Dussehra Ayudha Pooja 2024: ఆయుధ పూజ దసరా సమయంలోనే ఎందుకు చేస్తారు!
Ayudha Pooja 2024: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులైన దుర్గాష్టమి, మహర్నవమి, విజయ దశమి అత్యంత ప్రధానమైనవి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు ఆయుధ పూజ చేస్తారు..ఇంతకీ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?

Significance of Ayudha Pooja : 2024 లో దసరా నవరాత్రులు అక్టోబరు 03న ప్రారంభమై 12న విజయ దశమితో ముగుస్తాయి...చివరి మూడు రోజుల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరోజు ఆయుధ పూజ చేస్తారు.
ప్రతి వ్యక్తి తను చేసే పనికి ఉపయోగించే వస్తువు ఏదో ఒకటి ఉంటుంది...అదే తన ఆయుధం అని చెప్పుకోవాలి. ఆయుధం సమర్థవంతంగా ఉపయోగించినప్పుడే విజయం సాధ్యం అవుతుంది. తనకు విజయాన్ని చేకూర్చినందుకు కృతజ్ఞతగా చేసే పూజే ఆయుధపూజ..
ఆయుధ పూజ వెనుక ఆసక్తికరమైన కథనం చెబుతారు.. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు ప్రయత్నించిన త్రిమూర్తులు మహిషాసురిడికి మగవారి చేతిలో మరణం లేదనే వరం ఉందని గుర్తుకు వస్తుంది. అప్పుడు అమ్మవారిని రంగంలోకి దించి మహిషాసురుడితో యుద్ధం చేయమని పంపిస్తారు.
Also Read: దసరా వచ్చేస్తోంది.. ఇంట్లోకి దైవిక శక్తిని ఆహ్వానించేందుకు ఈ వాస్తు సూత్రాలు పాటించండి!
అమ్మవారి శక్తి పెంచేందుకు...త్రిమూర్తులు తమ శక్తిని ధారపోస్తారు. అదే సమయంలో మిగిలిన దేవతలంతా తమ ఆయుధాలను అమ్మవారికి ఇచ్చి ఆమెను మరింత శక్తివంతంగా మార్చుతారు. అలా 8 చేతుల్లో 8 శక్తివంతమైన ఆయుధాలు ధరించి రాక్షస సంహారానికి బయలుదేరుతుంది శక్తి స్వరూపిణి. సింహవాహనాన్ని అధిరోహించి..లోకాలను హింసిస్తున్న రాక్షసుడైన మహిషాసురుడితో భీకర యుద్ధం చేసి అంతం చేస్తుంది.
ఉత్తరాషాడ - శ్రవణం నక్షత్రం మధ్య అభిజిత్ లగ్నంలో రాక్షసులపై దేవతలు విజయం సాధించారు. ఆసందర్భానికి గుర్తుగా విజయదశమికి ఆయుధ పూజ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది.
మహిషాసుర మర్దిని రూపంలో దుర్గాదేవి రాక్షసులను సంహరిస్తుంది. యుద్ధం పూర్తైన తర్వాత కూడా ఉగ్రరూపంలోనే ఉండిపోయిన అమ్మవారిని శాంతింపచేసేందుకు మహిషాసురమర్దిని స్తోత్రాన్ని పఠించారు సకలదేవతలు. ఆ ఆయుధాలను తిరిగి తీసుకుని వాటిని శుద్ధి చేసి..యుద్ధంలో విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా వాటిని పూజించారు. ఇదంతా శరన్నవరాత్రుల సమయంలోనే జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో విజయాన్ని అందించిన ఆయుధాలను శుద్ధి చేసి పూజించడం అనే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
కౌరవులతో ఓడి అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసిన పాండవులు...తమ అరణ్యవాసం ముగించిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళుతూ తమ ఆయుధాలను జమ్మిచెట్టు కొమ్మల మధ్య దాచిపెట్టి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచి ఉంచిన ఆయుధాలను తీసుకుని యుద్ధరంగంలో అడుగుపెట్టారు. విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం చేసిన పాండవులను...బయటకు రప్పించేందుకు కౌరవులు చేపట్టిన ఉత్తరగోగ్రహణ యుద్ధం ఇదే. అదే రోజు పాండవుల అజ్ఞాతవాసం ముగిసింది...అందుకే ఆయుధాలతో సహా కదనరంగంలోకి దిగారు పాండవులు.
ఆయుధాలను జాగ్రత్తగా భద్రపరిచిన జమ్మిచెట్టుకి అప్పటి నుంచి పవిత్రత పెరిగింది. సరిగ్గా విజయ దశమి ముందు రోజు అయిన మహర్నవమి రోజు ఆయుధాలను జమ్మిచెట్టు నుంచి కిందకు దించి పూజలు చేసి యుద్ధానికి వెళ్లి విజయం సాధించారు. అందుకే విజయ దశమి రోజు జమ్మిచెట్టుని పూజిస్తే తలపెట్టిన కార్యంలో విజయం సిద్ధిస్తుందని విశ్వాసం. అప్పటి నుంచి ఆయుధపూజ ప్రారంభమైందనే కథనం కూడా పురాణాల్లో ఉంది...
Also Read: అజాన్..నమాజ్ సమయంలో దుర్గాపూజ ఆపేయండి!
'సర్వేశ్వరీ సర్వ మయి సర్వ మంత్ర స్వరూపిణి'
లలితా సహస్రంలో ఉన్న ఈ మంత్రం అర్థం ఏంటంటే...సర్వ యంత్రాల్లో, మంత్రాల్లో, తంత్రాల్లో... అన్నిచోట్లా లలితాదేవి కొలువై ఉంటుందని అర్థం. అందుకే శక్తిస్వరూపిణికి ఆయుధ పూజ చేయడం ద్వారా అమపృత్యు దోషాలు తొలగిపోతాయని, వాహన ప్రమాదాలు జరగవని విశ్వాసం.
వ్యాపారులు, ఉద్యోగులు, వృత్తి పనివారంతా దుర్గాష్టమి, మహర్నవమి, విజయ దశమి రోజు తాము ఉపయోగించే వాహనాలను, యంత్రాలను అందంగా అలంకరించి పూజిస్తారు.
పోలీసులు అయితే తాము వినియోగించే లాఠీలు, తుపాకులకు పూజలు చేస్తారు
రైతులు వ్యవసాయ పనిముట్లు అయిన నాగలి, ఎండ్ల బండ్లు సహా ఇతర పరికరాలకు పూజలు చేస్తారు
టైలర్లు కుట్టు మిషన్లకు, చేనేత కార్మికులు మగ్గాలకు, ఫ్యాక్టరీలలో కార్మికులు యంత్రాలను పూజిస్తారు
ఇతర పనిముట్లకు కూడా పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు
Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

