Andhra Pradesh News: ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ శాఖలకు కేటాయింపు
Andhra Pradesh Funds | కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఆర్థిక సంఘం గ్రాంట్ విడుదల చేసింది. తొలి విడత బకాయిలు రూ.25 కోట్లు, రెండో విడతలో మరో రూ.421 కోట్లను ఏపీకి ఇచ్చింది.
Union Govt releases grant to Andhra Pradesh | అమరావతి: ఏపీకి 15వ ఆర్థిక సంఘం గ్రాంటును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ.446 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో వాయిదా కింద రూ.421 కోట్లతో పాటు, తొలి వాయిదా కింద పెండింగ్ లో ఉన్న రూ.25 కోట్లను సైతం కేంద్రం అందించింది. 13,097 గ్రామ పంచాయతీలకు, 650 బ్లాక్ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఈ గ్రాంట్ నిధులు కేటాయించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖలలో కూటమి ప్రభుత్వం ఈ నిధులను ఖర్చు చేయనుంది.
ఏపీకి కేంద్రం గ్రాంట్ విడుదల
ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఇతర మౌళిక వసతులపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి భారీగా నిధులు అందాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అక్టోబర్ నెలలో తొలి విడత నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ అన్‌టైడ్ గ్రాంట్స్ కింద రూ.395 కోట్లు, టైడ్‌గ్రాంట్స్ కింద రూ.593.26 కోట్లు విడుదల చేసింది. తొలి విడతలో ఏపీకి కేటాయించిన నిధులలో రూ.25 కోట్లు పెండింగ్‌లో ఉంచారు. రాష్ట్రంలోని 12,853 గ్రామపంచాయతీలకు, 615 మండల పంచాయతీలకు ఈ నిధులు ఖర్చు చేయాలి.
గ్రాంట్స్ నిధులు వేటికి ఖర్చు చేయాలంటే..
రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో పొందు పరిచిన కొన్ని అంశాల ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్స్ విడుదల చేయనుంది. వీటిలో టైడ్గ్రాంట్స్ని ఓడీఎఫ్, పారిశుద్ధ్యం, నీటి యాజమాన్యం, వాననీటి సంరక్షణ, మురికినీటి రీసైక్లింగ్, ఇళ్ల నుంచి వెలువడిన వ్యర్థాల శుద్ధికి వినియోగించాల్సి ఉంటుంది. అన్‌టైడ్ గ్రాంట్స్‌ను పారిశుద్ధ్యం, విద్య, వ్యవసాయం, గ్రామాల్లో గృహ నిర్మాణం లాంటి పనుల కోసం వినియోగించాలి. పంచాయతీల్లో స్థానిక అవసరాల కోసం ఈ నిధులు ఉపయోగించాలి. అంతేకానీ ప్రభుత్వం వీటిని ఉద్యోగుల జీతభత్యాలు, ప్రభుత్వ ఇతర ఖర్చుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ దారి మళ్లించకూడదు. తాజాగా ఇచ్చిన రెండో విడత గ్రాంట్ నిధులు పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖలకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
Also Read: Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం