జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్
లోక్ సభలో జమిలీ బిల్లు ప్రవేశపెట్టే అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. పూర్తి మెజారిటీ లేకుండానే లోక్ సభలో జమిలీ బిల్లు ఎలా ప్రవేశపెడతారంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. పైగా బిల్లులో రాష్ట్రాల హక్కులకు సంబంధించి మెలికి పెడుతూ కొన్ని అంశాలు ఉండటంతో విపక్షాలు ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ని ఏర్పాటు చేయాలని కోరాయి. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్‌డీఏకి 295 మంది సభ్యుల బలం ఉంది. అటు ఇండీ కూటమికి 235 మంది సభ్యులున్నారు. లోక్‌సభలో ఈ బిల్ పాస్ అవ్వాలంటే 362 మంది ఎంపీల మద్దతు ఉండాల్సిందే. అందుకే ప్రతిపక్షాలు బిల్లుపై జేపీసీ వేయాలన్నా...బిల్లు ప్రవేశపెట్టాలన్నా కూడా ముందు ఓ డివిజన్ ను కోరాయి. ఫలితంగా తొలిసారిగా లోక్ సభ కొత్త భవనంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో డివిజన్ కు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. కోరిన సభ్యులకు స్లిప్పులు కూడా ఇచ్చి ఓటింగ్ ను నిర్వహించారు. 269 మంది ఎంపీలు జమిలీ బిల్లు ప్రవేశపెట్టాలని ఓటు వేయగా...198 మంది ఎంపీలు జమిలీ బిల్లు ప్రవేశపెట్టొద్దంటూ ఓట్లు వేశారు. దీంతో మెజార్టీ సభ్యుల ఆమోదం అందుకున్న జమిలీ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. ఫలితంగా ఈ బిల్లు ప్రవేశపెట్టేముందే జేపీసి కి వెళ్లనుంది.





















