Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమి ఎమ్మెల్యే దామచర్లపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దామచర్ల కూడా రివర్స్ లో విరుచుకుపడుతున్నారు. ఈ రాజకీయం ఎక్కడికి వెళ్తుంది?

TDP vs Janasena: ప్రకాశం జిల్లా ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి , స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ల మధ్య తలెత్తిన రాజకీయ వైరం తీవ్ర రూపం దాల్చుతోంది. వైఎస్సార్సీపీ ని వీడి జనసేనలో చేరినప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే దామచర్లను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించడం, దానికి ప్రతిగా దామచర్ల కూడా సవాళ్లు విసరడంతో ఒంగోలు రాజకీయాలు కూటమి వర్సెస్ కూటమి అనే స్థాయికి చేరాయి.
వ్యక్తిగత శతృత్వం - ఆధిపత్య పోరు
ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల కుటుంబాల మధ్య రాజకీయ వైరం దశాబ్దాలుగా కొనసాగుతోంది. గతంలో ఇరు నాయకులు ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీపడేవారు. అయితే బాలినేని జనసేన పార్టీలో చేరినప్పటికీ, పాత విభేదాలు మాత్రం వీడలేదు. ఒంగోలుపై తన పట్టు నిలుపుకోవాలని బాలినేని ప్రయత్నిస్తుంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా పూర్తి ఆధిపత్యం చెలాయించాలని దామచర్ల భావిస్తున్నారు. ఇద్దరి లక్ష్యం ఒంగోలు రాజకీయాన్ని శాసించడమే కావడంతో ఈ ఘర్షణ వ్యక్తిగత స్థాయికి చేరింది. తాజాగా బాలినేని తన అనుచరులను కాపాడుకునేందుకు నేరుగా రంగానికి దిగారు. స్థానిక పోలీసులు ఎమ్మెల్యే దామచర్ల ఒత్తిళ్లతో తన వర్గానికి చెందిన వారిపై, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇసుక, మద్యం, రేషన్ బియ్యం మాఫియాల వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్‌గా.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమాల నుంచి తప్పించుకోవడానికే బాలినేని జనసేన ముసుగు వేసుకున్నారని, ఒంగోలులో రౌడీయిజం చెల్లదని దామచర్ల విమర్శలు గుప్పించడంతో పరిస్థితి తీవ్రమైంది.
కోవర్ట్ రాజకీయాలు - టీడీపీ వర్గాల అనుమానాలు
జనసేనలో చేరినప్పటికీ బాలినేని వైఎస్సార్సీపీ నాయకులకు మద్దతుగా పనిచేస్తున్నారని, టీడీపీ-జనసేన కూటమిలో చిచ్చు పెట్టేందుకు 'కోవర్ట్'గా వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతలపై విచారణ జరగకుండా అడ్డుకోవడానికి , తన పాత కేడర్‌ను కాపాడుకోవడానికి జనసేన జెండాను వాడుకుంటున్నారనే ఆరోపణలు టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. నాయకుల మధ్య సాగుతున్న ఈ పోరు సోషల్ మీడియా వార్‌గా మారి, ఇప్పుడు నేరుగా వీధుల్లోకి వచ్చే వాతావరణం కనిపించడం వల్ల టీడీపీ, జనసేన దిగువ స్థాయి కేడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోంది. ఎన్నికల్లో కలసి పనిచేసిన రెండు పార్టీల శ్రేణులు ఇప్పుడు పరస్పరం పోలీసు స్టేషన్ల ముందు ధర్నాలు చేయడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఉమ్మడి క్యాడర్ స్పూర్తి దెబ్బతింటోంది.
కూటమి పై ప్రతికూల ప్రభావం
ఒంగోలులో సాగుతున్న ఈ అంతర్గత పోరు కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి నేతలే ఒకరిపై ఒకరు ఇసుక, మద్యం అవినీతి ఆరోపణలు చేసుకోవడం ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి అతిపెద్ద రాజకీయ ఆయుధంగా మారింది. ఈ సెగ కేవలం ఒంగోలుకే పరిమితం కాకుండా ప్రకాశం జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు పాకితే, కూటమిలోని టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య సఖ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.
రంగంలోకి అధిష్టానాలు - పరిష్కారం దిశగా అడుగులు
పరిస్థితి చెయ్యి దాటుతుండటంతో టీడీపీ, జనసేన అధిష్టానాలు త్వరితగతిన స్పందించాయి. ఇరు పార్టీల సీనియర్ నేతలు కలసి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఇద్దరు నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ విమర్శలు ఆపి, ఏవైనా సమస్యలు ఉంటే సమన్వయ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి - దామచర్ల జనార్ధన్ ల మధ్య పోరు కేవలం ఒక స్థానిక నియోజకవర్గ సమస్య కాదు. స్థానికంగా బలంగా ఉన్న పాత ప్రత్యర్థులు కూటమి గొడుగు కిందకి వచ్చినప్పుడు తలెత్తే సవాళ్లకు ఇది అద్దం పడుతోంది. అధిష్టానాలు వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే, ఈ వ్యక్తిగత ఆధిపత్య పోరు కూటమి ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















