TDP YCP In BJP Trap : వైఎస్ఆర్‌సీపీ, టీడీపీలతో బీజేపీ పొలిటికల్ గేమ్ - తెలంగాణ కోసమే !
ఏపీ అధికార, ప్రతిపక్షాలు బీజేపీ ట్రాప్‌లో పడినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలోని ఆయా పార్టీల మద్దతుదారులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ఈ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది.
TDP YCP In BJP Trap : ఏపీలోని ప్రధానపార్టీలను బీజేపీ చక్కగా ఫిక్స్ చేసేసింది. మోదీ ఢిల్లీలో మాతో క్లోజ్ గా ఉన్నారంటే మాతో సన్నిహితంగా ఉన్నారని టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలు పోటీ పడి చెప్పుకుంటున్నాయి. అయితే బీజేపీ మైండ్ లో ఏముందో గమనించుకోవడం లేదు. ఏపీ పాలిటిక్స్ పై గానీ .. ఇక్కడి సీఎం సీటుపై గానీ ఆలోచించేంత సమయం.. ఆ ఉద్దేశ్యం బీజేపీకి గానీ.. మోదీ-షా ద్వయానికి గానీ లేవన్నది వాస్తవం. ప్రస్తుతం వారి ఆలోచన అంతా అతి త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. గత కొంతకాలంగా తెలంగాణలో దూసుకుపోవడానికి కమలం పార్టీ చెయ్యని కార్యక్రమాలు గానీ .. పన్నని వ్యూహాలు గానీ లేవు. అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వారు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ కోణంలోనే వారికి కనపడుతున్న మరో ఛాన్స్ సెటిలర్స్ ఓట్లు ...!
తెలంగాణలో సెటిలర్స్ ఓట్లు కీలకం !
తెలంగాణ ఏర్పడిన మరుక్షణం అందరూ ఊహించినదానికి భిన్నంగా కేసీఆర్ తీరు ఉంది. సెటిలర్స్‌కు ఎలాంటి ఇబ్బంది రానీయలేదు. వాళ్ల కాల్లో ముల్లు గుచ్చుకుంటే నోటితో తీస్తానని భరోసా ఇచ్చారు. విపరీత భావోద్వేగాల నడుమ ఉధృతంగా జరిగిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ నుంచి ఆ క్షణం అలాంటి ప్రకటన ఒకటి వస్తుందని ఎవరూ ఊహించలేదు. తెలంగాణలో సెటిలర్ల ప్రాబల్యాన్ని ఎవరూ లైట్ తీసుకోలేరు. హైద్రాబాద్ రెవెన్యూలో ఇలా సెటిలైన వారి కంట్రిబ్యూషన్ పెద్దదే. అందుకే వారిని కాదనుకునే స్థితిలో పాలకులు లేరు. దానితో అలాంటి వారు నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతాల్లోని అసెంబ్లీ సీట్లలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా వీరు మారారు. వీరి ఓట్ల ప్రభావం కనీసం ఓ 30 అసెంబ్లీ సీట్లపై ఉందని అంచనా. వారి ఓట్లు తెలంగాణలో అధికారంలోకి రావాలనుకునే రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయి . ప్రస్తుతం బీజేపీ కూడా ఆదిశగానే వ్యూహం పన్నుతోంది.
సెటిలర్స్ ఓట్లే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ
గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నసమయంలో జరిగిన అల్లర్ల విషయమై చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం సృష్టించాయి . మారిన పరిస్థితుల కారణంగా 2014లో అదే మోదీతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. ఏపీలో సంకీర్ణ ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేసారు. కానీ ఏపీ ప్రత్యేక హోదాకు బీజేపీ మంగళం పాడెయ్యడంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ధర్మపోరాట దీక్ష పేరిట మోదీ -షాలను విమర్శిస్తూనే 2019 ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్ షా వాహనంపై కొంతమంది అత్యుత్సాహపు తెలుగుతమ్ముళ్లు చేసిన దాడి ప్రయత్నం బీజేపీలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. కాంగ్రెస్‌తో జత కలిపి ఎన్నికలకు వెళ్లిన టీడీపీకి తలబొప్పికట్టింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ దారుణంగా దెబ్బతింది . అప్పటి నుంచి బీజేపీపై విమర్శల తీవ్రత తగ్గించిన టీడీపీ మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం మొదలెట్టింది అంటున్నారు పరిణామాలు గమనిస్తున్నవారు. దానికి తగ్గట్టే ఢిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో భాగంగా చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించగానే అక్కడకు వెళ్లిన చంద్రబాబు 5 నిముషాలు మోదీతో చిట్ చాట్ చేసారు. అంతవరకూ బాగానే ఉన్నా బాబు ఢిల్లీ నుంచి రాగానే టీడీపీ నేతలు దానిపై విపరీతమైన ప్రచారాన్ని మొదలెట్టారు .
