YSRCP News: వైవీ సుబ్బారెడ్డి, చిన్న శ్రీనుకు పార్టీలో అదనపు బాధ్యతలు
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు పార్టీ అధిష్టానం అదనపు బాధ్యతలను అప్పగించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయనను రీజల్ డిప్యూటీ కో-ఆర్డినేటర్‌గా నియమించింది.
ఎన్నికల టైంలో వైసీపీ ఓ వైపు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను మారుస్తూనే వారిని సమన్వయం చేసుకునేందుకు రీజనల్ కో ఆర్డినేటర్లను కూడా నియమిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనకి అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు రీజినల్ కో-ఆర్డినేటర్ నియమించారు.
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)కు పార్టీ అధిష్టానం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇప్పటి వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయనను రీజల్ డిప్యూటీ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు వైవీ సుబ్బారెడ్డిని రీజనల్ కో-ఆర్డినేటర్‌గా నియమించి పార్టీ అధిష్టానం.. రీజనల్ డిప్యూటీ కో-ఆర్డినేటర్ పేరుతో అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. ఈ నియామకంతో చిన్న శ్రీను రాజకీయ పరిధిని మరింత విస్తరించినట్టు అయింది. ఇప్పటికు విజయనగరం జిల్లా వ్యాప్తంగా తనకంటూ అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకున్న మజ్జి శ్రీనివాసరావు.. తాజా నియామకంతో మరింతగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది.
బొత్సను పక్కన పెట్టారా..?
వైసీపీలో సీనియర్ నేత, విజయనగరం జిల్లా రాజకీయాలను గత కొన్నాళ్లుగా శాసిస్తున్న బొత్స సత్యనారాయణను పక్కన పెట్టి మరీ చిన్న శ్రీనుకు అదనపు బాధ్యతలను అప్పగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ స్థానాలకు ఇన్‌చార్జ్‌గా, శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు చిన్న శ్రీనుకు రీజనల్ కో-ఆర్డినేటర్ పేరుతో అదనపు బాధ్యతలను అప్పగించడం అంటే ఒక రకంగా బొత్సను పక్కన పెట్టినట్టుగానే భావించాల్సి ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఇన్‌చార్జ్ మంత్రిగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను పరిశీలించడంతోపాటు అక్కడున్న ఇబ్బందులను పరిష్కరించడం, విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి తన భార్య బరిలోకి దిగుతుండడంతో అక్కడి రాజకీయాలను నిర్వర్తించాల్సిన బాధ్యత బొత్సపై పడింది. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలతో ఇబ్బంది కలుగుతుందన్న ఉద్ధేశంతోనే పార్టీ చిన్న శ్రీనుకు అదనపు బాధ్యతలు అప్పగించిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే, శుక్రవారం రాత్రి విడుదల చేసిర ఆరో జాబితా ప్రకటనకు బొత్స రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బొత్సను కావాలని పక్కన పెట్టారన్న ప్రచారం జరుగుతోంది.
స్పీడ్ పెంచే అవకాశం
బొత్స సత్యనారాయణ నీడ నేతగా ఎదిగిన మజ్జి శ్రీనివాసరావు రాజకీయంగా తన బలాన్ని, బలగాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. పని మీద ఎవరైనా ఆయన వద్దకు వెళితే ఏ ఊరు, ఏ పార్టీ అడగకుండా తన వరకు సాయం చేస్తారన్న పేరు ఆయనకు ఉంది. తాజాగా విస్తరించిన బాధ్యతలతో తన పరిధించి పెంచుకుంటూ బలమైన నేతగా ఎదిగే ప్రయత్నాన్ని చిన్న శ్రీను చేస్తారని చెబుతున్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డితోపాటు పార్టీలోని కీలక నాయకులకు ఆయన సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో గానీ, పార్టీ ఆదేశిస్తే పార్లమెంటుకుగానీ వెళ్లేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. ఈ నేపత్యంలో పార్టీ బాధ్యతలను అప్పగించడం ఆయనకు మరింత బలాన్ని పెంచేదిగానే పలువురు చెబుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో చిన్న శ్రీనుకు పోటీ చేసే అవకాశం లేదని, అందుకే పార్టీ బాధ్యతలను అధిష్టానం అప్పగిస్తోందని చెబుతున్నారు. ఈ నియామకం వెనుకున్న కారణాలేమిటన్నది రానున్న రోజుల్లో తేలనుంది.