Dussehra 2022: దసరాల్లో పిల్లలకు పూజ చేస్తుంటారు కదా - ఏ వయసు పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!
Dussehra 2022: శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాల్లో ఒకటి బాలాత్రిపుర సుందరీ దేవి. ఈ రోజు చిన్నారులను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలందిస్తారు. మరి ఏ వయసు పిల్లల్ని పూజించాలో తెలుసా...
సర్వం రూపమయీ దేవీ, సర్వం దేవమయం జగత్
అతోహం విశ్వరూపాం, తాం నమామి పరమేశ్వరీమ్
నవరాత్రులలో ముగ్గురమ్మల మూలపుటమ్మకు తోడుగా ఆమెతో పాటు తొమ్మిది శక్తులు ఉంటాయని దేవీ పురాణం చెబుతోంది. ఆ తొమ్మిది శక్తులో రెండవది బాలా త్రిపుర సుందరీ దేవి ( కౌమారీ). ఈ రోజు చిన్నారులకు బాలాత్రిపుర సుందరి అలంకారం చేసి కౌమారీ పూజ చేస్తారు. ఎందుకంటే..
అమ్మవారు మూడు రూపాల్లో కనిపిస్తుంది
1.కుమారిగా బాలత్రిపుర సుందరి
2.యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి
3.వృధ్ధరూపం త్రిపురభైరవి
బాల త్రిపుర సుందరీ దేవిది త్రిగుణైక శక్తి - సరస్వతి విఙ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్న బాల ఆనందప్రదాయిని. నిర్మలత్వానికి ప్రతీక అయిన బాల్యంలో మనసు,బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే నిత్యసంతోషం కలుగుతుందని విశ్వాసం. షోడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. శ్రీ చక్రంలో మొదటి దేవత బాల అందుకే సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల త్రిపుల సుందరీ దేవి భక్తుల పూజలందుకుంటుంది.ఈ రోజు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసి, కొత్తబట్టలు పెడతారు.
Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారం రోజు ఏ నైవేద్యం సమర్పించాలి!
బాలా త్రిపురసుందరి ఆవిర్భావం
బ్రహ్మాండ పురాణం, లలితా సహస్రంలో త్రిపురసుందరి ఆవిర్భావం గురించి ఏం చెప్పారంటే భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది పిల్లలు. వీళ్ళంతా అవిద్యా వృత్తులకు సంకేతం. వీళ్లంతా ఇంద్రాది దేవతలను నానా బాధలు పెట్టడంతో హంసలు లాగే రథంపై వచ్చిన కన్య ఈ 30 మంది భండాసుర పుత్రులనూ సంహరించింది. కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదంటూ అప్పటి నుంచీ బాల ఆరాధన చేయడం ప్రారంభించారు. హంసలు శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. అందుకే అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెబుతారు.
Also Read: శరన్నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు, తింటే ఏమవుతుంది!
ఏ వయసువారిని పూజించాలి
- రెండుసంవత్సరాలు ఉన్న బాలికను కుమారి అంటారు. కుమారిగా భావించి పూజించడం వల్ల దారిద్ర్యదుఃఖాలు నశిస్తాయి.
- మూడుసంవత్సరాలు ఉన్నబాలికను త్రిమూర్తి అని అంటారు. ఈ త్రిమూర్తిని పూజించడం వల్ల ధనధాన్య, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది.
- నాలుగుసంవత్సరాలు ఉన్న బాలికను కల్యాణి అని అంటారు. కల్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి చేకూరుతుంది.
- ఐదుసంవత్సరాలు ఉన్న బాలికను రోహిణి అని అంటారు. రోహిణిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది.
- ఆరుసంవత్సరాలు ఉన్న బాలికను కాళిక అని అంటారు, కాళికను పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది
- ఏడు సంవత్సరాల బాలికను చండిక అంటారు. ఈ అమ్మను పూజిస్తే పేదరికం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది
- ఎనిమిది సంవత్సరాల బాలికను శాంభవి అంటారు. ఈ అమ్మను పూజిస్తే ప్రతి పనిలో ఆటంకాలు తొలగి, అనుకూలత ఏర్పడుతుంది.
- తొమ్మిదేళ్ల పాపను దుర్గ అని అంటారు. ఈ అమ్మను పూజించడం వల్ల అన్ని రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయి.