Nithin To Meet JP Nadda : ఈ సారి నితిన్ వంతు - నోవాటెల్‌లో జేపీ నడ్డాతో భేటీకి ఆహ్వానం !
శనివారం జేపీ నడ్డాతో భేటీ కానున్నారు టాలీవుడ్ హీరో నితిన్. భేటీకి టాలీవుడ్ నుంచి మరికొందరికి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది.
Nithin To Meet JP Nadda : టాలీవుడ్ హీరోలతో భేటీకి బీజేపీ అగ్రనేతలు ఆసక్తి చూపిస్తున్నారు. గత వారం మునుగోడు సభలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా .. జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభ హన్మకొండలో జరగనుంది. ఈ సభకు హాజరయ్యేందుకు శనివారం వస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా... టాలీవుడ్ హీరో నితిన్‌తో భేటీ కావాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆయనకు సమాచారం అందించడం.. నితిన్ అంగీకరించడం జరిగిపోయాయి. ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ జరిగిన నోవాటెల్‌లోనే నితిన్‌తో నడ్డా భేటీ అయ్యే అవకాశం ఉంది.
టాలీవుడ్ హీరోలతో బీజేపీ పెద్దల వరుస భేటీలు
బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగానే టాలీవుడ్ హీరోలతో భేటీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాలో తెలంగాణ గిరిజనులకు ఆరాధ్య దైవమైన కొమురం భీం పాత్ర పోషించి మెప్పించారు. నితిన్.. తెలంగాణ నుంచి టాలీవుడ్‌లో నిలదొక్కుకున్న హీరో. నితిన్‌తో భేటీ అవడం ద్వారా.. ఆయన బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారన్న ఓ అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క నితిన్ మాత్రమే కాదని.. టాలీవుడ్‌కు చెందిన కొంత మంది ప్రముఖ రచయితలు... నటులతోనూ నడ్డా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇటీవల టాలీవుడ్ నుంచి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం రావడంతో ఆయన ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ నటులను బీజేపీలో చేర్చుకునే అవకాశం
టాలీవుడ్ నుంచి ఇప్పటికే కొంత మంది బీజేపీలో చేరారు. జీవిత రాజశేఖర్ బండి సంజయ్ పాదయాత్రలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ పాలనపై ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ముందు ముందు మరికొంత మంది టాలీవుడ్ ప్రముఖుల్ని కూడా బీజేపీలో చేర్చే అవకాశం ఉంది. మంచు మోహన్ బాబు గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కుటుంబ సమేతంగా భేటీ అయ్యారు. ఆ సమయంలో పార్టీలోకి ఆహ్వానించారని.. తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మోదీ చెప్పారని పలు ఇంటర్యూల్లో మోహన్ బాబు చెప్పారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తే బీజేపీలోకేనని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనను కూడా బీజేపీ నేతలు ఆహ్వానించే అవకాశం ఉంది.
సినిమా నటులకు ఉండే ఆకర్షణపై బీజేపీకి ప్రత్యేకమైన గురి
సినిమా తారలకు దక్షిణాదిన ఉండే క్రేజ్.. ఆకర్షణ.. బీజేపీ నేతలకు బాగా తెలుసు. ఒక్క దక్షిణాదినే కాకుండా ఉత్తరాది సినీ ప్రముఖుల్ని కూడా ఆకట్టుకునేందుకు బీజేపీ కొంత కాలంగా ప్రయత్నిస్తూ వస్తోంది. గతంలో సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో అమిత్ షా నిర్వహించిన యాత్రలో సినీ ప్రముఖుల్నే ఎక్కువగా కలిశారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టాలీవుడ్ నటులను ఆకట్టుకుంటున్నారు. వారు నేరుగా మద్దతు ప్రకటించకపోయినా... భేటీ అయితే చాలు.. ఆ పాజిటివ్ నెస్ వారి అభిమానుల్లో కనిపిస్తుందని భావిస్తున్నారు.