Medaram Jatara 2022: భక్తులు నేరుగా దర్శించుకునే సమ్మక్క, సారలమ్మ గద్దెలు కాలక్రమేణా ఎన్ని మార్పులు చెందాయో తెలుసా
రెండు దశాబ్దాల క్రితం వరకూ ఎంచక్కా ప్రకృతి మధ్య ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఏటికేడు మారుతూ వచ్చాయి. బారికేడ్లతో మొదలై ఇప్పుడు ఆ స్థానంలో గ్రిల్స్ వచ్చి చేరాయి. ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే...
సమ్మక్క, సారలమ్మలకు రూపం అనేది లేదు. సమ్మక్క గద్దెను ఆనుకునే భారీ నెమలి నార చెట్టు ఉండేది. గతంలో ఈ నారెపచెట్టుకే పసుపు కుంకుమ పెట్టి సమ్మక్కగా భావించే వారు. వడ్డెలు (పూజారులు) చిలకల గట్టు నుంచి కుంకుమ భరిణను తెచ్చి నార చెట్టు వద్దనే ఉంచి పూజలు చేసేవారు. చెట్టు, పుట్టలే గిరిజనులకు సమ్మక్క సారక్కలు. ఇప్పటికీ ఆదివాసీ గూడెలలో మేడారం గద్దెలను పొలిన ఇంటి అరుగులు ఉంటాయి. కాల క్రమేణా గద్దెల మీద సమ్మక్క సారక్కలు సింహం, పులి మీద ఉన్నట్లుగా ఫోటోలు ముద్రించి జాతరలో అమ్మకాలు చేశారు. ఆ ఫోటోలే ప్రజల మదిలో నిలిచిపోయాయి.
Also Read: నేడు తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభం, పగిడిద్దరాజు రాకతో తొలి ఘట్టం
భక్తుల సంఖ్య పెరగడంతో గద్దెల ప్రాంగణంలో బండలు వేశారు. సమ్మక్క సారలమ్మ గద్దెల పై భాగంలోనూ పాలిష్ బండలు అమర్చారు. 1990 కన్నా ముందు జాతర కొచ్చే గిరిజనులు, గ్రామీణులు నేరుగా గద్దెలపైకి వెళ్లి తాము తెచ్చిన బంగారం, వడిబియ్యం, ఇతరకానుకలు సమర్పించుకునే వారు. భక్తులు అమ్మవార్ల గద్దెలను స్వయంగా తాకి సంతృప్తిగా మొక్కులు తీర్చుకునేవారు. క్రమ క్రమంగా లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో జాతర సమయంలో గద్దెల చుట్టూ కట్టెలతో బారికేడ్లు కట్టారు. బారికేడ్ల బయట నుంచి అమ్మవార్లను దర్శించుకుని తాము తెచ్చిన బెల్లం, కుడకలు,వడిబియ్యం దూరంనుంచే గద్దెలపైకి వేసేవారు. ఆ సమయంలో కట్టెల బారికేడ్ల వద్ద బందోబస్తులో ఉండే పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, ఆదివాసీ గిరిజన సంఘం కార్యకర్తలకు కొబ్బరికాయలు, బెల్లం తగిలి గాయాలయ్యేవి. ఈ ప్రమాదాలను నివారించేందుకు గాను 2002 లో అప్పటి జిల్లా పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల చుట్టూ ఎత్తైన గ్రిల్స్ లను నిర్మించాలని నిర్ణయించింది. దీనితో, హైదరాబాదులోని సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ (ఈ ట్రస్ట్ జనగామ కు చెందిన వారిదని సమాచారం ) ఈ గ్రిల్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ప్రస్తుతం గద్దెల చుట్టూ ఉన్న ఎత్తైన గ్రిల్స్ అప్పుడు ఏర్పాటు చేసినవే.
Also Read: రాజుల్లేరు, రాజ్యాల్లేవు.. వనదేవతల కరుణ అలాగే ఉంది.. మరో కుంభమేళాను తలపించే మేడారం..
90వ దశకం ముందు కేవలం మూడు ఫీట్ల ఎత్తులో ఉన్న గద్దెలపై తొమ్మిది ఫీట్ల ఎత్తులో సమ్మక్క ప్రతిరూపం ఉండేది. జాతర రెండో రోజు నెమలి నార చెట్టు పై నాగు పాము వచ్చేదని ఆదివాసులు చెప్పేవారు. ఈ చెట్టు బెరడు తీసుకుని వాటి చూర్ణం/ పొడి పిల్లలకు పాలలో వేసి తాగిస్తే ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకంతో భక్తులంతా ఆ చెట్టు బెరడు తీసుకెళ్లేవారు. ఆ భారీ వృక్షం క్రమంగా ఎండిపోవడంతో ప్రస్తుతం తిరిగి మరో చెట్టుని ఫెన్సింగ్ వేసి జాగ్రత్తగా పెంచుతున్నారు. అమ్మవార్ల బొమ్మలు జాతర్లలో అమ్ముతున్నప్పటికీ చాలా మంది నెమలినార చెట్టు ను సమ్మక్క దేవతగా భావిస్తారు
సారలమ్మ ప్రతిరూపమైన గద్దె దాదాపు పదిహేను అడుగుల ఎత్తులో ఉండేది. ఈ గద్దెల చుట్టూ ఏవిధమైన అలంకారాలుండేవి కావు. క్రమక్రమంగా గద్దెలకు తాము తెచ్చిన చీరలతో అలంకరించడం ప్రారంభించారు. ఇలా తొలినాళ్లలో చాలా నిరాడంబరంగా ఉండే సమ్మక్క సారలమ్మ ల గద్దెలు, క్రమక్రమంగా ఎత్తైన అరుగుల నిర్మాణం, అనంతర కాలంలో వీటి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు వరకు మార్పు చెందాయి. ఇది ఆహ్వానించదగినదే అయినప్పటికీ.. బాహ్యప్రపంచంలో భక్తులకు దగ్గరగా ఉన్న అమ్మవార్లను ఇప్పుడు ఇనుప గ్రిల్స్ మధ్య దర్శించుకోవాల్సి వస్తోందంటున్నారు కొందరు భక్తులు.