Shravana Masam 2025: బంగారం కొనడానికి ఇదే సరైన సమయం! అక్షయ తృతీయ కాదు శ్రావణంలోనే ఎందుకు కొనాలంటే!
ఏ శుభకార్యం అయినా హిందువులకు బంగారంతో ముడిపడి ఉంటుంది. మగువలకు బంగారానికి విడదీయలేని సంబంధం ఉంది. అయితే శ్రావణమాసంలో తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలంటారు..ఎందుకంటే?

Shravana Masam 2025: శ్రావణం మొత్తం ఆధ్యాత్మిక సందడే. శ్రావణ సోమవారం పరమేశ్వరుడు, శ్రావణ మంగళవారం గౌరీ దేవి, శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి , శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి.... ఇలా ప్రతిరోజూ పండుకే. అందుకే శ్రావణాన్ని పండుగల మాసం అంటారు. నిత్యపూజలతో ఇళ్లు కళకళలాడుతాయి. అమ్మవారి ఆలయాల్లోనూ పుష్పాల అలంకరణలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి. కాళ్లకు పసుపు రాసుకోవడం, ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకోవడం, వాయనాలు అందించడం, గోపంచకం ఇల్లంతా చల్లటం ఇలా పాటించే ప్రతినియమం ఆరోగ్యాన్నిచ్చేదే.
నిమయాల సంగతి సరే.. కొనుగోళ్లు విషయానికొస్తే.. శ్రావణంలో బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. సాధారణంగా అక్షయ తృతీయకు బంగారం కొనేస్తారంతా, ఆ సమయంలో పసిడి వ్యాపారం కళకళలాడిపోతుంది..కానీ వాస్తవానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయకూడదు. అక్షయ తృతీయ రోజు దానధర్మాలు చేస్తే పుణ్యం రెట్టింపు అవుతుందని అర్థం. ఈ రోజున దాన ధర్మాలు చేయాలి కానీ బంగారం కొనుగోలు చేయాలన్న విషయం పురాణాల్లో లేదు..పండితులు కూడా చెప్పలేదు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలన్నది కేవలం వ్యాపారం పెంచుకునేందుకు చేసే ప్రచారం మాత్రమే అంటారు. కానీ ఈ రోజున బంగారం కొనుగోలు చేయాలన్నది బలంగా నాటుకుపోయింది...
మరి శ్రావణంలో బంగారం ఎందుకు కొనాలి?
శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్షీవ్రతం ఆచరిస్తారు. ఈ రోజు వ్రతంలో భాగంగా అమ్మవారి దగ్గర బంగారం పెడతారు. ఎవరి స్థోమత ఆధారంగా వారు కనీసం గ్రాము కాసు అయినా కొని నివేదిస్తారు. ఎందుకంటే.. పుత్తడిని శ్రీ మహాలక్ష్మి సమానంగా చూస్తారు. దక్షిణాయనంలో వచ్చే శ్రావణమాసం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చింది. స్వామివారు జన్మనక్షత్రం పేరుమీదున్న ఈ నెల అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం. అందుకే ఈనెలలో శ్రీ మహాలక్ష్మిని...ఐశ్వర్యానికి చిహ్నం అయిన బంగారంతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం బంగారం కొనుగోలు చేయలేకుంటే...పాతది అయినా లక్ష్మీరూపు ఏమైనా ఉంటే దాన్ని పంచామృతాలతో శుద్ధి చేసి వినియోగిస్తారు.
శ్రావణమాసంలో శ్రీవరలక్ష్మీ పూజ ఆచరిస్తే.. విష్ణువు-లక్ష్మీదేవి ఎంత అన్యోన్యంగా ఉంటారో వైవాహిక జీవితం అంత సంతోషంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. కోరిన వరాలు ఇచ్చే అమ్మకాబట్టి వరలక్ష్మీదేవిగా కొలుస్తారు. ఈరోజు శక్తికొలది నూతన వస్త్రాలు, బంగారు ఆభరణం, వివిధ రకాల పిండివంటలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఐశ్వర్యం, సౌభాగ్యం ఇవ్వమ్మా అని వేడుకుంటారు.
2025 లో వరలక్ష్మీ వ్రతం ఆగష్టు 08 శుక్రవారం వచ్చింది.. ఆగష్టు 09 శనివారం రాఖీ పౌర్ణమి.. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు..
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రావణ మంగళగౌరీ వ్రతం - కావాల్సిన సామగ్రి, పూజ చేసుకునే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















