Christmas 2025: జీసస్‌ను సిలువ వేసిన రోమన్ గవర్నర్ ఫైలేట్ ఏమయ్యాడు?
Christmas 2025: జీసస్ ను సిలువ వేసిన రోమన్ గవర్నర్ ఫైలేట్ ఆ తరువాత ఏమయ్యాడు? ఆయన గురించి వివరాలు తెలుసుకుందాం.

Christmas 2025: ఈరోజు క్రిస్మస్.. ప్రపంచంలోని క్రైస్తవులు అంతా ఆనందంతో జీసస్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. జీసస్ జీవితానికి సంబందించి అనేక విషయాలు అందరికీ తెలిసినా ఇప్పటికీ క్రైస్తవులకి అంతగా తెలియని.. కొన్ని మిస్టరీస్ కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి జీసస్ కు సిలువ శిక్ష వేసిన రోమన్ గవర్నర్ పొంతి పీలాతు (Pontius Pilate ) ఆ తరువాత ఏమయ్యాడు అనేది.
యూదా ప్రాంతాన్ని పదేళ్లు పాలించిన రోమన్ గవర్నర్ పైలెట్
ఏసు క్రీస్తు జీవించిన కాలంలో ఇప్పటి ఇజ్రాయేల్ ప్రాంతంలో చాలా భాగం రోమన్ల అధికారంలో ఉండేది. దాన్ని అప్పట్లో యూదయా (Judaea) గా పిలిచేవారు. పేరుకు దానికో సామంత రాజు "హేరోడ్ "ను ఉంచినా ఆయనపై పర్యవేక్షణకు ఒక రోమన్ గవర్నర్ కూడా ఉండేవారు. అలా యూదా ప్రాంతానికి వచ్చిన వ్యక్తే ఫైలేట్. 26 CE నుంచి 306 CE వరకూ ఫైలేట్ యూదా ప్రాంతాన్ని గవర్నర్ గా పదేళ్లు పాలించాడు. జీసస్ తన మతాన్ని స్థాపించడం పాత యూదా మతంలోని ఛాందస భావాలను తప్పు పట్టడంతోపాటు తానే దేవుని కుమారుడినని చెప్పుకోవడాన్ని యూదు మత పెద్దలు తట్టుకోలేక పోయారు. చివరకు ఒక రాత్రి డబ్బుకు లొంగిపోయిన ఆయన శిష్యుడు పట్టించడంతో జీసస్ ను బంధించి తీవ్రంగా హింసించి పైలెట్ దగ్గరకు తీసుకుని వచ్చి సిలువ వేయాలంటూ డిమాండ్ చేశారు.
మొదట్లో ఫైలేట్ దానికి ఒప్పుకోక యూదయా రాజు హేరోడ్ దగ్గరకు జీసస్ ను పంపగా ఆయన కూడా ఇది తన పరిధిలో లేని అంశం అంటూ మళ్ళీ పైలెట్ దగ్గరకు పంపాడు. అప్పటికీ పైలెట్ దానికి ఒప్పుకోక కోరడా దెబ్బలు కొట్టించి జీసస్ ను వదిలి పెట్టేయాలని చూసినా యూదా మత పెద్దలు ఒప్పుకోక పోవడంతో ఈ పాపం తన కుటుంబం మీదకు రాకూడదు అంటూ చేతులు నీళ్లతో కడుక్కుని జీసస్ ను సిలువ వేయించాడు అని బైబిల్ చెబుతోంది. 26-30CE సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ తరువాత మరో ఆరేళ్లకుపైగా గవర్నర్ గా పాలించిన పైలెట్ గురించి బైబిల్ లో లేదు.
జాలిగల వాడా... లేక క్రూరుడా?
