Dharmana Prasada Rao : ఎవర్నడిగినా సైకిల్ అంటున్నారు - వైసీపీ గుర్తు గురించి ప్రజలకు తెలియదు - ధర్మాన కీలక వ్యాఖ్యలు
Andhra Politcs : వైసీపీ గుర్తు ఫ్యాన్ గురించి ప్రజలకు పెద్దగా తెలియదని ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏ పార్టీకి ఓటు వేస్తానంటే ఫ్యాన్ గురించి చెప్పడం లేదని ఆయనంటున్నారు.
YCP symbol Issue : ఎవరికి ఓటేస్తారని ఎవరిని అడిగినా కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకే అంటున్నారన్నారు. ఏ గుర్తుకు ఓటేస్తారు అంటే సైకిల్, హస్తం గుర్తు పేర్లే చెబుతున్నారని.. వైసీపీ గుర్తు ఫ్యాన్ గురించి ఎవరూ చెప్పడం లేదని మంత్రి ధర్మానస ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ మన పార్టీ గుర్తు తెలియటం లేదని పార్టీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
శ్రీకాకుళం రూరల్ మండలం బెండివానిపేటలో ధర్మాన ప్రసాదరావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పార్టీ గుర్తు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లండని పార్టీ కార్యకర్తలకు ధర్మాన కోరారు. పార్టీ గుర్తు ఏంటో కూడా ఓటర్లకు తెలియడం లేదంటూ ధర్మాన చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నికల సమయం వచ్చేసినా ఇంకా ఓటర్లకు వైసీపీ గుర్తు తెలియకపోవడమేంటని వైసీపీలోనే కామెంట్స ్వినిపిస్తున్నాయి. ఆయన ఫ్యాన్ గుర్తుపైనే గత ఎన్నికల్లో గెలిచారు.
ధర్మాన ప్రసాదరావు ఇటీవలి కాలంలో ఇంతే వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. ఏదైనా సమావేశం పెడితె ఎవరికి ఓటేస్తారని సభకు వచ్చిన వారిని అడుగుతారు. వారు ఫ్యాన్ గురించి తప్ప మిగతా గుర్తుల గురించి చెబతారు. దీంతో ఆయన పలుమార్లు అసహనానికి గురయ్యారు. వివాదాస్పద వ్యాక్యలు చేశారు. మగవాళ్లు పోరంబోకులని ఓ సారి వ్యాఖ్యానించారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆచీతూచి పద్ధతిగా మాట్లాడే ధర్మాన ఇప్పుడు నోరు జారుతు న్నారు. ఆసరా సభల నుంచి మహిళలు బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేయించడం.. వారి కోసం వచ్చిన ఆటోలు తీయవద్దని చెప్పడం.. ధర్మాన స్టైల్ కానేకాదు. పెద్దసభ జరిగినపుడు కొంతమంది మధ్యలోనే వెళ్లిపోతారని, అంతమాత్రాన పెద్దగా చూడాల్సిన అవస రం లేదని, తన నియోజకవర్గంలో మనుషులు కాబట్టి తాను చనువుగా మాట్లాడానని ధర్మాన చెప్పుకొచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. గత నాలుగు ఎన్నికల్లో మూడు సార్లు ఆయన విజయం సాధించారు. కానీ ఎప్పుడూ ఆయన మెజార్టీ పది వేల ఓట్ల దరి దాపుల్లోకి రాలేదు. గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో గెలిస్తే జనసేన పార్టీకి ఏడున్నర వేల ఓట్లు వచ్చాయి. జనసేన ఓట్లు చీల్చబట్టి గత ఎన్నికల్లో ధర్మాన బయటపడ్డారు. లేకపోతే వరుసగా రెండో సారి ఓడిపోయేవారు. కానీ జనసేన పుణ్యమా అని ఆయన గెలవడతో పాటు రెండో టర్మ్ లో అయినా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి కాలంలో ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.