Mudragada Padmanabham: 'మేము అనాథలం బూతులు తిట్టించే బదులు అందర్నీ చంపేయండి' - వైసీపీ నేత ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
Andhrapradesh News: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మేము అనాథలం. జనసైనికులు బూతులు తిడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మా కుటుంబం అందర్నీ చంపేయండి.' అని అన్నారు.
Mudragada Padmanabham Sensational Comments: జనసైనికులు తనపై బూతులతో దాడులు చేస్తున్నారంటూ.. ఇది మంచి పద్ధతి కాదని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి (Mudragada Padmanabhareddy) అన్నారు. శుక్రవారం ఆయన కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 'మేము అనాథలం.. మమ్మల్ని బూతులు తిట్టించే బదులు.. మా కుటుంబంలో ఏడుగురం ఉన్నాం. అందరినీ చంపించేయండి.' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసైనికులు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచిది కాదని.. రాజకీయాల్లో ఇలాంటి దాడులు చేయడం తన పొలిటికల్ కెరీర్‌లో ఎన్నడూ చూడలేదని చెప్పారు.
'సవాల్‌కు కట్టుబడి పేరు మార్చుకున్నా'
'ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు.. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజా సేవ చేయాలి. ఎన్నికల్లో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటా అని సవాల్ చేశాను. దానికి కట్టుబడి నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాను. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చాలని కోరాను. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. వైసీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. వాటిని వెంటనే ఆపాలి. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కల్యాణ్ కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడల్లో నడుస్తున్నాయి. కాపులకు న్యాయం చేయండి. రిజర్వేషన్ సాధించండి.' అని ముద్రగడ పేర్కొన్నారు.