AP Cabinet : కొత్త కేబినెట్ సీఎం జగన్‌ను మెప్పించలేకపోతోందా ? నవంబర్‌లో ముగ్గురికి ఉద్వాసన తప్పదా ?
సీఎం జగన్ మంత్రులపై ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఆగ్రహం వ్యక్తం చేస్తే గురువారం ముగ్గురు మంత్రులను తొలగించబోతున్నట్లుగా సమాచారం ఎలా బయటకు వచ్చింది ?
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సహచరులపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవులు తీసుకున్నారు కానీ ప్రతిపక్ష పార్టీకి సరైన విధంగా కౌంటర్ ఇవ్వడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే ఇద్దరు ముగ్గురు మంత్రుల్ని తొలగించేస్తానని కూడా హెచ్చరించారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే ఏర్పాటు చేసిన కేబినెట్‌పై జగన్‌కు ఇంత త్వరగా ఎందుకు అసంతృప్తి ఏర్పడింది ? మంత్రులు నిజంగానే విపక్షానికి కౌంటర్ ఇవ్వడం లేదా ? ముగ్గురు మంత్రుల్ని టార్గెట్ చేసుకుని వ్యూహాత్మకంగా అసంతృప్తి వ్యక్తం చేశారా ?
బుధవారం మంత్రులపై అసంతృప్తి - గురువారం ముగ్గురు మంత్రుల మార్పు ప్రచారం !
ఏపీలో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన చెప్పబోతున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. కేబినెట్ సమావేశంలో జగన్ తన కుటుంబంపై టీడీపీ ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని .. ఇలా అయితే ఇద్దరు, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తానని హెచ్చరించారు. ఆ మాటలు అన్న తర్వాతి రోజే ముగ్గురు మంత్రులకు ఉద్వాసన ఖాయమని ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు ఎవరో కూడా ఖరారయిందని వారిలో ఒకరు మహిళా మంత్రి అని చెబుతున్నారు. నవంబర్‌లోనే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురలో ఇద్దరు ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన వారు కాగా మరొకరు రాయలసీమకు చెందిన వారని చెబుతున్నారు.
సీఎంను మంత్రులు ఎందుకు మెప్పించలేకపోతున్నారు ?
అయితే వైఎస్ఆర్‌సీపీ మంత్రులు మాత్రం తాము రెగ్యులర్‌గా విపక్షాలకు కౌంటర్ ఇస్తున్నామని చెబుతున్నారు. మంత్రి రోజా దాదాపుగా ప్రతీ రోజూ టీడీపీ నేతలపై ఘాటుగా విమర్శలు చేస్తూంటారు. అయితే ఆమె ఇటీవలి కాలంలో విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆస్ట్రేలియాలోపర్యటన ముగించుకుని నేరుగా కేబినెట్ మీటింగ్ కోసం తాడేపల్లి వచ్చారు. ఈ కారణంగా టీడీపీ నేతలు చేసిన లిక్కర్ స్కాం ఆరోపణలపై స్పందించలేదని తెలుస్తోంది. మరో మహిళా మంత్రి వనిత కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై ప్రధానంగా స్పందించాల్సిన ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి కూడా స్పందంచకపోవడం సీఎం జగన్‌ను అసంతృప్తికి గురి చేసినట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నయి. అయితే వైఎస్ఆర్‌సీపీలో ఓ సంప్రదాయం ఉంది. మీడియాతో మాట్లాడమని పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేకమైన సందేశం వస్తే తప్ప మాట్లాడరు. పార్టీ విధానాల గురించి అక్కడి నుంచే సమాచారం వస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా సూచనలు వస్తాయి. సొంతంగా మాట్లాడితే.. వివాదాలు వస్తాయేమోనని ఎక్కువ మంది ఇబ్బంది పడుతూంటారు. అది కూడా మంత్రులకు ఇబ్బందికరంగానే మారింది.
ఏప్రిల్‌లోనే మంత్రులని మార్చిన సీఎం జగన్ !
జగన్ గత ఏప్రిల్‌లోనే కేబినెట్ మంత్రులందరితో రాజీనామాలు తీసుకుని కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. అయితే అందులో పదకొండు మంది పాతవారికే అవకాశం కల్పించారు. అవకాశం లభించని వాళ్లని పేర్ని నాని, కొడాలి నాని లాంటి నోరున్న నేతలున్నారు. తర్వాత వైరు సైలెంటయ్యారు. వారు మాట్లాడినా ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం లభించడం లేదు. ఎందుకంటే మాజీలయ్యారు కాబట్టి మీడియా కూడా పట్టించుకోవడం లేదు. వారి ప్లేస్‌లో వమంత్రి పదవులు చేపట్టిన వారు సైలెంట్‌గా ఉంటున్నారు. మంత్రుల్లో గట్టి వాయిస్ ఉన్న వారు లేరు. రోజా ఉన్నప్పటికీ.. ఆమె విమర్శల ద్వారా ప్లస్ కన్నా మైనస్సే ఎక్కువ అన్న భావన ఉంది. ఇతర మంత్రులు నోరు తెరవడం లేదు. దీంతో జగన్ అసహనానికి గురువుతున్నారు.
ముగ్గురు మంత్రులను తొలగించాలనే ఇలా ముందస్తు వ్యూహం ప్రకారం అసంతృప్తి వ్యక్తం చేశారా?
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. అన్ని రకాల సామాజిక సమీకరణాలు చూసుకున్నారు. అయితే పనితీరు విషయం వచ్చే సరికి తేడా రావడంతో ముగ్గుర్ని మార్చాలనుకుంటున్నారు. అందుకే జగన్ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.