Sydney Test Live Updates: ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
ఐదో టెస్టులో భారత్ కు స్వల్ప 4 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ 181 పరుగులకు ఆలౌటైంది. డెబ్యూ క్రికెటర్ వెబ్ స్టర్ అర్థ సెంచరీ సాధించాడు.
Australia Allout: సిడ్నీ టెస్టులో భారత్ సత్తా చాటింది. తొలి టెస్టు తర్వాత మళ్లీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. శనివారం ఐదో టెస్టు రెండోరోజు ఆతిథ్య కంగారూలను తక్కువ స్కోరుకే పరిమితం చేసి, కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకుంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 9/1తో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ 51 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. తొలి టెస్టు ఆడుతున్న బ్యూ వెబ్ స్టర్ (105 బంతుల్లో 57, 5 ఫోర్లు) కీలకమైన అర్థ సెంచరీతో రాణించాడు. బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లతో రాణించాడు. జస్ప్రీత్ బుమ్రా, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి లకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఆరంభంలోనే వికెట్లు టపాటపా..
రెండోరోజు ఆట ప్రారంభంలోనే మార్నస్ లబుషేన్ (2) వికెట్ తీసిన బుమ్రా భారత్ కు శుభారంభాన్ని అందించాడు. బుమ్రా వేసిన బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడగా, అంపైర్ ఔటివ్వలేదు. దీంతో రివ్యూ తీసుకుని సానుకూల ఫలితాన్ని బుమ్రా సాధించాడు. ఆ తర్వాత కాసేపు ఓపెనర్ శామ్ కొన్ స్టాస్ (23), స్టీవ్ స్మిత్ (33) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే మరో ఐదు ఓవర్ల తర్వాత భారత్ కు సిరాజ్ మియా బ్రేక్ త్రూను అందించాడు. ఒకే ఓవర్లో కొన్ స్టాస్, హెడ్ లను ఔట్ చేసి ఆసీస్ కు షాకిచ్చాడు. కొన్ స్టాస్ ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ (4) ను కూడా ఔట్ చేశాడు. ఈదశలో క్రీజులోకి వచ్చిన వెబ్ స్టర్ ఓపికగా ఆడాడు. స్మిత్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లంచ్ విరామం దాకా కొనసాగిన ఈ జంటను ప్రసిద్ధ్ విడదీశాడు. చక్కని బంతితో స్మిత్ ను పెవిలియన్ కు పంపాడు.
వెబ్ స్టర్ ఒంటరి పోరు..
ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా, వెబ్ స్టర్ ఒంటరిగా పోరాటం చేశాడు. అలా బ్యాటింగ్ చేస్తూ 5 ఫోర్ల సాయంతో 92 బంతుల్లో అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (21)తో ఉపయుక్త భాగస్వామ్యం నెలకొల్పాడు. కేరీ అవుటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్ కోలుకోలేక పోయింది. చివరికి తొమ్మిదో వికెట్ రూపంలో వెబ్ స్టర్ కూడా ఔట్ కావడంతో త్వరగానే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఐదో టెస్టులో భారత్ గెలిస్తేనే, బోర్డర్ -గావస్కర్ ట్రోపీని తిరిగి రిటైన్ చేసుకునే అవకాశం జట్టుకు ఉంటుంది. అలాగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలబడుతుంది. ఇక ఈ సిరీస్ లో 2-1తో ఆసీస్ ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టును భారత్ గెలవగా, రెండు, నాలుగో టెస్టులను ఆసీస్ గెలుచుకుంది. మూడో టెస్టు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడం వల్ల డ్రాగా ముగిసింది.
Also Read: Jasprit Bumrah: జస్ప్రిత్ బుమ్రా ఖాతాలో అరుదైన ఘనత, 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్టార్ పేసర్