Vinayaka Chavithi Vratha Kadha 2022: వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది, ఈ రోజున తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథలివే!
Vinayaka Chavithi Vratha Kadha 2022: ముందుగా పసుపు గణపతి పూజ ..ఆ తర్వాత మీరు తీసుకొచ్చిన వినాయక విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి పూజించిన అనంతరం ఈ కథలు చదువుకుని తలపై అక్షతలు వేసుకోవాలి...
Vinayaka Chavithi Vratha Kadha : సంస్కృత పదాలతో ఉన్న కథ చదివేందుకు కొందరు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో చదివేందుకు వీలుగా కొన్ని పదాలు మార్పు చేసి పాఠకులకు అందిస్తోంది ఏబీపీ దేశం.
ముందుగా పసుపుగణపతి పూజ, మీరు తెచ్చిన వినాయక విగ్రహానికి పూజ చేయాలి...ఆ తర్వాతే కథ చెప్పుకోవాలి
పసుపు గణపతి పూజ
Also Read: వినాయక చవితి పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి! Part-1
గణపతి షోడసోపచార పూజ
Also Read: వినాయక చవితి పూజా విధానం Part-2
గజాసుర సంహారం
సూతమహర్షి శౌనకాది మునులకు ఇలా చెప్పారు. గజముఖుడైన రాక్షసుడు తపస్సు చేసి శివుడిని మెప్పించి కోరరాని వరం కోరాడు. తనను ఎవరూ వధించలేని శక్తిని ఇవ్వాలని, తన ఉదరం(పొట్ట) లోనే శివుడు నివశించాలని కోరాడు. ఇచ్చిన మాట ప్రకారం శివుడు ఆ కోరిక నెరవేర్చాడు. భర్త పరిస్థితి తెలిసి బాధపడిన పార్వతీ దేవి తన పతిని విడిపించాలని విష్ణువును కోరింది. విష్ణువు గంగిరెద్దు వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్లాడు. గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏం కావాలో కోరుకో" అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నీ ఉదరమందున్న శివుని కోసం వచ్చానని చెప్పాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం తెలుసుకుని తన ఆయువు తీరిందని అర్థం చేసుకున్నాడు. ఉదరంలో ఉన్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితం ముగియుచున్నది। నా అనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించాలని " ప్రార్థించి తన శరీరం నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు ఉదరం చీల్చి శివునికి విముక్తి కల్గించాడు. శివుడు గజముఖాసురుని శిరం, చర్మం తీసుకుని కైలాశానికి బయలుదేరాడు.
గణపతి జననం
అక్కడ పార్వతి భర్త రాక గురించి విని స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానంగా ఓ ప్రతిమ చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించడంతో ప్రాణం పోసింది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రిఅయిన పర్వత రాజు ద్వారా గణేశ మంత్రం పొందిన పార్వతి..ఆ మంత్ర ప్రభావంతో ప్రాణం పోసి ఆ బాలుడిని వాకిట ఉంచి తను స్నానానికై లోపలకు వెళ్లింది. ఆ సమయంలో వచ్చిన శివుడిని బాలుడు అడ్డగించాడు. లోపలికి పోనివ్వనని నిలువరించాడు. తన మందిరంలోకి తనను వెళ్లనివ్వకపోవడంతో శివుడు ఆగ్రహంతో ఆ బాలుడి శిరస్సు ఖండించాడు. జరిగినదంతా విని పార్వతి చింతిస్తుండగా..గజముఖాన్ని ఆ బాలుని మొండానికి అతికించి త్రిలోక్య పూజనీయత కలిగించాడు శివుడు.
విఘ్నాధిపత్యం
ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని..శివుని రెండో కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానం కోరుతాడు. అప్పుడు శివుడు.. "మీలో ఎవరు ముల్లోకాల్లోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. కుమారస్వామి తన నెమలివాహనంగా జోరుగా వెళ్లిపోగా వినాయకుడు అక్కడే ఆగిపోయాడు. తన పరిస్థితి తండ్రికి వివరించి ముల్లోకాల్లో పవిత్రనదీ స్నాన ఫలితం చెప్పమని అర్థించాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు నారాయణ మంత్ర ఉపదేశించాడు. సర్వజగత్తును పరిపాలించే ఉమా మహేశ్వరుల్లోనే సమస్త తీర్థక్షేత్రాలు దాగివున్నాయని భావించిన విఘ్నేశ్వరుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. నారములు అంటే జలం, జలమున్నీ నారాయణుని ఆధీనాలు. అంటే ఆ మంత్ర ఆధీనాలు, మంత్ర ప్రభావంతో ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు కనిపించాడు. తప్పు తెలుసుకున్న కుమారస్వామి ఆధిపత్యాన్ని అన్న వినాయకునికే ఇచ్చేందుకు అంగీకరించాడు.
