Balipratipada 2023: కార్తికశుద్ధ పాడ్యమి బలిపాడ్యమి, ఈ రోజు (నవంబరు 14) ఏం చేయాలంటే!
కార్తిక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అంటారు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు గోవర్ధనపూజ చేయాలని, ఆవులను అలంకరించి స్వేచ్చగా తిరగనివ్వాలని, శక్తి కొలది దానం చేయాలని చెబుతారు.
Balipratipada 2023: ఏటా దీపావళి మర్నాడు కార్తీకమాసం ప్రారంభమవుతుంది..ఈ పాడ్యమిని బలిపాడ్యమి అంటారు. అయితే అమావాస్య తిథి తగులు-మిగులు రావడంతో ఈ ఏడాది దీపావళి నవంబరు 12న అయినప్పటికీ నవంబరు 14 సూర్యోదయానికి పాడ్యమి రావడంతో ఈ రోజునుంచే కార్తీకమాసం ప్రారంభమవుతోంది. ఈ పాడ్యమిని బలిపాడ్యమి అంటారు.
బలిరాజ నమస్తుభ్యం
విరోచనసుత ప్రభో,
భవిష్యేంద్ర సురారాతే
పూజేయం ప్రతిగృహ్యతాం
ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి
బలిచక్రవర్తి ప్లహ్లాదుని మనువడు. వైరోచనుని కుమారుడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగము చేసి దానధర్మాలు చేసి అత్యంత శక్తివంతుడై ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు. దేవతలంతా చెల్లాచెదురైపోయారు. తమను రక్షించమంటూ వెళ్లి ఆ విష్ణుమూర్తినే శరణువేడారు. అంతట విష్ణుమూర్తి తాను అదితి అనే రుషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి శ్రీ మహావిశ్ణువుకు జన్మించాడు. బలిని అణచివేసే రోజు కోసం ఎదురుచూడసాగాడు.
Also Read: అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు దేనికి సంకేతం - ‘పదునెట్టాంబడి’ విశిష్ఠత ఏంటి!
పాతాళానికి బలి
బలి ఒకసారి అశ్వమేథయాగాన్ని తలపెట్టాడని తెలుస్తుంది. బలిని అణగదొక్కేందుకు ఇదే సరైన అదనుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడి (వామనుడు) రూపంలో యాగశాల వద్దకు వెళతాడు. బలిచక్రవర్తి ఆ వామనునికి సాదర స్వాగతం పలికి, సకల మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమంటాడు. వామనుడు తనకు యాగం చేసుకోనేందుకు మూడు అడుగుల నేల కావాలని కోరతాడు. అందుకు బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానం అడుగుతున్నవాడు...వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీమహావిష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు గ్రహిస్తాడు. అదే విషయం బలిని పిలిచి చెబుతాడు. కానీ అప్పటికే మాటిచ్చేశానని..ధన ప్రాణాలపై ఉన్న వ్యామోహంతో మాట వెనక్కు తీసుకోలేను అంటాడు. ఆగ్రహించిన శుక్రాచార్యుడు రాజ్యభ్రష్టుడవు అవుతావని బలిని శపించి వెళ్ళిపోతాడు.
Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!
శుక్రాచార్యుడు కన్ను పోయింది ఈ సందర్భంగానే
ఆ తర్వాత బలి చక్రవర్తి వామనుని పాదాలు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకుంటాడు. వామనుడు కోరిక మేరకు మూడు అడుగులు దానమిస్తున్నానని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదగా వామనుని చేతిలోకి నీళ్ళు పోస్తుంటాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భ పుల్లతో రంధ్రాన్ని పొడవగా శుక్రాచార్యుడు తన రెండు కళ్ళల్లో ఒక కన్నును కోల్పోతాడు. దానం స్వీకరించిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంత ఆక్రమించేస్తాడు. ఓ అడుగు భూమ్మీద, మరో అడుగు ఆకాశం మీద వేసి మూడో అడుగు ఎక్కడ వేయాలని అడుగుతాడు. అప్పుడు బలి ‘నా తలపై వేయి’అని తలొంచుతాడు. వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి అధ:పాతాళానికి తొక్కేస్తాడు.
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
ఏటా రాజ్యాన్ని చూసుకునేందుకు వచ్చే బలిచక్రవర్తి
అప్పుడు బలిచక్రవర్తి "దేవా! నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నాకోసం కోరడానికి ఏమి లేదు. లోకం కోసం ఓ వరం అర్ధిస్తున్నాను. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు. కనుక నీ మూడు అడుగులకు సంకేతంగా - ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ద పాడ్యమి 3 రోజులు - భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానం, దీప పూజ చేసే ఇంట్లో లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి" అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తథాస్తు అని వరమిచ్చాడు. అలా ప్రతి ఇంటిముందు దీపాలు, సంబరాలు, సంతోషం చూసి తన రాజ్యంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని భావించి మళ్లీ బలిచక్రవర్తి పాతాళానికి వెళ్లిపోతాడు. అలా ఇది బలిపాడ్యమి అయింది. బలిపాడ్యమి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం శుభప్రదం.
Also Read: కార్తీకమాసం వచ్చేస్తోంది - నెలంతా తలకు స్నానం చేయకపోతే ఏమవుతుంది!
వామనుడు కోరిన మూడు అడుగులు సత్వరజోతమోగుణాలనీ, సృష్టిస్థితిలయలనీ సూచిస్తాయని అంటారు. ఇక బలి తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచివేయడమే. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన దీపాలు వెలిగిస్తూ దీపావళికి స్వాగతం పలికిన వెంటనే..అహంకారాన్ని వదిలేస్తూ బలిపాడ్యమి జరుపుకోవాలని చెబుతారు పండితులు.