Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Telangana News: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్లకు ఆటంబాంబు పేలబోతోందంటూ వ్యాఖ్యానించారు.
Minister Ponguleti Srinivasreddy Comments: రాష్ట్రంలోనే త్వరలోనే ఆటంబాంబ్ పేలుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాలో గురువారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వర్ధన్నపేటలో ఆయన మాట్లాడారు. 'తప్పు చేసిన వాళ్లకు నాటుబాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటమ్‌బాంబు పేలబోతోంది. జనం సొమ్మును అక్రమమార్గంలో విదేశాలకు పంపారు. ఎంత పెద్దవాళ్లకైనా చట్టం చుట్టం కాదు. రూ.55 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో తేలుస్తాం. తప్పు చేయని వాళ్లు ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు.' అని పేర్కొన్నారు. అటు, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి అన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నా.. సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపడం లేదని నిర్విరామంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యానికి 11 నెలలు నిండాయని అన్నారు.
దీపావళి బాంబుల వ్యాఖ్యలు వైరల్
కాగా, ఇటీవల సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి అక్కడికి తీసుకెళ్లిన మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూ ఇచ్చి మరీ దీపావళికి బీఆర్ఎస్‌పై బాంబులు పేలుస్తామని అన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అగ్రనేతల అరెస్టులు ఉంటాయని అంతా భావించారు. ముఖ్యంగా జన్వాడ ఫాంహౌస్ కేసు, ఫార్ములా ఈ కార్ రేస్ ఆరోపణల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే అంతా భావించారు. అయితే, అలాంటిదేమీ జరగలేదు. అనంతరం సచివాలయంలో ఇటీవల చిట్ చాట్ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఇదే అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు. 'దీపావళి అయిపోయింది. అయినా బాంబులు పేలలేదేంటి సార్' అంటూ ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే 'నన్ను ర్యాగింగ్ చేస్తున్నారా?' అంటూ జర్నలిస్టులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పొడిపొడిగా స్పందించిన ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పేలుతాయని పొంతన లేని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకొంత స్పష్టంగా సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించగా.. ఆయన రిపోర్టర్లపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాజాగా ఆయన మళ్లీ ఆటంబాంబ్ వ్యాఖ్యలు చేశారు. మరి అవి ఎలాంటివో అంటూ అటు ప్రజలు, ఇటు ప్రతిపక్ష నేతల్లోనూ ఆసక్తి నెలకొంది.
మరోవైపు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పొంగులేటి గురువారం పాల్గొన్నారు. 'రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. ప్రత్యక్షంగా రైతుల కోసం రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశాం. మిగతా రూ.12 వేల కోట్ల రుణమాఫీ చేస్తాం. తాము ఇచ్చే స్మార్ట్ కార్డు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి వర్తిస్తుంది. ధరణిలో విదేశాల సంస్థలకు ఇచ్చిన భూమిని మళ్లీ తీసుకొస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నాం. పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. గుమ్మడికాయ దొంగ అంటే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి.' అని అన్నారు.