Magha Pournami 2024: ఏడాదిలో 4 పూర్ణిమలు ప్రత్యేకం - అందులో మాఘ పౌర్ణమి మరింత విశిష్టమైనది!
Magha Pournami 2024 : తెలుగు నెలల్లో ప్రతి నెలకూ ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపారాధనలకు ప్రసిద్ధి అయినట్టే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. ఈ నెల మొత్తంమీద మాఘ పౌర్ణమి ఇంకా ప్రత్యేకం
Significance Of Magha Pournami 2024 : 2024 ఫిబ్రవరి 24 మాఘపూర్ణిమ..ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి? సముద్ర స్నానం ఎందుకు చేయాలి?
"మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ
బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''
బ్రహ్మ ముహూర్తంలో జలాలన్నీ బ్రహ్మహత్య, సురాపానం లాంటి మహా పాతకాలను పోగొట్టి పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉంటాయని ఈ శ్లోకం అర్థం
మాఘపూర్ణిమ ఎందుకు ప్రత్యేకం
మకర సంక్రమణం నుంచి కుంభసంక్రమణం వరకు ఉండే మధ్యకాలమే "మాఘమాసం''. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. మాఘపూర్ణిమను "మహామాఘి'' అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ "మాఘ పూర్ణిమ'' అత్యంత విశేషమైనది. ఈ "మహామాఘి'' శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేయాలంటారు.
నదీనాం సాగరో గతి!
సకల నదీ, నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. అందుకే సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏంటటే నిత్యం సూర్యకిరణాలవల్ల, ఎంత నీరు ఆవిరి అవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు. అలాగే, ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. అఘాది, జడత్వాలు ఆయన తత్త్వం. సాగరుడు సంతోశప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా "ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ''రోజుల్లో చేయాలని..అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాల్లో ఉంది
Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు
సూర్యోదయానికి ముందే స్నానం
నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిల్చుని కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔషద విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు.
అంత్య పుష్కరిణీ స్నానాలు
సముద్రం, నదుల్లో స్నానమాచరించలేనివారు బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ "గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి'' నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే, మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందుతారు. చివర మూడుస్నానాలనూ "అంత్యపుష్కరిణీ స్నానాలు'' అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే, మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.
Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!
స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన శ్లోకం
"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''
అంటే "దుఃఖం, దారిద్ర్యం, పాపం నశించడానికి ఈ పవిత్ర మాఘ స్నానం చేస్తున్నానని అర్థం.
అందుకే ఓ గోవిందా! అచ్యుతా! మాధవా! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు'' అని అర్థం.
స్నానం తర్వాత పఠించాల్సిన శ్లోకం
"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ
త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''
అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే "ఓ పరంజ్యోతి స్వరూపుడా! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు నశించుగాక'' అని అర్థం. మాఘస్నానం చేసిన తర్వాత, పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని, ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
Also Read: మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా!
పూర్ణిమకు సముద్ర స్నానానికి సంబంధం ఏంటి
పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు సముద్రానికి "పోటు'' ఎక్కువగా ఉంటుంది. "పూర్ణిమ'' దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం. జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ, అమావాస్య తిథుల్లో సూర్య-చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి ఉంటారని చెబుతారు.
Also Read: మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది!