(Source: ECI/ABP News/ABP Majha)
మీడియా మేనేజ్మెంట్‌కీ పోల్ మేనేజ్మెంట్‌కీ తేడా ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకుంటారా ??
పోల్ మేనేజ్‌మెంట్ స్తే ప్రభావం ఎలా ఉంటుందో ఉత్తరాంధ్ర, రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. టీడీపీ అభ్యర్థులుగా వేపాడ చిరంజీవి, శ్రీకాంత్ గెలుపు క్రెడిట్ మొత్తం క్షేత్రస్థాయిలో ఉన్న శ్రేణులదే.
ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షమే అనుకున్నారంతా కానీ అనూహ్యంగా పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ ఆధిపత్యం కొనసాగించింది. దీనికి క్రెడిట్ మొత్తం క్షేత్ర స్థాయి కార్యకర్తలు, నాయకులదే అంటున్నారు విశ్లేషకులు.
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ భారీ ఆధిక్యం సాధించింది. అధికార పార్టీ హవాను, బలాన్ని ఎదురొడ్డి పసుపు జెండా తన ప్రభావాన్ని చూపింది. అయితే ఈ విజయం వెనుక పూర్తిగా పార్టీ కార్యకర్తలు,క్రింది స్థాయి నేతల కృషి ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ విజయాన్ని టీడీపీ హై కమాండ్ కూడా ముందుగా అంచనా వేయలేక పోయింది అనీ, అందుకే నాలుగో రౌండ్ ముగిశాక మాత్రమే రంగంలోకి దిగి హడావుడి చేసింది అన్న విమర్శలు వస్తున్నాయి.
పూర్తిగా మీడియా మేనేజ్ మెంట్ లోనే టీడీపీ మునిగిపోయిందా?
టీడీపీ మొదటి నుంచీ పోల్ మేనేజ్‌మెంట్‌లో వీక్ అనే అభిప్రాయం విశ్లేషకుల్లో ఉంది. ఇంతవరకూ పోటీ చేసిన ప్రతీ ఎన్నికలోనూ అయితే వేవ్, లేకుంటే అప్పటికున్న అధికార పార్టీపై వ్యతిరేకత ఈ రెండు అంశాలపైనే టీడీపీ గెలుస్తూ వచ్చింది. 1983, 85లో జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఎన్టీఆర్ ఆకర్షణతో అధికారంలోకి వస్తే 1989లో ఓటమి పాలైంది. మళ్లీ 1994 ఎన్టీఆర్ హవా 1999లో చంద్రబాబు పనితీరుపై ప్రజల నమ్మకంతో వరుసగా గెలుస్తూ వచ్చింది తెలుగు దేశం.
అక్కడి నుంచి మీడియాపై చంద్రబాబు అతిగా అధారపడడం మొదలైంది అంటారు నాటి సీనియర్ ఎనలిస్ట్‌లు. కిందిస్థాయి కార్యకర్తలు, నేతల స్థానే నమ్మకస్తులు, మీడియా జనాలు,కార్పొరేట్ సంస్థలకు ప్రచార బాధ్యతలు అప్పగించడం మొదలెట్టారు అనేది ఓ విమర్శ. ఫలితమే 2004,2009 సంవత్సరాల్లో వరుస ఓటములు.
తర్వాత తాను మారానని పదే పదే చెబుతూ వచ్చారు బాబు. అయితే ఈ లోపు రాష్ట్ర విభజన జరగడం... అనాథలా మిగిలిన ఏపీకి అనుభవం ఉన్న నేత కావాలని ప్రజలు భావించడం దానికి పవన్, బిజెపి పొత్తు అన్నీ కలిసి చంద్రబాబుకు అధికారం అందజేశాయి. అయితే అందివచ్చిన అవకాశాన్ని ఆయన చేజేతులా పాడు చేసుకున్నారన్న విమర్శ ఉంది. ఎంతసేపూ రివ్యూలు, మీటింగ్స్ అంటూ తిరుగుతూ క్రమంగా నేలను విడిచిపెట్టేశారు. మళ్లీ మీడియాపై అతిగా ఆధారపడటం మొదలు పెట్టారు. ఎక్కడా నెగిటివిటీ లేదనే భ్రమను కల్పించారు. పార్టీ నేతలే చికాకు పడే స్థాయిలో భజన చెయ్యడం ఒక తంతులా మారింది అంటారు నాటి వ్యవహారం తెలిసిన వారు.
నేడు జగన్ ప్రభుత్వం ఇప్యాక్‌ను ఎలా రంగంలోకి దింపిందో అలానే ఒక కార్పొరేట్ సంస్థను టీడీపీ కూడా అధికారంలో ఉండగా కొనసాగించింది అన్న విషయం బయటి వాళ్లకు పెద్దగా తెలియదు. ఏదైనా ఉంటే నేరుగా వాళ్లే చూసుకుంటారులే అన్న ధీమ అధినాయకత్వంలో ఏర్పడింది. దీంతో క్షేత్ర స్థాయిలో నాయకుల్లో అసంతృప్తి అసహనం పెరిగింది. తమను పైవాళ్లు పట్టించుకోలేదనే ఫీలింగ్ ఏర్పడింది. 2019 ఎన్నికల్లో ఆ భావనే పార్టీకి ప్రతి కూలంగా మారింది అంటారు.
