Telangana BJP : యూపీ ఫార్ములాను తెలంగాణలో అమలు చేస్తున్న బీజేపీ - వర్కవుట్ అవుతుందా ?
యూపీలో రెండో సారి గెలిచేందుకు బీజేపీ అనుసరించిన ప్లాన్‌ను తెలంగాణలో అమలు చేస్తున్నారు. ఉత్తరాది ప్లాన్ ఇక్కడ వర్కవుట్ అవుతుందా ?
Telangana BJP : తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూపొందించిన త్రిముఖ వ్యూహం విజయవంతం కావడంతో ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగసభలు నిర్వహించనుంది. ముందుగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు ప్రారంభించింది.
ప్రజాగోస -బీజేపీ భరోసా యాత్ర లు ప్రారంభం
ప్రజాగోస -బీజేపీ భరోసా యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది బీజేపీ. భరోసా కార్యక్రమంలో 11వేల గ్రామాల్లో సభలు నిర్వహించనుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి రావడానికి అత్యంత కీలకమైన బైక్ ర్యాలీలను ఇప్పటికే తెలంగాణలో కూడా చేపట్టింది. 28 నియోజకవర్గాల్లో ప్రజాగోస -బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ప్రజాగోస బీజేపీ భరోసా పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ సారి గ్రామీణ ప్రాంతాలే టార్గెట్ గా ప్రజల్లోకి వెళ్లనుంది కమలం పార్టీ. అన్ని గ్రామాల్లో పార్టీ గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు.
యూపీలో బీజేపీని అధికారంలోకి తెచ్చిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు
బీజేపీ భరోసా యాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ విజయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కార్యక్రమంలో గ్రామీణ యువత ఎక్కువగా పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది. కేసీఆర్ సర్కారుపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలను గ్రామ సభలతో తమవైపు తిప్పుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా గ్రామసభలు నిర్వహించి రెండోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఉత్తర ప్రదేశ్ లో గ్రామ సభల బాధ్యత అంతా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ వర్క్ ఔట్ చేశారు. అక్కడ సక్సెస్ కావడంతో తెలంగాణలో కూడా ఉత్తర్ ప్రదేశ్ ప్లాన్ ను అమలు చేస్తోంది.
తర్వాత అగ్రనేతలతో బహిరంగసభలు
స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల తర్వాత అగ్రనేతలతో రెండోదశలో మండలం యూనిట్‌గా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట బైక్‌ర్యాలీలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక, మూడోదశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు ఏర్పాటుచేస్తారు. 15 రోజుల్లో వీటిని పూర్తిచేసి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అగ్రనేతలతో భారీ బహిరంగసభలు నిర్వహించడానికి బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోగానే నాలుగైదు బహిరంగ సభలకు ప్రధాని మోదీ హాజరయ్యేలా బీజేపీ ప్రణాళిక రూపొందిస్తోంది.
మూడు, నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా బీజేపీ గుర్తించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించింది. జిల్లాస్థాయిలో బహిరంగసభలు పూర్తయిన తర్వాత క్లస్టర్ స్థాయిలో భారీ సభలు ఏర్పాటుచేయనుంది. ఈ సభలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించేలోగా ప్రధాని మోదీ నాలుగు లేదా ఐదుసార్లు రాష్ట్రంలో పర్యటిస్తారు.
మొత్తంగా బీజేపీ... యూపీ ఎన్నికల ఫార్మాట్‌ను పూర్తిగా తెలంగాణలో అమలు చేస్తోంది. కాకపోతే అక్కడ అధికారంలో ఉండి.. రెండో సారి అధికారం కోసం ఈ ఫార్ములా అము చేసింది. ఇక్కడ మాత్రం మొదటి సారి అమలు చేస్తోంది. మరి వర్కవుట్ అవుతుందా ?