What is YSRCP Plan : రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ప్లానేమిటి ? ఓటింగ్ బలంతో రాష్ట్రానికేం సాధించబోతున్నారు ?
రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కీలకంగా మారింది. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ బలాన్ని సీఎం జగన్ వినియోగించుకుంటారా ?
What is YSRCP Plan : " ప్రధానమంత్రిగా ఎల్లయ్య ఉండనీ..పుల్లయ్య ఉండనీ మనకు కావాల్సిన ప్రత్యేకహోదా ఇస్తామని రాసి ఇస్తేనే మద్దతు ఇస్తాం " అని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత కేంద్రంలో పార్టీకి మన మద్దతు అవసరం లేదు కాబట్టి ప్రత్యేకహోదాను ఇచ్చే వరకూ " ప్లీజ్..ప్లీజ్ " అని అడుగుతామని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి అదృష్టం బాగుంది. ఇప్పుడు సీన్ మారిపోయింది. వైఎస్ఆర్‌సీపీ బలం ఇప్పుడు బీజేపీకి అత్యవసరం అయింది. ఆ బలాన్ని ఉపయోగించి జగన్ రాష్ట్రానికి ఏం సాధించబోతున్నారు ?
వైఎస్ఎస్‌సీపీ మద్దతిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో గట్టెక్కనున్న ఎన్డీఏ అభ్యర్థి
రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పాత్ర కీలకంగా మరింది. రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో 151 మంది వైఎస్సార్‌సీపీ కాగా.. 23 మంది టీడీపీ, ఒకరు జనసేనపార్టీ. మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 22.. ముగ్గురు టీడీపీ ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ విషయానికి వస్తే.. వైస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎక్కువ ఓట్లు వేసేది వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే. పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు 22 మంది, రాజ్యసభలో మరో 9 మంది ఎంపీలకు కలిపి మొత్తం ఓటు విలువ 21,948 అవుతోంది. అలాగే 151 మంది ఎమ్మెల్యేలకు 24,009 ఓటు విలువ ఉంది. అంటే రాష్ట్రం నుంచి ఉన్న మొత్తం 53,313 ఓటు విలువ ఉంటే.. వైఎస్సార్‌సీపీకి 45,957 బలం ఉంది. ఎన్డీఏ నిలబెట్టబోయే అభ్యర్థికి ఈ వైఎస్ఆర్‌సీపీ ఓట్లే కీలకం. ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి గెలవాలంటే ఇంకా 20వేల ఓట్లు అవసరం. జెడియు యు టర్న్ తీసుకుంటే ఎన్‌డిఎ అభ్యర్థి విజయం మరింత కష్టం అవుతుంది. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్‌కు దాదాపు 45,885 విలువైన ఓట్లు వుండటంతో బిజెపికి జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు కచ్చితంగా అవసరం అవుతుంది.
తామే కీలకం అని అంగీకరిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు !
రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీనే కీలకమని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, విప్ మార్గాని భరత్ ఇదే మాట చెబుతున్నారు. తాము ఎవరికి మద్దతిస్తే వారు గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్‌సీపీ ఏం చేయబోతోందనేది ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రత్యేకహోదా ఇస్తామంటేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతనే షరతు పెడతారా ?
పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు కేంద్రానికి మన అవసరం లేదని అందుకే ప్రత్యేకహోదా రావడం లేదని.. అంత మాత్రాన అడగకూడదని ఎక్కడా లేదని ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఆ చాన్స్ వచ్చిందనేది కళ్లముందు కనిపిస్తున్న విషయం. ఇప్పటి వరకూ కేంద్రానికి.. కేంద్రం బిల్లలకు వైఎస్ఆర్‌సీపీ ఎన్నో సార్లు మద్దతిచ్చింది. వ్యవసాయ బిల్లులకు, సీఏఏ – ఎన్నార్సీ బిల్లలకూ మద్దతిచ్చింది. చెప్పాలని చూస్తే ఏ ఒక్క దాన్నీ వ్యతిరేకించలేదు. అయితే అప్పట్లో ఎలాంటి షరతులు పెట్టలేదు. అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ మద్దతు ఇవ్వకపోయినా ఎన్డీఏ ఏదో విధంగా విజయం సాధించేది. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో అాలంటి పరిస్థితి లేదు. అందుకే ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రత్యేకహోదా ఇస్తానంటేనే మద్దతు ఇస్తామనే షరతును జగన్ ...బీజేపీ ముందు పెడతారనే అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
రాష్ట్రానికి ఏ ప్రయోజనం పొందకుండా మద్దతిస్తే ప్రజలను వంచించారన్న విమర్శలు !
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక ఇది మూడో రాష్ట్రపతి ఎన్నిక. మొదటిసారి 2012లో కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలో వున్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంది. అప్పుడే కాంగ్రెస్‌పార్టీతో విభేదించి కొత్తగా పార్టీ పెట్టారు. అయినప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ కారణమో.. మరొకటో కానీ.. ఆ ఎన్నికల్లో యుపిఎ బలపరిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు. 2014లో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ బలపరిచిన బిజెపికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతును ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తారని భావిస్తున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఏఏ అంశాల మీద మద్దతు ఇస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి సంబందించి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి అంశాన్ని, పోలవరానికి నిధుల కేటాయింపును పూర్తిగా అటకెక్కించింది. రైల్వే జోన్ అదిగో ఇదిగో అనడం తప్ప ఆచరణలో సాకారం కాని పరిస్థితి వుంది. ఈ డిమాండ్ ను మద్దతివ్వడానికి కేంద్రం ముందు పెట్టకుండా భేషరతుగా మద్దతిస్తే ఏపీ ప్రయోజనాలను రాజకీయ ప్రయోజనాల కోసం కాలసినట్లేనన్న విమర్శలను వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు.