YSRCP Tickts : వైఎస్ఆర్‌సీపీలో సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు - అప్రమత్తత కోసమే జగన్ హెచ్చరిస్తున్నారా ?
వైఎస్ఆర్‌సీపీలో సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్పు సంకేతాలు దాదాపుగా లేవని చెబుతున్నారు.
YSRCP Tickts : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కనీసం 35-40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరిస్తారని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 151 సీట్లు గెలుచుకుంది. అంతేకాకుండా మరో ఐదుగురు ఇతర పార్టీల నుండి ఫిరాయించారు. నలుగురు తెలుగుదేశం పార్టీ నుండి, ఒకరు జనసేన పార్టీ నుండి వైసీపీలో చేరారు. అయితే నలుగురు ఆ పార్టీకి దూరమయ్యారు. అందుకే మొత్తంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 35-40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఉండవని చెబుతున్నారు. కానీ అలాంటి పరిస్థితులు లేవని .. కేసీఆర్ తరహాలో తప్పదు అనుకున్న వారినే మారుస్తారని .. అలాంటి వారు.. పది, పదిహేను మంది మాత్రమే ఉంటారని భావిస్తున్నారు.
పార్టీ నేతల అవసరాల కోసం చేసే మార్పు చేర్పులే ఎక్కువ
151 మంది వైఎస్‌ఆర్‌సి ఎమ్మెల్యేలలో నలుగురు ఇప్పటికే టీడీపీలోకి ఫిరాయించారు. వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి, అద్దంకి, కుప్పం, మండపేట, విజయవాడ (తూర్పు), రాజమండ్రి (అర్బన్) నియోజకవర్గాలకు జగన్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. వంగా గీత, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చింతా అనురాధ, మార్గాని భరత్, ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి కొంతమంది ఎంపీలకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. కాబట్టి, ఈ ఎంపీలకు స్థానం కల్పించేందుకు ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను వదులుకోవాల్సి వచ్చింది. అదే విధంగా తన పార్టీ ఎమ్మెల్యేలలో కొందరిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపాలని అనుకుంటున్నారు. వారిలో బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాద రావు, ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్‌లు ఉన్నారు. అదే జరిగితే ఈ నియోజకవర్గాల్లో తాజా ముఖాలకు జగన్ పార్టీ టిక్కెట్లు ఇవ్వనున్నారు. అంటే వీరిలో ఎవరికీ టిక్కెట్లు నిరాకరిచినట్లుగా కాదు.
మరికొంత మంది వారసులకు టిక్కెట్లు
పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటి మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా పోటీ నుంచి తప్పుకోవాలని, తమ కుమారులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని జగన్ కోరుతున్నారు. నలుగురు టీడీపీ శాసనసభ్యులు చీరాల నుండి కరణం బలరామ కృష్ణ మూర్తి, గన్నవరం నుండి వల్లభనేని వంశీ, గుంటూరు (పశ్చిమ) నుండి మద్దాలి గిరిధర్, విశాఖపట్నం సౌత్ నుండి వాసుపల్లి గణేష్, జనసేన పార్టీ శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్. ఈ ఫిరాయింపుదారులకు పార్టీ టిక్కెట్లు ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చారు. కరణం తన కుమారుడికి పార్టీ టిక్కెట్‌ను కోరుకుంటున్నారు. మిగిలిన నలుగురు వైఎస్‌ఆర్‌సి టిక్కెట్‌పై ఎన్నికలలో పోటీ చేయనున్నారు. అంటే వారసులకు టిక్కెట్లు పొందుతున్నారు కాబట్టి వారు కూడా టిక్కెట్ల విషయంలో నిరాశకు గురయినట్లు కాదు.
పది నుంచి పదిహేను మందికి మాత్రమే పనితీరు ఆధారంగా టిక్కెట్లు నిరాకరించే అవకాశం
వైసీపీ పార్టీ, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) యొక్క అంతర్గత సర్వేల ప్రకారం.. వారి పనితీరు అంచనాల కంటే చాలా తక్కువగా ఉన్న వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని చెబుతున్నారు. ఇలాంటి వారు గట్టిగా పదిహేను మంది కూడా లేరని చెబుతున్నారు. వారికి మాత్రమే టిక్కెట్లు నిరాకరిస్తారని.. కేవలం అప్రమత్తంగా ఉండటం కోసమే.. జగన్ ప్రతీ సారి హెచ్చరికలు జారీ చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ కూడా అదే వ్యూహం పాటించారని జగన్ కూడా అదే ఫాలో అవుతున్నారని అంటున్నారు. 90 శాతం సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఉంటాయని వైసీపీలోని ఉన్నత వర్గాలు కూడా చెప్పకనే చెబుతున్నాయి.