Krishna's Flute Story: శ్రీకృష్ణుడు తనకు ఎంతో ఇష్టమైన వేణువును విరగ్గొట్టడానికి కారణం ఎవరో తెలుసా!
Krishna's Flute Story: తన వేణు గానాన్ని ప్రేమించిన రాధను శ్రీకృష్ణుడు ఎంతగానో ప్రేమించాడు. మరి రాధ ప్రేమకు కారణమైన వేణువును శ్రీకృష్ణుడు పగలగొట్టడానికి కారణమేంటి.?
Krishna's Flute Story: శ్రీకృష్ణునికి ఇష్టమైన వాటిలో వేణువు ఒకటి. చేతిలో వేణువు పట్టుకున్న శ్రీకృష్ణుడిని ఫొటోలు, విగ్రహాల్లో చూశాం. శ్రీకృష్ణుడు ఎప్పుడూ చేతిలో వేణువు పట్టుకునే ఉంటాడు. శ్రీకృష్ణుడు తన వేణువును వాయించడం ప్రారంభించిన తర్వాత, విశ్వమంతా కూడా భక్తితో ఉప్పొంగిపోయింది. శ్రీకృష్ణుడు ఎంతగానో ఇష్టపడే వేణువును ఎందుకు విరగ్గొట్టాడు..?
వేణువు పేరు
శ్రీకృష్ణుడు పట్టుకున్న వేణువు ప్రేమ, ఆనందం, ఆకర్షణకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆయన చేతిలోని వేణువు పేరు మహానంద లేదా సమ్మోహిని. ఈ వేణువు శబ్దానికి ఎవరినైనా మంత్రముగ్ధులను చేసే శక్తి ఉంది.
Also Read : కృష్ణుడికి ఫస్ట్ లవ్ లెటర్ రాసినదెవరో తెలుసా - సృష్టిలోనే మొదటి ప్రేమలేఖ అదే!
ఎముకతో వేణువు తయారీ
మత విశ్వాసాల ప్రకారం, శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వేణువు దధీచి మహర్షి ఎముకలతో తయారు చేశారని నమ్ముతారు. బాలకృష్ణుడిని కలవడానికి వచ్చిన పరమేశ్వరుడు ఆయనకు ఈ వేణువును బహుమతిగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ వేణువును శ్రీకృష్ణ పరమాత్ముడు తన దగ్గరే ఉంచుకున్నాడు.
రాధ కూడా ఓసారి వేణువుతో.. "నా ప్రియమైన వేణువు, నేను కృష్ణుడిని చాలా ప్రేమిస్తున్నానని చెప్పు, కానీ కృష్ణుడు నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు, తన పెదవులతో నిన్ను ముద్దాడుతాడు. దీనికి కారణం ఏమిటి?" అని అడుగుతుంది.
అప్పుడు వేణువు ఇలా అంటుంది.. "నేను నా శరీరాన్ని ముక్కలు చేసుకున్నాను. మధ్యలో రంధ్రాల కోసం మళ్లీ కత్తిరించుకున్నాను. కృష్ణుడి చేతిలో వేణువుగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఆయనే నాకీ మహధ్భాగ్యాన్ని ప్రసాదించాడు. మీరు మాత్రం మీ కోరికల కోసం కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు" అని రాధకు వివరిస్తుంది.
శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వేణువులోని ఏడు రంధ్రాలు మానవ శరీరంలోని ఏడు చక్రాలకు ప్రతీకలు. మానవుడిలోని ఏడు చక్రాలు శ్వాస ద్వారా వేణువుపైకి చేరతాయి. అందుకే వేణువు ద్వారా ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రాగాన్ని ఆలపించలేరు. మనస్సుకు అనుగుణంగానే సంగీతం ఉద్భవిస్తుంది. మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు, మారుతూ ఉంటుంది. రెండు మనసులు ఎన్నటికీ సరిపోలవు. అదేవిధంగా రెండు రాగాలు ఒకేలా ఉండవు, అయినప్పటికీ వేణువు మాత్రం ఒకేలా ఉంటుంది. ఈ విశ్వంలోని ప్రతి వ్యక్తి జీవితం సృష్టికర్త చేతిలో వేణువు లాంటిది. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తుంది. భగవంతుడికి దగ్గర చేస్తుంది.
వేణువు విరవడానికి కారణం
తన చివరి క్షణాల్లో రాధను ఏమైనా కోరుకోమని శ్రీకృష్ణుడు అడుగుతాడు. ఆమె తనకు వేణువును ఇవ్వమని శ్రీకృష్ణుడిని కోరింది. వేణు గానం వినగానే రాధ తన శరీరాన్ని విడిచిపెట్టిందని చెబుతారు. రాధ విడిపోవడాన్ని తట్టుకోలేని శ్రీకృష్ణుడు ఆ వియోగంలో తన వేణువును పగలగొట్టి విసిరివేస్తాడు.
శ్రీకృష్ణ-రుక్మిణి
కంసుడిని సంహరించిన తరువాత, శ్రీకృష్ణుడు రుక్మణిని వివాహం చేసుకుని ద్వారకలో స్థిరపడ్డాడు. అయినప్పటికీ, రుక్మిణి భార్యగా ధర్మాన్ని అనుసరించింది. ఎల్లప్పుడూ భగవంతుని సేవలో నిమగ్నమై ఉండేది. కానీ, శ్రీ కృష్ణుడు రాధను తన మనస్సు నుంచి ఎప్పటికీ తొలగించలేకపోయాడు.
Also Read : కృష్ణుడికి 8 మంది భార్యల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా!
రాధాకృష్ణులు
శ్రీ కృష్ణ భగవానుడు తన జీవితాంతం తన బాధ్యతలన్నింటినీ నెరవేర్చాడని చెబుతారు. తన జీవితంలోని చివరి క్షణాలలో రాధతోనే కలిసి ఉన్నాడని నమ్ముతారు. రాధాకృష్ణుల ప్రేమ ఎప్పటికీ చెక్కు చెరగనిది. వారి ప్రేమను ఎవరూ అధిగమించలేరు. వారి మధ్య ఉన్న ప్రేమ కారణంగానే మనం ఎక్కువగా రాధాకృష్ణుల చిత్రాలను, విగ్రహాలనే చూస్తాము.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.