Simha Sankranti 2023: సింహ సంక్రాంతి 2023 ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
Simha Sankranti 2023: సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించే సమయాన్ని సింహ సంక్రాంతిగా జరుపుకొంటారు. ఆగస్టు 17వ తేదీన వచ్చే సింహ సంక్రాంతి శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత, దానాల వివరాలు తెలుసుకోండి.
Simha Sankranti 2023 : ఈ సంవత్సరం, సింహ సంక్రాంతిని ఆగష్టు 17వ తేదీ గురువారం జరుపుకొంటారు. ఈ రోజున సూర్య భగవానుడు కర్కాటక రాశి నుంచి తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించడంతో అక్కడ బుధాదిత్య యోగం, త్రిగ్రాహి యోగం ఏర్పడతాయి. ఈ రోజు అంటే సింహ సంక్రాంతి నాడు పుణ్య నదులలో స్నానమాచరించి దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి.
సింహ సంక్రాంతి 2023లో శుభ యోగం
సూర్య భగవానుడు 2023 ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉంటాడు. దీని వల్ల సెప్టెంబర్ 17వ తేదీ వరకు బుధాదిత్య యోగం ఉంటుంది. మరోవైపు సింహరాశిలో బుధుడు, సూర్యుడు, కుజుడు ఉండటం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. కానీ ఈ యోగం ఆగస్ట్ 18వ తేదీ సాయంత్రం 4.12 గంటల వరకు ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు.
Also Read : కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయణం, దీని విశిష్టత మీకు తెలుసా?
సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించే సమయం: 17 ఆగస్టు 2023 మధ్యాహ్నం 01:44 గంటలకు
సూర్య సంక్రాంతి 2023 పుణ్యకాలం: 17 ఆగస్టు 2023 ఉదయం 06.44 నుంచి మధ్యాహ్నం 01.44 వరకు
మహా పుణ్య కాలం: 17 ఆగస్టు 2023 ఉదయం 11:33 నుంచి మధ్యాహ్నం 01:44 వరకు
సింహ సంక్రాంతి రోజు ఏం చేయాలి
సూర్య సంక్రాంతి రోజున తెల్లవారుజామున దగ్గరలో ఉన్న పవిత్ర నదిలో స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించే సమయంలో ఎర్రచందనం, ఎర్రని పువ్వులను నీటిలో వేసి అర్ఘ్యం సమర్పించాలి. దీని తరువాత, పేద బ్రాహ్మణులకు 1.25 కిలోల గోధుమలు, 1.25 కిలోల బెల్లం దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు, సమాజంలో మంచి గౌరవంతో పాటు ఉన్నత స్థితిని పొందుతారు.
సింహసంక్రాంతి రోజున ఈ వస్తువులను తప్పకుండా దానం చేయడం చాలా ముఖ్యం. ఈ రోజున మీరు స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత, మీరు మీ శక్తి మేరకు పేదలకు సూర్య దేవునికి ఇష్టమైన ఎర్రచందనం, ఎర్ర వస్త్రం, రాగి పాత్రను దానం చేయాలి. ఇది మీకు సూర్యుని అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
సూర్య సంక్రాంతి పూజ విధానం
ఈ రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించేందుకు రాగి పాత్రలో నీటిని నింపి అందులో ఎర్రటి పూలు, ఎర్రచందనం, కొంచెం గోధుమపిండి వేసి సూర్యునికి సమర్పించాలి. దీని తరువాత, 'ఓం ఆదిత్యాయ నమః' అనే మంత్రాన్ని పఠిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఒకే ప్రదేశంలో మూడుసార్లు ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత రాగులు, గోధుమలు, బెల్లం, నువ్వులు మొదలైన వాటిని పేదలకు దానం చేయండి.
Also Read : రోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం
సింహ రాశి ప్రాముఖ్యత
సంక్రాంతి పండుగ సూర్యభగవానునికి సంబంధించిన రోజు. సింహ సంక్రాంతి రోజున నిర్మలమైన మనస్సుతో విష్ణువు, నరసింహ స్వామిని పూజించడం వలన వ్యక్తి తన సర్వ పాపాలు, కర్మల నుంచి విముక్తి పొందుతాడని నమ్ముతారు. సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల తీవ్రమైన రోగాలు నశిస్తాయి, వ్యక్తి సుఖ సంతోషాలను పొందుతాడు. సింహ సంక్రాంతి రోజున నెయ్యి తినడం విశిష్టత. ఈ రోజు నెయ్యి తింటే రాహు-కేతువుల దుష్ఫలితాలు తగ్గుతాయి. వ్యక్తి జ్ఞానం, బలం పొందుతాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.