పొంటియస్ పైలెట్ ని ఒక విధంగా జాలి గలవాడిగా జీసస్ ను సిలువ వేయకుండా ఉండేలా ప్రయత్నించిన వ్యక్రి గా పొంటియస్ పైలెట్ గురించి పాజిటివ్ గానే క్రిస్టియన్స్ చూస్తారు. ఆ తరువాతి కాలంలో ఆయన ఒక సెయింట్ గా మారాడని కూడా ఇతియోపియన్ అర్ధడాక్స్ చర్చ్ నమ్ముతుంది. కానీ చరిత్రకారులు మరోలా చెబుతారు. పొంటిటయస్ పైలెట్ నిజానికి క్రూరుడు అనీ కొత్త మతాన్ని స్థాపించిన జీసస్ ను చాలా తెలివిగా సొంత యూదు యాజకుల చేతుల మీదుగానే అంతం చేసేలా పథకం వేసి తప్పంతా వారి మీదకే వెళ్లేలా చేసాడని ఒక వాదన ఉంది. రోమన్ చక్రవర్తి ని దేవుడిలా చూసే రోమన్ గవర్నర్ గా జీసస్ తనను తాను దైవ కుమారుడిగా చెప్పుకుంటే దాని శిక్ష తానెక్కడ భరించాలో అని జీసస్ మరణ శిక్ష కథంతా నడిపాడని చరిత్రకారుల్లో ఒక వర్గం చెబుతోంది. బైబిల్ లోని నాలుగు సువార్తలు (Gospels ) రాసేసమయానికి ఇంకా రోమన్ పాలన కొనసాగుతూనే ఉంది కాబట్టి వారికి కోపం రాకుండా మొత్తం తప్పుని యూద యాజకుల మీదకు వెళ్లేలా వాటి రచన సాగింది అనే వాళ్ళు కూడా ఉన్నారు.
భయంకరమైన క్రూరత్వం తో రోమన్ చక్రవర్తి కోపానికి గురైన పైలెట్
యూదుల్లోనే మరో తెగ అయిన సమరియులను (samaritans) 36CEలో ఊచకోత కోయించాడు పొంటియాస్ పైలెట్. వారు తిరుగుబాటు చేశారు అనేది ఆయన చేసిన ఆరోపణ. దీనిపై విమర్శలు రావడంతో రోమన్ చక్రవర్తి టైభీరియస్ నుంచి పైలెట్ కు రోమ్ నగరానికి రావలసిందిగా పిలువు వచ్చింది. పైలెట్ ఆ ప్రయాణంలో ఉండగానే టైబీరియస్ చక్రవర్తి చనిపోయాడు. కొత్త చక్రవర్తి కాలిగ్యుల (Caligula) పాత అధికారులను పదవుల్లోంచి తొలగించడంతో పైలెట్ స్థానం లో మార్స్ లెస్ యూదా గవర్నర్ గా వచ్చాడు. అయితే చక్రవర్తి కాలిగ్యూలా అస్థానంలో పైలెట్ జరిపిన ఊచకోతపై విచారణ జరిగింది అనీ అక్కడ అవమానం జరగడంతో తట్టుకోలేక విషాదంతో జీవితం గడిపాడని 39,CE ప్రాంతంలో మనోవేదనతో తన ప్రాణం తానే తీసుకున్నాడని ఇది దేవుని శాపం అని క్రిస్టియన్ చరిత్రకారుల్లో కొందరు చెబుతారు. కానీ అప్పటి కాలానికి కాస్త దగ్గరగా బతికిన హిస్థారియన్స్ జోసెఫస్,ఫిలో, టాసిటస్ లాంటి వాళ్ళు దీనిగురించి తమ రచనల్లో ప్రస్థావించలేదు. దానితో పదవి పోయాక పైలెట్ విశ్రాంత జీవితం గడుపుతూ కాలగర్భంలో కలిసి పోయి ఉండవచ్చు అని కొందరు చెబుతారు.
పైలెట్ హిస్టరీ ని నిర్దారించే ది పైలెట్ స్టోన్, నాణాలు
పొంటియస్ పైలెట్ కి సంబంధించిన చారిత్రక ఆధారాలుగా ఆయన ముద్రించిన నాణాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. అలానే ఆయన తన పేరుతో ముద్రించిన శిలా ఫలకం కూడా ఒకటి చరిత్రకారులకు దొరికింది. రోమన్ చక్రవర్తిని పూజిస్తూ కట్టిన ఒక గుడి ముందు పైలెట్ ఈ శిలా ఫలకం వేయించినట్టు చరిత్రకారులు చెబుతారు. ఒక్కటి మాత్రం నిజం. ప్రస్తుతం ప్రపంచంవ్యాప్తంగా అతి పెద్ద మతంగా చెప్పుకునే క్రిస్టియానిటీ స్థాపకుడు జీసస్ క్రైస్ట్ జీవితంలో ముఖ్యం గా ఆయన సిలువ శిక్ష ఘట్టంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి గా పైలెట్ చరిత్ర లో నిలిచిపోయాడు





















