Chanakya Neeti In Telugu : ఇలాంటి అలవాట్లు ఎప్పటికీ మారవని చెప్పిన ఆచార్య చాణక్యుడు
సమాజంలోని ప్రతి విషయం గురించి లోతైన జ్ఞానం, అంతర్దృష్టి ఉన్న ఆచార్య చాణక్యుడు అప్పట్లో శిష్యులకు బోధించిన ఎన్నో విషయాలు ఇప్పటికీ అనుసరణీయంగా ఉంటాయి. వాటిలో కొన్ని విషయాలు మీ అవగాహన కోసం..
Chanakya Neeti In Telugu : కొన్ని అలవాట్లు వయసు పెరిగేకొద్దీ మారుతాయి, మరికొన్ని అలవాట్లు జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మారుతాయి కానీ కొన్ని అలవాట్లు మాత్రం ఎప్పటికీ మారవని శిష్యులకు బోధించాడు ఆచార్య చాణక్యుడు.
న దుర్జనః సాధుదశాముపైతి బహు ప్రకారైరపి శిక్యమాణః
ఆమూలసిక్తం వయసా ఘృతేన న నిమ్బవృక్షో మధురత్వమేతి
దుష్టుడి స్వభావం గురించి ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా వివరించాడు. దుష్టుడిని ఎప్పటికీ సజ్జనుడిగా మార్చలేం అన్నది దీని భావం. వేపచెట్టు వేళ్లనుంచి పైనున్న చిగుళ్ల వరకూ పాలు, నేతులతో తడిపినా దానికున్న చేదు పోదు. అంటే దాని సహజ గణం అది. అలాగే దుష్టుడికి ఎంత బోధపరిచినా , ఎంత చదివించినా, ఎన్ని మంచిమాటలు చెప్పినా చెవికి ఎక్కవు. అది దుష్టుడి సహజ గుణం.
Also Read: చాణక్యుడి కాలంలో సివిల్-క్రిమినల్ నేరాలకు శిక్షలేంటో తెలుసా!
అస్తర్గతములో దుష్టస్తీర్థస్నానశతైరపి
న శుద్ధయతియథాభాండ సురయా దాహితం చ తత్
మనసులో నిర్మలత్వం లేని వ్యక్తిని కూడా అస్సలు మార్చలేం అన్నది ఈ శ్లోకానికి అర్థం
కల్లుపాత్రని నిప్పుతో కడిగినా కూడా అది శుద్ధి అవదు. అలాగే మలిన మనస్సుతో ఉన్నవాడిని ఎన్ని పుణ్యక్షేత్రాలు తిప్పినా, ఎన్ని పుణ్యనదుల్లో స్నానమాచరింపచేసినా ఎలాంటి లాభం ఉండదు. మనసులో మలినం శుద్ధి అవదు. అంటే పాపపు పనులు చేసేవాడు ఎన్ని పుణ్యతీర్థాలు తిరిగొచ్చినా ఎలాంటి ఫలితం ఉండదని చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకం భావం..
గృహానక్తస్య నో విద్యా న దయా మాంసభోజనః
ద్రవ్య లబ్ధస్య నో సత్యం న స్రైణన్య పవిత్రతా
ఈ శ్లోకం భావమేంటంటే ఇంటిమీద ఎక్కువ ధ్యాస ఉన్నవాడికి చదువు అబ్బదు. మాంసం తినేవాడిలో దయాగుణం ఉండదు. డబ్బు మీద వ్యామోహం, లోభత్వం ఉండేవాడికి సత్య దూరంగా ఉంటుంది. ఆడవారి చుట్టూ తిరిగే కాముకులలో పవిత్రత ఉండదు. అంటే గుణం ఎలా ఉంటే ప్రవృత్తి అలాగే ఉంటుంది.
Also Read: ఏదుటివారు ఎలాంటి బాధలో ఉన్నా ఈ 8 మందికి పట్టదు
ఆచార్య విష్ణుగుప్తుడు (చాణక్యుడు) రచించిన చాణక్యనీతిలో ప్రతి అక్షరం జీవితంలో ప్రగతి సాధించేందుకు ఉపయోగపడుతుంది. అప్పటి కాలంలో పరిస్థితులను బట్టి చాణక్యుడు చెప్పినప్పటికీ నేటి తరానికి కూడా చాలా విషయాలు వర్తిస్తాయి. అవి అనుసరిస్తే ఉన్నత స్థానానికి చేరుకోవడం ఖాయం. ముఖ్యంగా ధర్మం, శాంతి, సంస్కృతి, జీవన విధానం, న్యాయం, సుశిక్షణ సహా పలు అంశాల గురించి శిష్యులకు బోధించాడు చాణక్యుడు. మంచి నడవడిక, బుద్ధి కుశలత, ధర్మనిష్ట, కర్మశీలత్వం, మనిషి సముచిత వికాసానికి దోహదపడే ఎన్నో అంశాల గురించి చెప్పాడు
Also Read: చాణక్యుడి కాలంలో రాజ్యంలో గూఢచారులు ఇలా ఉండేవారు - ఇప్పుడు సాధ్యమయ్యే పనేనా!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాల నుంచి, పండితుల నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఇందుకు ‘ఏబీపీ దేశం’ ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎలాంటి బాధ్యత తీసుకోదని గమనించగలరు.