Jagan Vs KCR: కేంద్రాన్ని ఢీకొట్టేందుకు కేసీఆర్ రెడీ, మరి జగన్ దారెటు ? ఎవరి వ్యూహాలు వాళ్లవే !
Parliament Monsoon Session 2022: ఎన్డీయేపై పోరులో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు తన వ్యూహానికి మార్గాన్ని ఎంచుకున్నారు. మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
Parliament Monsoon Session 2022: కేంద్రంతో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీతో, బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు తన వ్యూహానికి మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే ఎన్డీయేకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల అధినేతల్ని కలుసుకున్న కేసీఆర్ పార్లమెంటు సమావేశాల వేదికగా యుద్ధానికి సమరశంఖం పూరించాలని భావిస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
జూలై 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు..
ఈ నెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలనే యుద్ధ వేదికగా మార్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే తన మిత్రపక్షాల నేతలతో ఫోన్లలో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు రాష్ట్రాల ఎన్డీయే వ్యతిరేక నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో ఇటు తెలంగాణ ఎంపీలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తితే అటు మోదీపై వ్యతిరేకత ఉన్న రాష్ట్రాలు కూడా ఆయా సమస్యలను ఎత్తి చూపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహాయించి ఏఏ రాష్ట్రాలకు ఏ విధంగా మోదీ సర్కార్ అన్యాయం చేస్తోందో ఈ పార్లమెంటు సమావేశాల్లో బయటపెట్టబోతున్నారట. అందుకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆయా పార్టీల ఎంపీలు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ముకుమ్మడి దాడి..
ఎన్డీయే వ్యతిరేక పక్షాలు మూకుమ్మడి ఎటాక్ తో మోదీకి పార్లమెంటులోనే చుక్కలు చూపించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. తనని టచ్ చేస్తే ఊరుకుంటాను కానీ తన రాష్ట్రాన్ని టచ్ చేస్తే ఊరుకోనని ఇంతకుముందే తెలంగాణ సీఎం పలు సందర్భాలలో స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణకి మోదీ, బీజేపీ చేస్తోన్న అన్యాయాన్ని బయటపెట్టి రాష్ట్రంలో ఎగిరెగిరిపడుతున్న కాషాయానికి ఎండ్ కార్డ్ పడేలా చేస్తామంటున్నారు గులాబీ బాస్.
ఇంకోవైపు కేసీఆర్ తో పాటు మోదీపై వ్యతిరేకత ఉన్న పార్టీలన్నీ పార్లమెంటు వేదికగా ఏకమవుతుంటే ఏపీ సీఎం జగన్ మాత్రం మౌనంగా ఉన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఆ పార్టీ ఎంపీల వ్యూహం ఏంటన్నది తెలియరాలేదు. కేసీఆర్ తో గొంతు కలుపుతారా లేదంటే నమో మోదీ అంటారా అన్నది తెలుసుకోవాలంటే 19వరకు ఆగాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ నిపుణులు. వైఎస్ జగన్ ఎప్పుడైతే ఏపీకి సీఎం అయ్యారో అప్పటి నుంచి కేంద్రంతో సన్నిహితంగానే ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కావల్సిన ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఇప్పుడు కేసీఆర్‌తో దూరంగానే ఉంటారని, అంతేకాదు తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు గురించి కూడా ఇప్పటికే మోదీకి విన్నపాలు చేసుకున్నారు కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏపీకి అనుకూలంగా కేంద్రం కొన్ని వరాలు ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అందుకే జగన్ తన వ్యూహానికి తగ్గట్టు నడుచుకుంటారని తేల్చేశారు.
మొత్తం 24 కొత్త బిల్లులు..
ఇంకోవైపు ఆగస్టు 12వరకు జరగనున్న ఈ పార్లమెంటు సమావేశాల్లో మొత్తం 24 కొత్త బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఈ బిల్లులన్నింటిని పాస్ చేసుకొని విపక్షాలకు ధీటుగా నిలబడాలన్నది మోదీ అండ్ టీమ్ యోచన. 17వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలను వేదికగా చేసుకొని యుద్ధానికి సై అంటే ఎన్డీయే కూడా అదే రీతిలో విపక్షాలను సభ నుంచి బహిష్కరించే అవకాశాలూ లేకపోలేదని గుర్తుచేస్తున్నారు.