How Raghurama Name Missing : పీఎంవో జాబితాలోనూ రఘురామ పేరు లేదెందుకు ? స్థానిక ఎంపీకి ప్రోటోకాల్ దక్కదా ?
రఘురామకు కనీసం పీఎంవో రిలీజ్ చేసిన ప్రోటోకాల్ జాబితాలోనూ చోటు లేకపోవడంపై రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే పేరు లేకుండా చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
How Raghurama Name Missing : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు వ్యవహారం ముందు నుంచీ హాట్ టాపిక్‌గానే ఉంది. తాజాగా తన నియోజకవర్గంలో జరుగుతున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాలనుకున్న ఆయనకు చివరి క్షణంలో షాక్ తగిలింది. ఎంపీగా ఆయనను ఎవరూ గుర్తించలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ప్రధానమంత్రి కార్యాలయం కానీ లెక్కలోకి తీసుకోలేదు. ఆయన పేరు ఏ ప్రోటోకాల్ జాబితాలోనూ కనిపించలేదు. దీంతో ఆయన రైలు ఎక్కి మరీ మధ్యలో దిగిపోవాల్సి వచ్చింది. అసలు ఎంపీ పేరు జాబితాలో ఎలా మిస్ అయింది?
రఘురామ కృష్ణరాజు నర్సాపురం ఎంపీ కాదా?
నర్సాపురం పార్లమెంట్ నియోజవర్గానికి ఎంపీ రఘురామకృష్ణరాజు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యక్రమంలో ఆయనకు ప్రాధాన్యం ఉండాలి. స్థానిక ఎంపీ లేకుండా ప్రధానమంత్రి ప్రోగ్రాం జరగడం సాధ్యం కాదు. భీమవరంలో అదీ కూడా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి సమీపంలోనే విగ్రహావిష్కరణ జరుగుతున్నా ఆయనకు ఆహ్వానం దక్కలేదు. కనీసం ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇస్తారంటే అదీ కూడా ఇవ్వలేదు. ఆయన వైఎస్ఆర్‌సీపీ పార్టీని ధిక్కరించినప్పటి నుండి ఆ పార్టీ నేతలు ఆయనను ఎంపీగా గుర్తించడం లేదు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించదు. అందులో డౌట్ లేదు. మరి ఆయన పేరు ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసిన జాబితాలో ఎందుకు లేదు ?
పీఎంవో కూడా స్థానిక ఎంపీ లేకపోయినా ఎందుకు స్పందించలేదు?
ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని పీఎంవో చూసుకుంటుంది. ఈ ప్రకారం విజయవాడలో మోదీ అడుగు పెట్టినప్పటి నుండి పాల్గొనే కార్యక్రమాలు.. వీడ్కోలు వరకూ ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొంటారో ఓ లిస్ట్ ముందుగానే తయారు చేస్తారు. ఆ లిస్ట్‌లో ఎక్కడా ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన స్థానిక ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు లేదు. ఈ విషయం చివరి వరకూ తెలియదు. రఘురామకృష్ణరాజు నర్సాపురం వెళ్లేందుకు హైదరాబాద్‌లో రైలెక్కిన తర్వాత డీఐజీ పాల్ రాజ్ ఈ విషయాన్ని ప్రకటించారు ఏ జాబితాలోనూ ఎంపీ రఘురామ పేరు లేదన్నారు. అంటే.. భీమవరం వెళ్లినా పోలీసులు అనుమించరని స్పష్టమైంది. అంత కంటే అవమానం మరొకటి ఉండదని ఆయన ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.
రఘురామ విషయంలో వైఎస్ఆర్‌సీపీదే పైచేయి అయిందా ?
వైఎస్ఆర్‌సీపీతో విభేదించినప్పటి నుండి రఘురామ తన నియోజకవర్గంలో పర్యటించలేకపోతున్నారు. నర్సాపురం వెళ్లి ఆయన రెండున్నరేళ్లవుతోంది. ఆయన ఏపీలో అడుగు పెట్టిన వెంటనే ఏదో ఓ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారని ఆయన భయపడుతున్నారు. ఓ సారి ఏపీలో అడుగు పెట్టకుండానే హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత తనపై దాడి చేశారని ఆయన సుప్రీంకోర్టు వరకూ పోరాటం చేశారు. ఎప్పుడు అడుగు పెట్టినా అరెస్ట్ చేస్తామని విజయసాయిరెడ్డి లాంటి నేతలు ట్విట్టర్ ద్వారా రఘురామను పరోక్షంగా హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే రఘురామ హాజరు కాకూడదన్న లక్ష్యంతోనే వైఎస్ఆర్‌సీపీ పై స్థాయిలో చేసిన ప్రయత్నాల వల్లనే ఆయన పేరును పీఎంవో జాబితాలో కూడా లేకుండా చేశారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. నర్సాపురంలో పర్యటించి సీఎం జగన్‌కుషాకివ్వాలనుకున్న రఘురామ ప్రయత్నాల కన్నా.. ఆయనను రానివ్వకూడదన్న వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నాలే ఫలితాలిచ్చాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.