాయి. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బౌలర్ల ధాటికి విండీస్.. 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయింది. అంతే.. భారత్‌లో సంబురాలు వేడుకలా జరిగాయి.
It's been 40 years now since India won their maiden World Cup, in England.
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 24, 2023
The Kapil Dev led side created history beating public favorites WI in the Final. Mohinder Amarnath won POTM awards in the Semis and the Final. A victory that changed the future of cricket in India. pic.twitter.com/uDGeMjpBzP
ఆ బాలుడిలో స్ఫూర్తి నింపి..
సరిగ్గా ఇదే ప్రపంచకప్ ఫైనల్ జరుగుతున్న సమయంలో ముంబైలోని ఓ ఇంట్లో తొమ్మిదేండ్ల పిల్లాడు టీవీ ముందు ఆసక్తికరంగా మ్యాచ్ చూస్తున్నాడు. ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఆ బాలుడు ‘ఇక క్రికెటే నా కెరీర్’ అని నిర్దేశించుకున్నాడు. ఆ ఆలోచన భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్‌కూ ఓ దిగ్గజాన్ని అందించింది. ‘నేను అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేస్తానని’ ఆ సమయంలో ఆ బాలుడు అస్సలు ఊహించి ఉండడు. ఆ బాలుడెవరో కాదు.. భారత క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్. సచిన్ వంటి ఎంతో మంది నాటి కుర్రాళ్లకు ఆదర్శంగా నిలిచిన 1983 వరల్డ్ కప్ విజయానికి నేటికి 40 ఏండ్లు పూర్తయ్యాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

