Railway Zone Politics : రైల్వేజోన్‌తో రాజకీయం ఆటలు - ఉత్తరాంధ్ర చిరకాల వాంఛ తీరేదెన్నడు ?
విశాఖ రైల్వే జోన్ ను ఎప్పుడు ప్రారంభిస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. రాజకీయ లాభం కోసమే అన్ని పార్టీలూ చూస్తూండటంతో సమస్య మరింత జఠిలమవుతోంది.
Railway Zone Politics : రైల్వేజోన్ . ఇది ఉత్తరాంధ్ర ప్రజల కల. ఐదేళ్ల కిందట కేంద్రం ప్రకటన చేసినప్పుడు కల నెరవేరిందనుకున్నారు. కానీ ఇంత వరకూ ఒక్క అడుగు ముందుకు పడలేదు. కానీ లాభదాయం కాదంటూ తరచూ చెబుతూ వస్తున్నారు. దీంతో కేంద్రం ఉద్దేశం ప్రకారం రైల్వే జోన్ తో రాజకీయం చేసినంత కాలం చేసుకోవడం....తర్వాత చేతులెత్తేయడం అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. జోన్ ప్రకటించిన తర్వాత వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తారు. కానీ విశాఖ విషయంలో ఐదేళ్లయినా అసలు ప్రారంభం కాలేదు.
విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్ వశాఖ హక్కు !
ఎపి విభజన చట్టం సెక్షన్ 93 షెడ్యూల్(8) ప్రకారం రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఎనిమిదేళ్లయినా పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేయమని ప్రజలు అడిగితే....ఏటా రూ.8200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న రైల్వే డివిజన్‌ను ఎత్తివేస్తామని ప్రకటించింది. అదే సమయంలో జోన్ ఏర్పాటుకు విశాఖలో అన్ని వసతులూ ఉన్నా మీనమేషాలు లెక్కిస్తోంది. డివిజన్‌ను కొనసాగిస్తూ జోన్ ఏర్పాటు చేయాలన్నది ప్రజల ఆకాంక్ష. రాజకీయ లబ్ధి కోసం బీహార్‌లో ఆఘమేఘాల మీద జోన్ ఏర్పాటు చేసిన కేంద్రం.... ఇక్కడ ఎనిమిదేళ్లయినా వినిపించుకోవట్లేదు. అన్ని పరిశీలనలు పూర్తి చేసి ఐదేళ్ల కిందట ప్రకటన చేసినా అది పేపర్లలోనే ఉంది.
డీపీఆర్ రెడీ ... కానీ మనసొప్పడం లేదు !
రైల్వే బోర్డు డీపీఆర్ ఎప్పుడో రెడీ అయింది. తొలి డిపిఆర్‌లో రూ.300కోట్ల వరకూ ప్రతిపాదన పెట్టగా కేంద్ర రైల్వే శాఖ రూ.176 కోట్లకు సవరించి పంపించింది. గత ఒఎస్‌డి ధనుంజయ కాలంలోనే ఇది జరిగింది. ఉద్యోగులు, సిబ్బంది మార్పులు, చేర్పులకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే బోర్డు కోరగా పంపించారు. అంటే డిపిఆర్‌ను పరిశీ లించడమే కాదు.. ఆమోదించడమూ జరిగింది... సవరణలు కూడా చేశారు.. డిపిఆర్‌ను పరిశీలిస్తున్నామంటూ పార్లమెంట్ లో రైల్వే శాఖా మంత్రి ప్రకటించారు కూడా. తాజాగా రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదు అంటూ రైల్వే శాఖ అధికారుల ప్రకటన తర్వాత 'వదంతులు నమ్మొద్దు అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని తక్షణమే నిర్మించేందుకు భూమి, నిధులు అందు బాటులో ఉన్నాయని చెబుతున్నారు. రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం పక్కనే నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం 2017లోనే రైల్వే అధికారులు స్థలాన్ని సిద్ధం చేసి, డిపిఆర్‌లో పొందుపరిచారు. కానీ కేంద్రంలోని బిజెపి రాజకీయ జాప్యం చేస్తూనే ఉంది. అ
జోన్ ముందడుగు పడలేదు కానీ రాయగడలో కలిసిపోయిన వాల్తేర్ డివిజన్
విశాఖను రైల్వే డివిజన్‌గా కేంద్రం.. అత్యంత లాభదాయకమైన వాల్తేర్ డివిజన్‌ను మాత్రం రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కను విజయవాడ డివిజన్‌లో కలిపారు. మరో ముక్కతో ఒడిసాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే… విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుందికానీ, డివిజన్ ఉండదు. సరుకు రవాణాలో కీలకమైన కోరాపుట్, కిరండోల్ లైన్లను రాయగఢలోనే కలిపేశారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా డివిజన్‌లో ఉన్నాయి. వీటిని కూడా.. విశాఖ రైల్వేజోన్‌లో చేర్చలేదు. రైల్వే జోన్ ఇంకా పేపర్ల మీదకు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. కానీ రాయగడ డివిజన్ పనులు మాత్రం పూర్తయ్యాయి. రాయగడ డివిజన్ ఏర్పాటుకు మౌలిక వసతులేమీ లేవు. అయినా అటు రైల్వేబోర్డు, ఇటు తూర్పుకోస్తా రైల్వేజోన్ రాయగడలో ఏర్పాట్ల మీద కోట్లకు కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం రాయగడలో రూ.40కోట్ల విలువైన పనులు జరుగుతున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. డివిజన్ కేంద్ర కార్యాలయానికి భూకేటాయింపులు అయిపోయాయి. సర్వే పూర్తయింది. నిర్మాణాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారాల పెంపు, ఇతర భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రాయగడలో ఏర్పాట్ల కోసం నోడల్ అధికారిని నియమించారు. డివిజన్‌లో రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యతల్ని చూసే ఆర్‌పీఎఫ్ వ్యవస్థ ఏర్పాటు కోసం రాయగడలో నిర్మాణాలు జరుగుతున్నాయి. డివిజన్ స్థాయి అధికారుల కార్యాలయాలకు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు విశాఖలో ఉన్నాయి. డీపీఆర్‌లో ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు లాభదాయకం కాదనే వాదన వినిపిస్తున్నారు.
రాజకీయ అంశమే అయితే ఎప్పటికీ తేలదు !
రాజకీయ పార్టీలు రైల్వే జోన్ అంశాన్ని రాజకీయంగానే చూస్తే ఇది ఎప్పటికీ తీరని కోరికలాగే మిగిలే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే జోన్ వల్ల ప్రజలకు ఆశించే ప్రయోజనాలు ఉండవని ..తీసేసిన డివిజన్లు కలపాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే కేంద్రం కూడా రాజకీయంగానే ఈ సమస్యను చూస్తోంది. అందుకే పరిష్కారం లభించడం లేదు.