చంద్రుని పరిహాసం
గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయం మరిచిన చంద్రుడు వినాయకుడి వింత రూపం చూసి, తల్లిదండ్రుల పాదాలకు వంగి నమస్కరించలేని వినాయకుడిని చూసి నవ్వుతాడు. అప్పుడు పార్వతీ దేవి చంద్రుడిని చూసిన వారికి నీలాపనిందలు తప్పవని శిపిస్తుంది. అయితే అది కేవలం చంద్రుడికి మాత్రమే కాదు లోకానికి శాపం తల్లీ అంటూ శాపవిముక్తి చెప్పమని వేడుకున్నారు. బాధ్రపద శుద్ధ చవితినాడు గణపతి పూజచేసి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకుంటే నిలాపనిందలు పోతాయని..అప్పుడు చంద్రుడిని చూసినా ఎలాంటి దోషం ఉండదని అనుగ్రహించారు.
అలా చేయనందున శ్రీకృష్ణుడంతటి వాడికే తప్పలేదు ఈ కష్టం
శమంతకోపాఖ్యానం
వినాయక చవితి రోజున పాలలో చంద్రబింబం చూసిన శ్రీకృష్ణుడు నిలాపనింద పాలయ్యాడు. సత్రాజిత్తు అనే మాహారాజు సూర్యోపాసనతో శ్యమంతకమను మణిని సంపాదించాడు. రోజుకి ఎనిమిది బారువుల బంగారం ఇస్తుందా మణి. అంతటి శక్తివంతమైన మణిని ఇమ్మని శ్రీకృష్ణుడు కోరతాడు. ఆ కోరికను తిరస్కరిస్తాడు సత్రాచిత్తు. ఆ తర్వాత కొన్ని రోజులకు సత్రాజిత్తు తమ్ముడు ప్రేసనుడు విలాసంగా ఆ మణిని ధరించి వేటకెళ్లాడు. ఆ మణిని మాంసపు ముక్క అని భావించిన సింహం ప్రసేనుడిని చంపి ఆ మణిని నోట కరుచుకుని పోయింది. నిజము తెలియని సత్రాజిత్తు మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపాడని నిందలపాలు చేశాడు.
చవితి రోజున పాలలో చంద్రుడిని చూసినందున ఈ పరిస్థితి వచ్చిందని భావించిన కృష్ణుడు అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరం కనిపించింది. అక్కడి నుంచి సింహపు అడుగు జాడలను అనుసరించి వెళ్ళాడు. ఒక ప్రదేశంలో సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అక్కడ గుహలో ఊయల తొట్టికి వేలాడుతున్న మణిని గమనించాడు. ఆ మణిని అందుకునే ప్రయత్నం చేయగా భల్లూకం మీద పడింది. ఏకంగా 28 రోజులు భీకర సమరం తర్వాత భల్లూకం శక్తి క్షీణించసాగింది.
అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక ఉన్నాడు. తనతో యుద్ధం చేస్తున్నది శ్రీరామ చంద్రుడే అని గ్రహించిన జాంబవంతుడు స్తోత్రం చేయనారంభించాడు. త్రేతాయుగంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయంగా శ్రీరాముడితో ద్వంద్వ యుద్ధం కోరాడు. అప్పట్లో నెరవేరని ఆ కోరిక కృష్ణావతారంలో నెరవేరింది. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడి ముందు ప్రణమిల్లి తన కుమార్తె జాంబవతితో పాటూ శమంతకమణి అప్పగించి కర్మ బంధ విముక్తి పొందాడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకెళ్లి సత్రాజిత్తుడిని ఇచ్చి జరిగిన విషయం తెలిపాడు. పశ్చాత్తాపము చెందిన సత్రాజిత్తు మణితో సహా తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.
వినాయక వ్రతం చేయక చంద్రబింబం చూడడం వల్ల ఈ నింద మోయాల్సి వచ్చిందని వివరించాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచీ జగమంతా బాధ్రపద శుద్ధ చవితి రోజు వినాయకుని యథాశక్తి పూజించి శ్యమంతకమణి కథను విని అక్షితలు శిరస్సుపై వేసుకుంటున్నారు.
ఓం గం గణపతయే నమః
నీరాజనం…
చివరిగా చేతిలోకి అక్షతలు తీసుకుని ఇలా చెప్పాలి...
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తతే |
నేను చేసిన పూజావిధానంలో లోపం ఉన్నా..నా భక్తిలో ఎలాంటి లోపం లేదని అర్థం.
గణపయ్యకు 11 గుంజీలు తీసి మొక్కుకుంటే సకల విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం