New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
New Governors:వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను రాష్ట్రపతి నియమించారు. విశాఖకు చెందిన కంభంపాటి హరిబాబును మిజోరం నుంచి ఒడిశా గవర్నర్‌గా అపాయింట్ చేశారు.
New Governors: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు మిజోరం గవర్నర్‌గా విధులు నిర్వహించిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా నియమించారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్ బిజెపి నాయకుడు, ప్రస్తుతం ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ తన పదవికి రాజీనామా చేశారు. రఘుబర్ దాస్ గవర్నర్ పదవికి రాజీనామా చేయగాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన స్థానంలో హరిబాబును నియమించారు. హరిబాబు స్థానంలో మిజోరం గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి జనరల్ వీకే సింగ్‌ను నియమించారు. మణిపూర్ గవర్నర్‌గా హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నియమితులయ్యారు. బిహార్ గవర్నర్‌గా ఆరిఫ్ మహ్మద్ ఖాన్, అక్కడ ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా పంపించారు.
ఎవరీ కంభంపాటి హరిబాబు?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరి బాబు భారతీయ జనతాపార్టీకి చెందిన సీనియర్ నేత. ఇప్పటి వరకు ఆయన మిజోరాం గవర్నర్‌గా పని చేశారు. 16వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా పని చేశారు. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో కంభంపాటి హరిబాబు జన్మించారు. విశాఖపట్నంలో బీటెక్ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. అదే యూనివర్సిటీలో మాస్టర్స్‌తోపాటు పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేసి 1993లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. 6 జులై, 2021న మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇవాల్టి వరకు అక్కడే పని చేస్తున్నారు.
తెన్నేటి విశ్వనాధం, సర్దార్ గౌతు లచ్చన్న, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి హరిబాబు జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1972-73లో స్టూడెంట్స్ యూనియన్ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీకి సెక్రటరీగా బరిబాబు పని చేశారు. 1974-1975 మధ్య లోక్‌నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో లోక్ సంఘర్ష్ సమితి ఆందోళనలో యాక్టివ్‌గా పాల్గొనేవాళ్లు. ఎమర్జెన్సీ టైంలో జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
బీజేపీలో చేరిన తర్వాత 1977లో జనతా పార్టీ AP రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యునిగా పని చేశారు. 1978లో జనతా యువమోర్చా AP రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1991-1993 సమయంలో హరిబాబు భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు. 1993-2003 మధ్యకాలంలో APకి ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేశారు. 1999లో విశాఖపట్నం- I నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో బీజేపీఎల్పీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. మార్చి 2014లో BJP రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అజయ్ కుమార్ భల్లా ఎవరు?
మణిపూర్ గవర్నర్‌గా నియమితులైన కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా 1984 బ్యాచ్‌కి చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి. 22 ఆగస్టు 2019న కేంద్ర హోం సెక్రటరీగా నియమితుడయ్యారు. అజయ్ కుమార్ భల్లా ఐదేళ్ల పాటు 22 ఆగస్టు 2024 వరకు భారత హోం కార్యదర్శిగా పనిచేశారు.
ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గురించి
బీహార్ గవర్నర్ అయిన ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నవంబర్ 18, 1951 న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జన్మించారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి BA , లక్నో విశ్వవిద్యాలయం నుంచి LLB పూర్తి చేశారు. షా బానో కేసులో రాజీవ్ గాంధీ వైఖరితో మనస్తాపానికి గురైన ఖాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు ముస్లిం పర్సనల్ లా బోర్డుపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. 1980లో కాన్పూర్ నుంచి 7వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 8వ, 9వ, 12వ లోక్‌సభలో బహ్రైచ్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2019 నుంచి కేరళ గవర్నర్‌గా కొనసాగుతున్నారు.
బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్న వికె సింగ్
మిజోరం గవర్నర్‌గా పనిచేసిన వీకే సింగ్ మాజీ ఆర్మీ చీఫ్. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 42 ఏళ్లు ఆర్మీలో పని చేశారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కూడా పాల్గొన్నారు. 1987లో శ్రీలంకలో ఎల్టీటీఈకి వ్యతిరేకంగా పోరాడారు.
రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ హిమాచల్ గవర్నర్‌గా ఉన్నారు
రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ 14 ఫిబ్రవరి 2023న బిహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. చిన్నప్పటి నుంచి RSSతో అనుబంధం కలిగి ఉన్నారు. 1989లో బిజెపిలో చేరాడు. గోవాలో క్యాబినెట్ మంత్రిగా, గోవా శాసనసభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. అర్లేకర్ హిమాచల్ గవర్నర్‌గా కూడా ఉన్నారు.