Medaram Jatara 2022: ఆ ప్రదేశంలో చిన్న తప్పు చేసినా తేనెటీగలు వెంటాడుతాయట
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అడుగడుగునా అద్భుతాలే. గద్దెల వద్ద జువ్విచెట్టు మొదలు, చిలకలగుట్ట సమీపంలో తేనెతుట్ట వరకూ జాతరలో ప్రతి ఘట్టమూ అద్భుతమే.
శివసత్తుల పూనకాలు, పొర్లు దండాలు, బెల్లం ఘుమఘుమలు, బంగారం మొక్కులు ఇలా.. వెరసి గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విలసిల్లే ఈ జాతర ఏటా మాఘపౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 బుధవారం మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, రాష్ట్ర పండగగా ఖ్యాతి గడించిన ఈ జాతర రెండేళ్లకోసారి కన్నుల పండువగా జరుగుతుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కుగ్రామం ఈ జాతర సమయంలో జనారణ్యాన్ని తలపిస్తుంది. ఈ జాతరలో అడుగడుగూ అద్భుతమే
నాగుపాము రూపంలో పగిడిద్దరాజు
సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్విచెట్టును ఎంతో మహిమగలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమిస్తాడని చెబుతారు. సమ్మక్క, సారలమ్మ దర్శనానికి ఎంతమంది వస్తారో చూస్తుంటాడట. అయితే పగిడిద్దరాజు తన వద్దకు వచ్చే భక్తులపై మనసు పారేసుకుంటాడనే ఉద్దేశంతో సమ్మక్కతల్లి భర్తకు కళ్లు లేకుండా చేసి నాగుపాము రూపంలో చెట్టు పైన ఉంచిందంటారు
Also Read: భక్తులు నేరుగా దర్శించుకునే సమ్మక్క, సారలమ్మ గద్దెలు కాలక్రమేణా ఎన్ని మార్పులు చెందాయో తెలుసా
తేనెటీగలు కాపలా
కుంకుమభరిణె ఉండే ప్రాంతం చిలుకలగుట్ట. అత్యంత మహిమాన్వితమైనదిగా భావించే ఈ గుట్ట చుట్టూ తేనెటీగలు కాపలా ఉంటాయి. ఆ ప్రదేశంలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే తేనెటీగలు వెంటబడి తరుముతాయని ఆదివాసీల విశ్వాసం.
ఈ నీరు తాగితే సమస్త రోగాలు మాయం
చిలుకలగుట్టపై నుంచి రెండు సన్నని జలధారలు నిరంతరాయంగా ప్రవహిస్తుంటాయి. సమ్మక్క, సారలమ్మల జలధారలుగా చెప్పే ఈ నీటిని తాగితే సమస్తరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.
పూజారుల చేతిలో కాంతిరేఖ
సమ్మక్కను తీసుకు రావడానికి ఒకరోజు ముందు చిలుకలగుట్టపైకి వెళ్లే పూజారుల చేతుల్లో ఓ కాంతిరేఖ వచ్చిపడుతుందని అదే సమ్మక్క ప్రతిరూపంగా పూజారులు చెబుతారు.
Also Read: రాజుల్లేరు, రాజ్యాల్లేవు.. వనదేవతల కరుణ అలాగే ఉంది.. మరో కుంభమేళాను తలపించే మేడారం..
మూడో రోజు అత్యంత ప్రధానం
జాతరలో అత్యంత ముఖ్యమైనది మూడోరోజే. ఆ ఒక్క రోజే దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు.. మొక్కుబడులు, ఎదురుకోళ్లు, పొర్లుదండాలు, జంతుబలులు, శివసత్తుల పూనకాలతో అడవంతా హోరెత్తిపోతుంది. తమ కష్టనష్టాలు తీర్చి సుఖసంతోషాలు ప్రసాదించాలంటూ వనదేవతలను ఒక్కొక్కరు.. ఒక్కో విధంగా పూజిస్తారు.
వనదేవతలే బిడ్డలుగా పుట్టాలని
మేడారం మహా జాతరలో నెలలు నిండిన గర్భిణులూ అమ్మవార్లను దర్శించుకుంటారు. భక్తి భావంతో కొందరు మేడారంలోనే ప్రసవం కావాలని కోరుకొని మరీ వస్తుంటారు. వీరిలో కొందరు జాతరలోనే బిడ్డలకు జన్మనిస్తారు. ఆడపిల్లలు పుడితే సమ్మక్క, సారలమ్మ అని, అబ్బాయి పుడితే జంపన్న అనే పేర్లు పెట్టుకుని మురిసిపోతారు.