Spirituality: సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని పనులివే!
Spirituality: కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఇంట్లో పెద్దోళ్లు అంటుంటారు..పొద్దుపోయింది ఇప్పుడు చేయకూడదు అని. సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులేంటి..ఎందుకు..
Spirituality: సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులను, నియమాలను పద్ధతిగా ఆచరిస్తుంటారు. వాటిని పాటించాలని తర్వాతి తరానికి చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయరాదని చెబుతుంటారు. వాటికి కారణాలు తెలియకపోయినా పెద్దోళ్లు చెప్పారు కదా పాటిస్తుంటారు. ఇవి కేవలం వాళ్లు చాదస్తంతో చెప్పినవి మాత్రమే కాదు.. కొన్ని గ్రంధాల్లో ప్రస్తావించినవి..అవేంటంటే..
సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చరాదు
సూర్యుడు అస్తమించిన తర్వాత లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టే సమయంగా భావిస్తారు. ఆ సమయంలో చీపురుతో ఇల్లు శుభ్రం చేస్తే ఆ ఇంట్లో సంతోషం పాటూ లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లిపోతుందని భావిస్తారు. అందుకే లైట్లు వేశాం కదా ఇల్లు ఊడ్చొద్దు అని చెబుతారు. అయితే సూర్యస్తమయానికి ముందు ఇల్లు శుభ్రం చేయడం చాలా మంచిది..ఇలా చేస్తే ఈ ఇంట్లో శుభం జరుగుతుంది.
Also Read: ఆరోగ్యం బాగోపోతే హోమం చేయాలని ఎందుకంటారు!
సాయంత్రం పూట తులసికోటని తాకొద్దు
నిత్యం తులసిని పూజించే ఇళ్లలో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని...సాయంత్రం పూట తులసిని తాకడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం. అందుకే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం నిషిద్ధం.
సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకండి
సంధ్యాసమయంలో నిద్రపోవడం వల్ల దేవతల ఆశీర్వచనాలు ఉండకపోగా రాక్షస బుద్ధి పెరుగుతుంది. ఈ సమయంలో నిద్ర ఆరోగ్యపరంగా కూడా చెడు ప్రభావం చూపిస్తుంది.
ఇంటిని చీకటిగా ఉంచొద్దు
సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం పెరుగుతుంది..అలాంటి సమయంలో ఇల్లంతా వెలుగుతో నిండి ఉంటే నెగిటివ్ ఎనర్జీ దరిచేరదు. అందుకే సంధ్యాసమయంలో ఇంటిని అస్సలు చీకటిగా ఉంచకూడదు. కుదిరితే దేవుడి దగ్గర, ఇంటి ద్వారం దగ్గర ఈ సమయంలో దీపం వెలిగించడం శుభఫలితాలనిస్తుంది.
Also Read: నవంబరు నెల ఈ రాశులవారికి అనవసర ఖర్చులు, వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు
పాలు,పెరుగు ఇవ్వొద్దు
జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు లేదా ఇతర తెల్లటి వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు. ఇవన్నీ చంద్రునితో ముడిపడి ఉన్నాయి. సాయంత్రం వాటిని ఇవ్వడం వల్ల మీ మనశ్సాంతి దూరమవుతుందని చెబుతారు
ఉప్పు ఇవ్వొద్దు
అదే విధంగా సాయంత్రం అయిన తర్వాత ఉప్పును ఇతరులకు దానం చేయకూడదు. ఇలా ఉప్పు దానం చేయటం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట.
అప్పు అస్సలివ్వొద్దు
సాయంత్రం పూట ఎవరికీ అప్పు ఇవ్వకపోవటం తగదని, దీనికి కారణం సాయంత్రం డబ్బు ఇస్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారని ... తద్వారా ఆర్థిక సమస్యలు పెరుగుతాయని విశ్వసిస్తారు
చెత్తబయట వేయకూడదు
సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఉన్న చెత్తను బయట వేయరాదు. ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూలత వస్తుందని, లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుందని నమ్ముతారు
అతిథిని ఒట్టి చేతులతో పంపొద్దు
సంధ్యాసమయంలో ఇంటికి వచ్చే అతిథిని ఖాళీ చేతులతో పంపకండి. ఇంటికి వచ్చిన అతిథిని భగవంతుడి స్వరూపంగా చూస్తాం కాబట్టి సాయంత్రం సమయంలో వచ్చిన అతిథిని మరింత గౌరవిస్తే ఆ ఇంట్లో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు ఉంటాయని నమ్మకం.
జుట్టు, గోళ్లు కత్తిరించ వద్దు
చీకటి పడే సమయంలో జుట్టు, గోళ్లను ఎప్పుడూ కత్తిరించవద్దు. ఇది జీవితంపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్మకం. దీనివల్ల డబ్బు లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
కోరిక తగదు
సంధ్యాసమయంలో భార్యభర్త కలవకూడదు. సంధ్యా సమయం అంటే ధ్యాన సమయం...దైవ పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ లైంగిక వాంఛలు తీర్చుకోరాదని చెబుతారు. ఇలాంటి సమయంలో శారీరక సుఖాన్ని అనుభవించేవారికి పుట్టేపిల్లలు రాక్షస బుద్ధి కలిగిఉంటారు
చదువు కాదు శ్లోకాలు చెప్పండి
సూర్యాస్తమయం సమయంలో మెదడు మందంగా ఉంటుందట. అందుకే ఈ సమయంలో చదివినా బుర్రకు ఎక్కదని కేవలం శ్లోకాలు నేర్పించడమే మంచిదని పండితులు చెబుతారు.