మీతో చిట్ చాట్ మాత్రమే -మాతో కలిసి ఏకంగా భోజనం చేశారు : వైఎస్ఆర్‌సీపీ
దీనిపై వైసిపీ నేతలు తమదైన శైలి వెటకారాలు మొదలెట్టారు. ఎంపీ విజయసాయిరెడ్డి లాంటివారైతే వైసీపీ అధినేత ,సీఎం జగన్ మోహన్ రెడ్డి తో నీతి ఆయోగ్ మీటింగ్ సందర్భంగా మోదీ ఆయన ఉన్న టేబుల్ వద్దకే వచ్చి భోజనం చేశారని.. గంటకుపైగా సమయం అక్కడే గడిపారనీ .. బాబు కంటే తమ సీఎంకే మోదీ అధిక ప్రాధాన్యత ఇచ్చారంటూ సోషల్ మీడియాను హీటెక్కించారు. మోదీతో కలవడాన్నే చంద్రబాబు పెద్ద ఎచీవ్ మెంట్‌లా ఫీలవుతున్నారని.. గత ఏడేళ్లుగా మోదీని తిట్టినతిట్టు తిట్టకుండా విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మోదీ ప్రాపకం కోసం వెంటపడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు.
బీజేపీ టార్గెట్ తెలంగాణ - ఆటలో పావులు ఏపీ నేతలు :
అయితే అసలు బీజేపీ టార్గెట్ నే తెలంగాణ లోని ఏపీ సెటిలర్స్ ఓట్లు. ముఖ్యంగా గత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ను దాదాపు ఓడించినంత పనిచేసింది బీజేపీ . త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని ఎంఐఎం పట్టున్న 7 సీట్లను వదిలిపెట్టి . మిగిలినవాటిపై దృష్టిపెట్టాలని చూస్తుంది. ఇప్పటికే జనసేనతో ఏపీలో ఉన్న పొత్తు ద్వారా ఆయన ఇమేజ్ ను తెలంగాణలో వాడుకోవాలని భావిస్తున్న కమలం నేతలు ఇప్పుడు ఆంధ్రా సెటిలర్లను ఆకర్షించాలంటే టీడీపీ, వైసీపీ లతో తమకు వైరం ఏమీ లేదనే సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తుంది. అందులోనూ IT ఇండస్ట్రీకి చంద్రబాబు చేయూత ఇచ్చారన్న అభిప్రాయం సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ ద్వారా ఉపాధి పొందుతున్న అనేక మంది సెటిలర్స్ లో ఉంది. అలానే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, అనేక సంక్షేమ పథకాలు చేపట్టాడన్న అభిప్రాయం రాజశేఖర్ రెడ్డిపైనా ఒకవర్గం సెటిలర్స్ లో ఉంది. తద్వారా ఆయన కుమారుడిపైనా సాఫ్ట్ కార్నర్ ఉండే అవకాశం ఉంటుంది అని బీజేపీ అధిష్టానం లెక్కలు వేస్తుంది. వీటన్నింటినీ బేరీజు వేసుకునే బీజేపీ ఆకస్మాత్తుగా టీడీపీ,వైసిపీలతో సన్నిహితంగా మెలుగుతున్న భావన కల్పిస్తుంది అని ఎనలిస్టులు అంటున్నార. దీన్ని గమనించుకోని టీడీపీ, వైసిపీ నేతలు ఏపీలో ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించ్చుకుంటూ .. వంతులాడుతున్నారని సాక్షాత్తూ ఏపీ బీజేపీ నేతలే సెటైర్లు వేయడం విశేషం
నాయకులు సరే .. సెటిలర్లూ గమనించరా ?
ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ వేస్తున్న ఎత్తులను ,వ్యూహాలను ఏపీ నాయకులు గమనించక పోయినా.. సెటిలర్స్ మాత్రం పరిణామాలను పూర్తిగా విశ్లేషించుకున్నాకే అడుగుముందుకు వేస్తారని గతంలో అనేక సంఘటనలు నిరూపించాయి. సెటిలర్స్ ఓట్లపై ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే కాంగ్రెస్ తో కలిసి టీడీపీ చేసిన ప్రయోగాన్ని హైద్రాబాద్ సెటిలర్స్ నిర్మొహమాటంగా తిప్పికొట్టారు. ఈ పరిస్థితుల్లో బిజేపీ వేస్తున్న అడుగులను వారు నిశ్చితంగా గమనిస్తున్నారని.. అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకునే ఎన్నికల్లో తమ నిర్ణయం ఓటు రూపంలో చెబుతారని అంటున్నారు విశ్లేషకులు .ఈ పరిస్థితుల్లో మరి బీజేపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.