TDP Joinings: టీడీపీలోకి ఒకేరోజు ముగ్గురు కీలక నేతలు - చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న వసంత, వేమిరెడ్డి, కృష్ణదేవరాయలు
YCP leaders Joining TDP: వైసీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ఒకేరోజు టీడీపీలో చేరుతున్నారు. చంద్రబాబు సమక్షంలో వసంతకృష్ణప్రసాద్, లావు శ్రీకృష్ణదేవరాయులు, వేమిరెడ్డి ప్రభాకర్ పార్టీలో చేరనున్నారు.
TDP Joinings: తెలుగుదేశం(Telugudesam) పార్టీ ఒక్కసారిగా గేరుమార్చింది. రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికార పీఠం దక్కించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే వందమంది కూటమి సభ్యులను ప్రకటించి అధికార పార్టీకి సవాల్ విసిరిన చంద్రబాబు(Chandra Babu)... శనివారం ఒక్కరోజే వైసీపీ(YCP)కి చెందిన ముగ్గురు కీలక నేతలను పార్టీలో చేర్చుకోనున్నారు. వీరిలో ఇద్దరు ఎంపీలు కాగా... మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే. మరికొందరు కీలక నేతలు సైతం సైకిల్ ఎక్కే అవకాశం ఉంది
తెలుగుదేశంలోకి వసంత
ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) శనివారం తెలుగుదేశం(Telugudesam) తీర్థం పుచ్చుకోనున్నారు. హైదరాబాద్(Hyderabad) లోని చంద్రబాబు నివాసంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనకు మైలవరం(Mylavaram) సిట్టింగ్ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ పాలనపైనా, జగన్(Jagan) తీరుపైనా కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. ఆయన తెలుగుదేశంలో చేరనున్నారని ముందే పసిగట్టిన సీఎం జగన్.. అక్కడ ఇంఛార్జీగా కొత్త అభ్యర్థిని నిలబెట్టారు. వసంత కృష్ణప్రసాద్ చేరికతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పెరగనుంది. అయితే మైలవరం తెలుగుదేశం ఇంఛార్జీగా పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) ఉన్నారు. వసంత చేరికతో ఆయన సీటుకు ఇబ్బంది ఏర్పడింది. అయితే దేవినేని ఉమను పెనమలూరు నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నెల్లూరులో వేమిరెడ్డి, గురజాలలో లావు
వైసీపీకి చెందిన ఇద్దరు కీలక ఎంపీలు సైతం శనివారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నెల్లూరు జిల్లా కనుపర్తిపాడులో జరిగే మీటింగ్ లో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో నెల్లూరు జిల్లా కనుపర్తిపాడు చేరుకోనున్న చంద్రబాబు(Chandra Babu)...అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అక్కడే వైసీపీ(YCP) ఎంపీతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీలో చేరనున్నారు. ఆయనకు తెలుగుదేశం తరఫున నెల్లూరు ఎంపీ టిక్కెట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి మధ్యాహ్న పల్నాడు జిల్లా గురజాలలో జరగనున్న రా..కదలిరా బహిరంగలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇదే కార్యక్రమంలో నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవారాయులు(Lavu Srikrishnadevarayulu) పార్టీలో చేరనున్నారు. ఆయనకు సైతం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ హామీ ఇచ్చింది. ఆయనతోపాటు వైసీపీకి చెందిన మరో కీలక నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సైతం తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. లావు శ్రీకృష్ణదేవరాయులను గుంటూరు నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్ కోరగా... ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను నరసరావుపేట నుంచే బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి పార్టీకి ఆయన మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో ఆయన వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగనున్నారు.