Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
Gurukul Students 18 KM Walk | బీచుపల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కలెక్టర్‌ను కలిసి తమ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
Beechupally Gurukul Students | గద్వాల: తెలంగాణలో గత కొన్ని నెలలుగా ఏదోచోట ప్రభుత్వ హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్ అని వింటూనే ఉన్నాం. కొన్ని స్కూళ్లలో విద్యార్థినులకు వేధింపులు అని, వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదనో, సీలింగ్ సరిగ్గా లేక వానకు ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు విద్యార్థులు ఒకటి, రెండు కాదు ఏకంగా 18 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ సంతోష్‌ను కలిసిన విద్యార్థులు బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రిన్సిపాల్ పై కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదు
బీచుపల్లి గురుకుల పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా లేదని, స్టడీ మెటీరియల్ కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు. హాస్టల్‌లో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో చెట్లు, గుట్టల్లోకి చెంబు తీసుకుని వెళ్లాల్సి వస్తుందన్నారు. ఆ సమయంలో ఏమైనా జరిగితే, పాములు కాటేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, క్రమశిక్షణ అంటూ ప్రిన్సిపాల్ తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని 18 కిలోమీటర్ల మేర పాదయాత్రగా కలెక్టరేట్‌కు వచ్చామని తెలిపారు. 6వ తరగతిలో మిగిలిన సీట్లను సైతం ప్రిన్సిపాల్ అమ్ముకున్నారని, అందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వివరించారు.
కాళ్లకు చెప్పులు లేకుండా విద్యార్థుల నిరసన ర్యాలీ
మధ్యలో ఇటిక్యాల పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గురుకుల పాఠశాల విద్యార్థులను వారించే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గలేదు. వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించినా విద్యార్థులు ర్యాలీ ఆపలేదు. సుమారు 200 మంది వరకు విద్యార్థులు, అందులోనూ చాలా మంది కాళ్లకు చెప్పులు లేకుండా ర్యాలీగా వెళ్తుండటంతో పోలీసులు సైతం వెంట బందోబస్తుగా వెళ్లాల్సి వచ్చింది. వీరాపురం స్టేజీ వద్ద గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి విద్యార్థులను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్న వెంటనే గద్వాల్ కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. విద్యార్థుల నిరసన ర్యాలీ గురించి సమాచారం అందించారు. అయితే 18 కి.మీ మేర విద్యార్థులు పాదయాత్ర చేస్తున్నాకలెక్టర్ వారిని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు. గురుకుల పాఠశాలకు వస్తానని కలెక్టర్ హామీ ఇవ్వకపోవడం దారుణమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
18 కిలోమీటర్లు నడక దారిన నడుచుకుంటూ... జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న బీచుపల్లి గురుకులం విద్యార్థులు
— Pavan Kumar (@Pavanbrs6) December 24, 2024
• మధ్య దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా... అడ్డుకోవాలనీ చూసినా.. తమ సమస్యలను కలెక్టర్ వద్దనే విన్నవించుకుంటామని కలెక్టరేట్ చేరుకున్న విద్యార్థులు https://t.co/9eqlfak6Tb pic.twitter.com/M7gjhrHclX
ప్రిన్సిపాల్ మాత్రం తాను ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదని చెబుతున్నారు. కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీచర్ల అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. చెడు అలవాట్ల బారిన పడకుండా ఉండకుండా విద్యార్థులను హెచ్చరించాను. ఈ క్రమంలో ఓ విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కోసం కఠినంగా వ్యవహరిస్తున్నాం కానీ, వారిని ఇబ్బంది పెట్టలేదన్నారు.