CM Jagan : సాఫ్ట్ స్పోకెన్ సీఎం జగన్ - మారిపోయారా ? మారిపోవాల్సి వచ్చిందా ?
ఎమ్మెల్యేలపై జగన్ ప్రత్యేకమైన అభిమానంఎవరినీ వదులుకోనని ప్రకటనలునిన్నటిదాకా చేసిన హెచ్చరికలు ఇవాళ ఎందుకు లేవు ?పార్టీలో పరిస్థితుల్ని జగన్ అర్థం చేసుకున్నారా ?
CM Jagan : " ఎమ్మెల్యేల్లో విశ్వాసం పెంచేలాగా సీఎం జగన్ మాట్లాడారు, ఇటీవలి కాలంలో లేని విధంగా ఆత్మీయంగా పలకరించారు " అని గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ముగిసిన తర్వాత కొంత మంది వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మీడియాకు చెప్పారు. వారి మాటల్లో జగన్ లో స్పష్టమైన మార్పు కనిపించిందన్న అభిప్రాయం నేరుగానే కనిపిస్తోంది. అయితే ఆ మార్పు స్వతహాగా రాలేదని తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. గడప గడపకూ కార్యక్రమంపై సమీక్ష జరగడానికి ఒక్క రోజు ముందు వరకూ జగన్ ... గ్రాఫ్ పడిపోయిన ఎమ్మెల్యేల సంగతి తేల్చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. మంత్రివర్గాన్ని మార్చేస్తున్నారని చెప్పుకున్నారు. కానీ ఒక్క రోజు ముందు సీన్ మారిపోయింది. పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి అలాంటివేమీ ఉండవని.. ఇది రొటీన్‌గా జరిగే సమావేశం మాత్రమే అనిచెప్పడం కాదు.. మంత్రి వర్గ మార్పు చేర్పులు ఉండవని కూడా ప్రకటించారు. పై స్థాయి నుంచి అలా చెప్పారని ఆయనకు సూచనలు రాకపోతే.. మీడియా ముందు అలా చెప్పే ధైర్యం పేర్ని నాని చేయరు. ఆయనకు కూడా ఎందుకింత హఠాత్తుగా మార్పు అనే సందేహం వచ్చే ఉంటుంది.
ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న ఆందోళనతో కాస్త తగ్గారా ?
సీఎం జగన్ కనీసం యాభై మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్ట్రెయిట్ ఫార్వాడ్ గా ఉన్నారు. తన వెంట ఎంత కాలం నుంచి ఉన్నారు.. పార్టీకి ఎంత విధేయులు అన్నది తాను పట్టించుకోనని.. గెలుపు గుర్రాలు అనుకుంటేనే టిక్కెట్లు ఇస్తానని చెబుతున్నారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న రోజున తనను కలిసిన ఎమ్మెల్యేలతోనూ అదే చెప్పారని అంటున్నారు. అంత స్ట్రెయిట్ గా ఉన్న సీఎం జగన్ ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షలో మాత్రం పూర్తిగా రివర్స్‌లో వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఎమ్మెల్యేను.. ఒక్క కార్యకర్తను కూడా వదులుకోనని అందర్నీ గెలిపించుకుంటానని చెప్పారు. టిక్కెట్లు రావేమోనని ఆందోళన చెందుతున్న వారికి భరోసా ఇచ్చారు. తాను ఎలాంటి లిస్ట్ ప్రిపేర్ చేయలేదని.. సోషల్ మీడియాలో జరుగుతోందన్న దుష్ప్రచారం అని చెప్పారు. సీరియస్‌గా తీసుకుని ఆగస్టు వరకూ గడపగడపకూ నిర్వహించాలని సూచించారు.
గతంలో గ్రాఫ్ తగ్గినవారి పేర్లు ప్రస్తావించేవారు - ఈ సరి అది లేదు!
గతంలో గడప గడపకూ కార్యక్రమంపై సమీక్ష ఎప్పుడు జరిగినా గ్రాఫ్ తగ్గిన వారి పేర్లు నేరుగానే ప్రకటించే వారు. వారిని అక్కడే నిలదీసేవారు. ఈ కారణంగానే ఈ సారి కొంత మంది సీనియర్ నేతలు కూడా డుమ్మా కొట్టారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఈ సారి ఆయన గ్రాఫ్‌లు బయట పెట్టి నేరుగా కించపర్చడం.. నిలదీయడం వంటివి చేయలేదు. పైగా చాలా సాఫ్ట్ గా మాట్లారు. సీఎం జగన్‌లో వచ్చిన ఈ మార్పునకు కారణం ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న ఆందోళన కారణమని భావిస్తున్నారు. గతంలోలా జగన్ ఏది చెబితే అదే రైట్ అనే పరిస్థితి మారడంతో .. పార్టీ అధినేతగా ఆలోచించి ఆయన రియలైజ్ అయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మంత్రివర్గ విస్తరణ కూడా లేనట్లే !?
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేబినెట్ మార్పులు చేయడం కూడా అంత మంచిది కాదన్న నిర్ణయానికి జగన్ వచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తాము పదేళ్లుగా ఎన్నో అష్టకష్టాలు పడి జగన్ వెంట నడిస్తే అధికారంలోకి వచ్చాక ఎలాంటి ప్రయోజనం లేకపోగా… ప్రత్యర్థులకు .. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి మెజార్టీ ఎమ్మెల్యేల్లో ఉందంటున్నారు. డాది కిందట వరకూ సీఎం జగన్ ఏది చెబితే అది శాసనం. కానీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేసిన తర్వాత సీన్ మారిపోయింది. ఆయన పై ఎమ్మెల్యేలు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాటలను కూడా వినిపించుకోలేదు. ఎమ్మెల్యేలపై సీఎం జగన్‌కు పూర్తి స్థాయి పట్టు ఉందని అనుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీని ధిక్కరించి ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయడం అంటే చిన్న విషయం కాదు. అదీ కూడా ఏడాదిపైగా అధికారం ఉన్న సమయంలో. అధికార పార్టీకి విపక్ష సభ్యులు మద్దతిస్తే అందులో ఓ లాజిక్ ఉంటుంది . కానీ పార్టీపై పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు ఉన్నట్లుగా భావిస్తున్న జగన్ పార్టీలో ఇలా జరగడం మాత్రం ఆశ్చర్యమే కాదు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం జరగడమూ ఇబ్బందికరమే. వీరిలో పార్టీలో …ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇలాంటి వారిని కంట్రోల్ చేయడం కష్టమే. ప్రస్తుతం పదవుల్ని కోల్పోయే మంత్రులు కూడా అసహనానికి గురవుతారు. తమను పనికి రాని వాళ్లుగా తేల్చి తీసేస్తున్నారని వారు ఫీలయితే మొదటికే మోసం వస్తుంది. అందుకే సీఎం జగన్ కసరత్తు చేసి కూడా వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు.
మొత్తంగా సీఎం జగన్... ఎప్పట్లా స్ట్రాంగ్‌గా తాను అనుకున్న విధంగా వ్యవహరించలేకపోయారు. ఎమ్మెల్యేల ముందు కాస్త తగ్గి వ్యవహరించాల్సి వచ్చింది. దీన్ని అసంతృప్త ఎమ్మెల్యేలు అడ్వాంటేజ్‌గా తీసుకుంటే మాత్రం వైసీపీలో మరో రకమైన రాజకీయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.