Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులు ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Rains In AP Districts: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకూ ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది రానున్న 2 రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అటు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కడప, కృష్ణా, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 19వ తేదీన పార్వతీపురం మన్యం, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు
మరోవైపు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు.. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ నెల 19న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని ప్రకటించింది.