దసరా 2022: శక్తిస్వరూపిణి 9 అవతారాలే నవదుర్గలు



శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)
శైలపుత్రి దక్షుని ప్రథమ పుత్రిక, తలపై చంద్రరేఖని ధరించి శూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది.



బ్రహ్మచారిణి ( గాయత్రి )
దుర్గమ్మ రెండో అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేసింది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి.



చంద్రఘంట ( అన్నపూర్ణ ) 
అమ్మవారి మూడో అవతారం చంద్రఘంట. శిరస్సుపై అర్థచంద్రుడిని ధరించి ఉంటుంది..అందుకే  ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ రూపాన్ని దర్శించుకున్నవారికి అన్నపానీయాలకు లోటుండదు.



కూష్మాండ ( కామాక్షి )
నవదుర్గల్లో అమ్మవారి నాల్గవ అవతారం కూష్మాండ. కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజాదేవి’ అని కూడా అంటారు.



స్కందమాత ( లలిత )
నవదుర్గల్లో ఐదో అవతారం స్కందమాత. స్కంధుడు అంటే కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. కమలాసనంపై  పద్మాసనంతో శోభిల్లుతుంది. నమ్మిన భక్తులకు విజయాన్నందిస్తుంది. 



కాత్యాయని (లక్ష్మి)
అమ్మవారి ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తపస్సుకి మెచ్చి ఆయన కోరిక మేరకు కుమార్తెగా జన్మించింది పార్వతీదేవి. కొత్స కుమార్తె కనుకే కాత్యాయని అనే పేరు వచ్చింది. 



కాళరాత్రి ( సరస్వతి )
దుర్గమ్మ ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.



మహాగౌరి ( దుర్గ ) 
ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. ఆ సమయంలో ఆమె శరీరం నల్లగా మారిపోతుంది. గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. అప్పటి నుంచి గౌరవర్ణంతో కాంతులను వెదజల్లుతూ ఉంటుంది



సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )
దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.



Images Credit: Pinterest