2019 ఎన్నికల్లో అంత పెద్ద ఓటమి ఎదురైనా ఇంకా చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్‌పైనే ఆధారపడుతూ వస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. 2014 లో టీడీపీ అధికారంలోకి రాగానే పార్టీలోకి వచ్చి హడావుడి చేసిన వాళ్ళూ, పదవులు పొందిన వాళ్ళూ పార్టీ ఒడిపోగానే సైడైపోయారు. మళ్లీ పార్టీకి ఏళ్ల తరబడి సేవ చేస్తున్న కార్యకర్తలే దిక్కయ్యారు. కానీ బాబు మాత్రం ఇంకా అదే మీడియా ప్రభావంలో ఉన్నారనేది ఒక విశ్లేషణ. ఈ మీడియా మేనేజ్‌మెంట్‌లో పడి పోల్ మేనేజ్ మెంట్‌ని పక్కన పెట్టేశారు అనేది ప్రధాన విమర్శ.
పోల్ మేనేజ్మెంట్ అంటే బ్రహ్మ పదార్థం ఏమీ కాదు
2014 నుంచి ఎన్నికల్లో పోల్ మేనేజ్‌మెంట్ కీలకంగా మారింది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నాయకులకు బాధ్యతలు అప్పగించాలి. అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, తమ విధానాలు ఏంటి అన్నది వివరించాలి. ప్రచారం చెయ్యాలి. ఇంటింటికీ తిరిగి వారితో ఒక కమ్యునికేషన్ వ్యవస్థ ఏర్పాటు చెయ్యాసి. నేరుగా ఓటర్లను కలుసుకునేలా ప్లాన్ చేయాలి.
క్షేత్రస్థాయిలో నాయకులకు బాధ్యతలు పంచినట్టు అవుతుందీ.. ఓటర్లతో నేరుగా సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. ఇలాంటి వాటి ద్వారా అధినేత తమపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించారన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రజలతో పార్టీకి డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుంది. దురదృష్ట వశాత్తూ టీడీపీ ఈ పాయింటే మిస్ అవుతుంది. గతంలో జన్మభూమి కమిటీలు అని వేస్తే అది బూమ్ రాంగ్ అయింది. ప్రజలతో కలిసి పోవడానికి బదులు వారిపై అధికారం కోసం ప్రయత్నించడమే వాటి ఫెయిల్యూర్‌కి కారణం. దాన్ని సరిచేయడంలో అధినాయకత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు కూడా తమ విధానాలపై, ప్రజాసమస్యలపై చర్చ మానేసి అస్తమానూ ప్రభుత్వాన్ని విమర్శించడమే కొందరి నేతలకు పనిగా ఉంది. ఇది సామాన్య జనాలు సైతం విసుక్కుంటున్న పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుందన్నది మరో సత్యం.
పోల్ మేనేజ్మెంట్‌తో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం
పోల్ మేనేజ్‌మెంట్ సరిగ్గా చేస్తే ప్రభావం ఎలా ఉంటుంది అనడానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. టీడీపీ అభ్యర్థులుగా వేపాడ చిరంజీవి, శ్రీకాంత్ గెలుపు క్రెడిట్ మొత్తం క్షేత్రస్థాయిలో ఉన్న శ్రేణులదే. కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు.
తమ అభ్యర్థులను గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అర్థమయ్యేలా వివరించారు. చట్టసభలో ఎలాంటి అంశాలు లేవనెత్త వచ్చో సూటిగా చెప్పారు. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన మేలును గుర్తు చేశారు. ఇలాంటి అంశాలను ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లారు.
ఓడిపోతున్నామన్న మ్యాచ్‌ను గెలిపించారు కార్యకర్తలు, క్షేత్రస్థాయిలోని నాయకులు. ఈ ఎన్నికలపై టీడీపీ అధినాయకత్వం పెద్దగా హడావుడి చేయలేదు. చంద్రబాబు ఓ వీడియో విడుదల చేశారే తప్ప అంతకు మించి ఏం చేసినట్టు కనిపించలేదు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు స్వేచ్ఛగా ప్రచారం చేశారు. విజయాన్ని సాధించారు. కౌంటింగ్ మొదలై 4 వ రౌండ్ దాటగానే మెజారిటీ వస్తుందన్న సంగతి తెలియగానే చంద్రబాబు, ఇతర నేతలు హడావుడి మళ్లీ మొదలెట్టారు. సరే..అదంతా గెలుపు ఉత్సాహం అనుకున్నా...క్రెడిట్ పూర్తిగా క్షేత్ర స్థాయి కార్యకర్తలకు ఇవ్వాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.
ఇప్పటికైనా ఆ మీడియా మక్కువ తగ్గించి, పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడితే చంద్రబాబు మళ్లీ సరైన ట్రాక్ ఎక్కే అవకాశం ఉంటుందని కొందరు టీడీపీ లీడర్లు కూడా చెప్పుకుంటున్న సత్యం. ఎమ్మెల్సీ ఎన్నికలను కేస్ స్టడీగా తీసుకొని అధినాయకత్వం తమలోని లోపాలు సవరించుకోవాలని సూచిస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని చెబుతున్నారు. బాబు గారూ...వింటున్నారా??