(Source: ECI/ABP News/ABP Majha)
TDP Rajya Sabha candidate : రాజ్యసభ ఎన్నికల్లో పోటీకే టీడీపీ మొగ్గు - ఆయనేనా అభ్యర్థి ?
TDP Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థిగా దళిత నేతను పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
TDP Rajya Sabha Elections : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలకు రెడీ అవుతుంది. నోటిఫికేషన్ కూడా విడుదలయింది. ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించారు. సంఖ్యాబలం ప్రకారం మూడు వైసీపీ ఖాతాలోనే పడాలి. కానీ ప్రస్తుత రాజకీయాలు మారిపోవడంతో
అన్ని రకాలుగా ఆలోచించి చంద్రబాబు అభ్యర్థిని నిర్ణయించారని చెబుతున్నారు. అయితే అధికారికంగా ఇంకా పేరును వెల్లడించకపోయినప్పటికీ అనధికారికంగా రాజ్యసభ అభ్యర్థికి ఎవరో తెలుగుదేశం పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే రాజ్యసభ స్థానాన్ని కూడా గెలవడం ఖాయమని టీడీపీ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల అయింది. రాజ్యసభ ఎన్నికలు మూడింటికి జరిగితే ఎమ్మెల్యేల బలాబలాలను పరిశీలిస్తే మూడు వైసీపీకే దక్కాల్సి ఉంటుంది. కానీ ఏదైనా జరగొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల మాదరిగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశముంది. 151 మంది సభ్యులున్న వైసీపీకి ఈ మూడు గెలవడం సాధారణ పరిస్థితుల్లో అయితే నల్లేరు మీద నడకే. అయితే అభ్యర్థులను ప్రకటించడం, నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేయడంతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ముగ్గురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామాలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో మిగిలిన అసంతృప్త ఎమ్మెల్యేలు ఓట్లు ఎటు వేస్తారో చెప్పలేని పరిస్థితి.
తమకు టిక్కెట్ ఇవ్వని కారణంగా ఆ కోపాన్ని ఇలా తీర్చుకునే అవకాశం కూడా ఉంది. అందుకే చంద్రబాబు ఒక స్థానంలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. అయితే వైసీపీ మార్పులు, చేర్పులు చేపట్టిన నియోజకవర్గాలతో పాటు, టిక్కెట్ దక్కని ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన వారే ఉన్నారంటున్నారు చంద్రబాబు. అందుకే ఈసారి కూడా పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను బరిలోకి దించాలని, సామాజికవర్గం పరంగా కూడా ఆయనకు మద్దతు లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ కార్డు పనిచేసినట్లే.. ఇప్పుడు ఎస్సీ కార్డుతో కొట్టాలని చంద్రబాబు రెడీ అయిపోయారంటున్నారు.
గతంలో రాజ్యసభకు కూడా పోటీ చేసి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయననే బరిలోకి దింపి ఎన్నికల సమయంలో వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను ఓటర్లను ఆకట్టుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. అంతా గుట్టుగా ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు పూర్తి చేస్తున్నరు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. పంచుమర్తి అనురాధాను కూడా చాలా సైలెంట్ గా గెలిపించుకోవడంతో.. ఈ సారి కూడా చంద్రబాబు మ్యాజిక్ చేస్తారని టీడీపీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.