Medaram Jatara 2024: గద్దెపై కొలువుదీరిన సారలమ్మ - ఈ రోజు సమ్మక్క ఆగమనం - జనసంద్రమైన మేడారం!
మేడారం మహా జనసంద్రమైంది. అమ్మ కరుణ కోసం భక్తిశ్రద్ధలతో తరలివచ్చిన బిడ్డలతో మహారణ్యం జనారణ్యమైంది. పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారం చేరుకున్నాక సారలమ్మ గద్దెపై కొలువుతీరింది..ఈ రోజు సమ్మక్క రానుంది
Medaram Jatara 2024: రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర ఈ ఏడాది వైభవంగా జరుగుతోంది. జాతరలో మొదటిరోజైన బుధవారం సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో మేడారం భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. ఇక సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెపైకి స్వాగతించేందుకు మేడారం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూస్తోంది.
Also Read: మేడారం జాతరలో బెల్లమే బంగారం ఎలా అయింది!
బుధవారం అర్థరాత్రి కొలువుతీరిన సారలమ్మ
తరలివచ్చిన సారలమ్మ బుధవారం అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించింది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలికారు. సారలమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే కన్నెపల్లికి భక్తజనం పోటెత్తింది. పూజల తరువాత కన్నెపల్లి నుంచి 16 మంది ఆడబిడ్డలు సంప్రదాయం ప్రకారం డోలి విన్యాసాలతో తరలివచ్చి తల్లీబిడ్డలైన సమ్మక్క-సారలమ్మ కొలువుదీరే గద్దెలపై ముగ్గులు పెట్టి కంకవనానికి కంకణాలు కట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే కన్నెపల్లి సారలమ్మ గుడి వద్ద డోలి విన్యాసాలు, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి పరిషత్, సారలమ్మ యువజన సంఘం బృందాల సారథ్యంలో కళా ప్రదర్శనలు కొనసాగాయి. అదే సమయంలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య సహా ఇతర పూజారులు సారలమ్మ గుడిలో వారి ఆచార సంప్రదాయాలను ఆచరించారు. కన్నెపల్లిలో ఇల్లిల్లూ ఆడబిడ్డకు మంగళహారతులు పట్టారు. అక్కడి నుంచి జంపన్న వాగు చేరుకున్నారు...వాగుపై వంతెన ఉన్నా వారి సంప్రదాయం ప్రకారం వాగులోంచే సారలమ్మను తీసుకురావడం ఆనవాయితీ. జంపన్నవాగు నుంచి బయల్దేరిన సారలమ్మకు మేడారంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల వడ్డెలు ఘనస్వాగతం పలికారు. కన్నెపల్లి నుంచి మేడారానికి దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా దారికి ఇరువైపులా జనం పోటెత్తారు.శివసత్తుల పూనకాలతో జాతర మార్మోగింది. ఎదురుకోళ్లు సమర్పిస్తూ, ఒడిబియ్యం చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ జనం సారలమ్మకు నీరాజనం పలికారు. సారలమ్మ మేడారం గుడిలోకి చేరగానే ఆదివాసీ సంప్రదాయ విన్యాసాలతో డోలి మోతలు, కొమ్ము బూరల నాదాలతో దద్దరిల్లాయి. పూజలు నిర్వహించిన అనంతరం సారక్కను మేడారం గద్దెపై ప్రతిష్టించారు.
Also Read: నాలుగు రోజుల జాతరలో ఏ రోజు ఏం చేస్తారు - మూడోరోజు ఎందుకు ప్రత్యేకం!
ఫిబ్రవరి 22 గురువారం సమ్మక్క రాక
మహాజారతలో రెండోరోజు ఫిబ్రవరి 22న సమ్మక్క తల్లి సాయంత్రం గద్దెపైకి వస్తుంది. మొదటగా గిరిజన పూజారులు మేడారం సమీపంలోని చిలుకల గుట్టకు వెళ్ళి వెదురు కర్రలు తీసుకొచ్చి గద్దెలపై పెట్టి పూజిస్తారు. ఆ తర్వాత సమ్మక్క పూజా మందిరం నుంచి పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. తర్వాత మళ్ళీ చిలుకల గుట్టకు వెళ్తారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చే మహాఘట్టం మొదలవుతుంది. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె తన్మయత్వంతో పరుగు పరుగున గుట్ట దిగుతాడు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం మొత్తం శివసత్తుల పూనకాలతో హోరెత్తి ఊగిపోతుంది. దారి పొడవునా భక్తుల జన ప్రవాహం సాగుతుంది..అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా జంతు బలులు ప్రారంభమవుతాయి. కుంకుమ భరణిని గద్దెలపైకి చేర్చిన తర్వాత మహా జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది.
Also Read: అడవి తల్లుల దీవెనెకు ప్రతిరూపం - భక్తజన వనసంబురం మేడారం గురించి ఈ విషయాలు తెలుసా!
జాతర సందర్భంగా ఆర్టీసీ బస్సులు అమ్మవార్ల గద్దెలకు అతి సమీపంలోకి వెళ్తాయని, భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా వనదేవతలను దర్శించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. అధికారులంతా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మరోవైపు మేడారం మహాజాతరపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు.