Navratri 2022: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!
Navratri 2022:నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు దుర్గాదేవి బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తోంది. ఈ రూపంలో ఉన్న అమ్మను దర్శించుకుంటే ఆయుష్షు,కీర్తి,ఆదాయం పెరుగుతుంది. ఈ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటంటే..
Navratri 2022: త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. బాల త్రిపుర సుందరీ దేవిది త్రిగుణైక శక్తి - సరస్వతి విఙ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్న బాల ఆనందప్రదాయిని. నిర్మలత్వానికి ప్రతీక అయిన బాల్యంలో మనసు,బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే నిత్యసంతోషం కలుగుతుందని విశ్వాసం. షోడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. శ్రీ చక్రంలో మొదటి దేవత బాల అందుకే సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల త్రిపుల సుందరీ దేవి భక్తుల పూజలందుకుంటుంది.
Also Read: దసరాల్లో పిల్లలకు పూజ చేస్తుంటారు కదా - ఏ వయసు పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!
త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు అయిన జాగృత్, స్వప్న , సుషుప్తి కి అధిష్ఠాన దేవత. మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటారు. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అలాంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆత్మ స్వరూపురాలు అయిన బాలను పూజిస్తే జ్ఞానం, మోక్షం దిశగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. అందుకే అమ్మవారి స్వరూపంగా భావించే బాలలను త్రిపుర సుందరిగా అలంకరించి పూజ చేస్తారు.
Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారం రోజు ఏ నైవేద్యం సమర్పించాలి!
బాలా త్రిపురసుందరి ఆవిర్భావం
బ్రహ్మాండ పురాణం, లలితా సహస్రంలో త్రిపురసుందరి ఆవిర్భావం గురించి ఏం చెప్పారంటే భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది పిల్లలు. వీళ్ళంతా అవిద్యా వృత్తులకు సంకేతం. వీళ్లంతా ఇంద్రాది దేవతలను నానా బాధలు పెట్టడంతో హంసలు లాగే రథంపై వచ్చిన కన్య ఈ 30 మంది భండాసుర పుత్రులనూ సంహరించింది. కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదంటూ అప్పటి నుంచీ బాల ఆరాధన చేయడం ప్రారంభించారు. హంసలు శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. అందుకే అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెబుతారు.
శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం
బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే
కామేశ్వర్యై చ ధీమహి..తన్నోబాలా ప్రచోదయాత్.
శ్రీ బాలా త్రిపుర సుందరి కవచం
అస్య శ్రీ బాలా కవచ స్తోత్ర మంత్రస్య
శ్రీ దక్షిణామూర్తి ఋషిః
పంక్తిస్చంద్రః శ్రీ బాలాత్రిపురసుందరి దేవతా
ఐం బీజం సౌహు శక్తిః క్లీం కీలకం
శ్రీ బాలాత్రిపురసుందరి దేవతా ప్రీత్యర్దే జపే వినియోగః.
ఐం వాక్బవః పాతు శీర్షే క్లీం కామరాజ స్తదా హృది
సౌహు శక్తి బీజం మామ్ మాం పాతు నాభౌ గుహ్యే చ పాదయోః
ఐం క్లీం సౌః వాదనే పాతు బాల మాంసర్వసిద్ద
ఏహ్ స్రైమ్ హ్ ల్రీమ్ హ్ సౌహు పాతు స్కంధే భైరవీ కంట దేశత
భగొదయాతు హృదయే ఉదరే భగసర్పినీ
భగ మాలా నాభి దేశే లింగే పాతు మనో భవా
గుహ్యేపాతు మహావీరా రాజరాజేశ్వరీ శివా !
చైతన్య రూపిణీ పాతు పాదయోర్జగదంబికా
నారాయణి సర్వ గాత్రే సర్వకార్యశుభంకరీ.!
బ్రహ్మనీ పాతూమాం పూర్వేయ్ దక్షినే వైష్ణవి తధా
పశ్చిమే పాతు వారాహి హ్యూత్తరేతు మహేశ్వరి |
ఆగ్నేయ్యాం పాతు కౌమారీ మహాలక్ష్మీశ్చనైరుతే
వాయవ్యె పాతు చాముండా చ ఇంద్రాణి పాతు ఈశకే ||
ఆకాశె చ మహా మాయా ప్రుధివ్యమ్ సర్వమంగళా
ఆత్మానామ్ పాతు వారదా సర్వాంగే భువనేశ్వారీ ||
సర్వం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవతార్పణం అస్తు
బాలా త్రిపుర సుందరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది.ఆదాయాన్ని పెంచుతుంది. ఆయుష్షును వృద్ధి చేస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది.