Konidela Klin Kaara: రామ్ చరణ్ కుమార్తె పేరు ‘క్లీం కారా’కు అర్థం తెలుసా? లలితా సహ్రసనామంలో ఏం చెప్పారంటే?
Konidela Klin Kaara: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్-ఉపాసన కుమార్తెకు బారసాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మెగా వారసురాలికి క్లీంకార అని నామకరణం చేశారు. మరి క్లీంకార అంటే అర్థం ఏమిటో తెలుసా?
konidela klin kaara: మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన తమ కుమార్తెకు పేరు పెట్టేశారు. 'క్లీం కార కొణిదెల' అని నామకరణం చేశారు. పాప బారసాలను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుక పూర్తయిన తర్వాత పాపాయి ఊయల్లో ఉన్న ఫొటోని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తన మనవరాలి పేరు వెనక రహస్యాన్ని ఆయనే వివరించారు.
రామ్‌చరణ్-ఉపాసనల కుమార్తెకు.. ‘క్లీం కార’ అని పేరు పెట్టారు. ట్విట్టర్ ద్వారా చిరంజీవి స్వయంగా తన మనవరాలి పేరును ప్రకటించారు. ‘క్లీంకార’ నామం ప్రకృతి స్వరూపాన్ని, అమ్మవారి అత్యున్నత శక్తిని సూచిస్తుంది. మా చిన్న యువరాణి ఇలాంటి లక్షణాలను ఇనుమడింపజేసుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి పేర్కొన్నారు. లలితా సహస్ర నామం నుంచి ఈ పేరు తీసుకున్నామని వివరించారు.
లలితా సహస్ర నామంలో 622వ నామం ఓం క్లీంకార్యై నమః. ఈ నామానికి ప్రకృతికి ప్రతిబింబం అని అర్థం. అమ్మవారి శక్తి రూపానికి ఇది మరో పేరు. ‘‘క్లీం అనే బీజాక్షర స్వరూపిణియైన అమ్మవారికి నమస్కారం. నిరంతరం మానవులకి మానసికంగాను శారీరకంగాను ఉన్న కొన్ని రకాల కోరికలను తీర్చే మాతృస్వరూపిణికి నమస్కారం’’ అని దీని అర్థం. దుష్టాన్నము, విషాన్నము మానవుడి శరీరం అంతా పాడుచేసి తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తుంది. దీని నుంచి మానవుడిని బయటపడవేసే అపూర్వమైన మంత్రం ఇది.
ఈ గుణాలను పోగుచేసుకొని తన మనవరాలు ఎదగాలని మెగాస్టార్ ఆకాంక్షిస్తూ చేసిన ట్వీట్ అభిమానులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. క్లీంకార అనే పేరు కొత్తగా ఉందని.. అభిమానులు మురిసిపోతున్నారు. చిరంజీవి మనవరాలి పేరు ఇలా ప్రకటించారో లేదో.. ‘క్లీంకార’ పేరుతో.. మెగా అభిమానులు సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి మంగళవారం రోజు పాప పుట్టడంతో ఆమెకు ఆంజనేయస్వామి పేరు కలిసి వచ్చేలా నామకరణం చేస్తారని అంతా అనుకున్నారు. అ అనే అక్షరంతో పేర్లు కూడా పరిశీలించినట్లు వార్తలు వినిపించాయి. ఐతే ఆ అమ్మవారి నామం వచ్చేలా ‘క్లీంకార’ అనే పేరు పెట్టారు. కాగా.. జూన్ 20వ తేదీన అపోలో ఆస్పత్రిలో ఉపాసన.. మెగా ప్రిన్సెస్‌కు జన్మనిచ్చింది. పాప పుట్టాక తొలిసారి మీడియా ముందుకొచ్చిన చరణ్.. తన బిడ్డ నాన్న పోలికతోనే ఉందని చెప్పారు.
రామ్‌చరణ్ - ఉపాసన 2012లో వివాహం చేసుకున్నారు. పెళ్లైన 11 సంవత్సరాల తర్వాత వీరికి పాప పుట్టింది. ప్రెగ్నెన్సీ ఆలస్యం కావడంపై ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సమాజం కోరుకున్నప్పుడు కాకుండా నేను తల్లిని కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చడం గర్వంగా ఉంది. వివాహమైన పదేళ్ల తర్వాత మేం బిడ్డను కనాలని అనుకున్నాం. ఎందుకంటే ఇది సరైన సమయం. మేమిద్దరం (ఉపాసన-రామ్‌చరణ్) మా రంగాల్లో ఎదిగాం. ఆర్థికంగా బలోపేతమయ్యాం. మా పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయికి చేరాం’’ అని చెప్పారు.
Also Read : చాణక్య నీతి - భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధమే